మధుమేహ వేళలో..

రాగిజావ.. తైద అంబలి.. జొన్న గట్క.. ఇవే మన ఆహారం. పొద్దున నుంచీ సాయంత్రం దాకా కాయకష్టం.. ఇదీ ఒకప్పటి మన జీవనశైలి. ఎప్పుడో అమాస, పున్నమికి అన్నట్టు ఏ పండగలప్పుడో తెల్ల అన్నం వండుకుంటే మహా ఎక్కువ. అదే మన ఆరోగ్యానికి పూలబాటలు వేసింది. తెల్ల అన్నం అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత నగరమనీ లేదు.. గ్రామమనీ లేదు.. ఎక్కడ చూసినా బీపీలూ, షుగర్లూ. గ్రామాల్లో కూడా 4 నుంచి 7 శాతం మంది మధుమేహులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది డయాబెటిస్తో బాధ పడుతుంటే, మన దేశంలో అది 10 నుంచి 12 శాతానికి చేరింది. హైదరాబాద్ అయితే డయాబెటిస్ రాజధానే అయింది. 15 నుంచి 17 శాతం మంది హైదరాబాదీయులు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు.
వ్యాపారికి మార్కెటింగ్ స్ట్రెస్.. ఉద్యోగికి వర్క్ స్ట్రెస్.. విద్యార్థికి మార్కుల స్ట్రెస్.. కాలంతో పరుగులు తీయడం మొదలుపెట్టినప్పటి నుంచీ మనలో ఒత్తిడి రెండింతల వేగంతో పెరిగిపోతున్నది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ స్ట్రెస్ మరింత ఎక్కువగా ఉంటున్నది. ఈ ఒత్తిడిలో పడి కొట్టుకుపోతూ శరీరానికి కనీస చురుకుదనం లేకుండా పోయింది. శారీరక శ్రమ, వ్యాయామాలకూ మనకు టైం లేదు. వీటికి తోడు మనవైన సంప్రదాయ ఆహారపు అలవాట్లను మానేశాం. నాగరికత పేరుతో అనారోగ్యకరమైన ఆహారాలకు అలవాటు పడిపోయాం. దాంతో జీవనశైలి వ్యాధులు ఒక్కొక్కటిగా వచ్చిపడుతున్నాయి. శరీరంలో ఏ భాగంలో కొవ్వు పెరిగినా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారి తీస్తుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తవుతుంది గానీ పనిచేయదు. ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవుతాయి. ఈ చర్యలు ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. అంతేగాక స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, డిప్రెషన్ కలిగినప్పుడు ఎక్కువగా, ఏది పడితే అది తినేస్తుంటారు. అలా జంక్ ఎక్కువ మొత్తంలో కడుపులోకి వెళ్లిపోతుంది. అది కొవ్వు పెరగడానికి కారణమై డయాబెటిస్‌కి దారితీస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణమవుతుంది.
షుగర్ ఉందా.. లేదా?
డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ రక్తపరీక్షలు చాలా ముఖ్యం. ఉదయాన్నే ఏమీ తినకముందు చేసేది ఫాస్టింగ్. తినడం మొదలుపెట్టిన రెండు గంటల తరువాత తీసుకునే రక్తపరీక్ష పోస్ట్ లంచ్. చాలామంది రాండమ్ టెస్టులు చేస్తుంటారు. ఇది సరికాదు. అత్యవసరం అయితే తప్ప ఇది అనవసరం. చికిత్స మొదలుపెట్టాలంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ టెస్టుల ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. హెచ్‌బీఏ1సీ కూడా ముఖ్యమే. కానీ దీని ఆధారంగా చికిత్స చేయలేం. గత రెండు మూడు నెలలుగా రక్తంలో చక్కెర ఏ మేరకు కంట్రోల్లో ఉందో చెప్పేదే హెచ్‌బీఏ1సీ. కాబట్టి ప్రెగ్నెన్సీలో, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్, ఇతర సర్జరీలకు ముందు ఈ పరీక్షను లెక్కలోకి తీసుకుంటారు. టైప్-1 చికిత్సలో ఇన్సులిన్ ఎంత ఇవ్వాలనేది ప్లాన్ చేయడం కోసం కూడా ఇది చేస్తారు. హెచ్‌బీఏ1సీ విలువ 6.5 వరకు ఉండవచ్చు. కానీ ఇటీవల 7 వరకూ ఉండవచ్చని డబ్ల్యుహెచ్వో చెప్పింది. ఫాస్టింగ్ నార్మల్ ఉన్నప్పటికీ ఇంకా అనుమానంగా ఉంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జిటిటి) చేస్తారు.
నవంబర్ 14.. వరల్డ్ డయాబెటిస్ డే
ఫ్రెడరిక్ జి. బాంటింగ్ 1922లో ఇన్సులిన్‌ను కనుగొన్నాడు. ఆయన జన్మదినమైన నవంబర్ 14న డయాబెటిస్ డే జరుపాలని 1991లో ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ భావించింది. ఆ తర్వాత 2006లో డబ్ల్యుహెచ్వో, యుఎన్ఓ సంయుక్తంగా ఈ రోజున వరల్డ్ డయాబెటిస్ డే జరుపుకోవాలని నిర్ణయించాయి. దీని సంకేతంగా నీలిరంగు రింగును నిర్ధారించారు. ఈ సంవత్సరం డయాబెటిస్ డే ముఖ్య ఉద్దేశం.. నర్సులను మధుమేహ అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేయడం. ఆశ వర్కర్ల నుంచి నర్సుల వరకు అందరికీ డయాబెటిస్ నివారణ, ఆహార నియమాలు, వ్యాయామ పద్ధతులు, కొంతవరకు చికిత్సా పద్ధతుల్లో అవగాహన కల్పించాలని పిలుపునిస్తున్నది. దీనివల్ల క్షేత్ర స్థాయిలో మధుమేహ తీవ్రతను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇలా నివారిద్దాం
డయాబెటిస్‌కు ఆహార వ్యాయామాలే ప్రధాన చికిత్సలు. అందుకే, ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారమే తీసుకోవాలి. రోజుకి 1800 నుంచి 2000 కేలరీలకు మించి వద్దు. ప్రెగ్నెన్సీ అయితే 2000 కేలరీలు తప్పనిసరి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగాలో ముఖ్యంగా ధ్యానం సహాయపడుతుంది. అయితే, రోజూ సాధన చేయాలి. ప్రాథమిక వ్యాయామం అవసరం. కనీసం 40 నిమిషాలు వాకింగ్ అయినా చేయాలి. ప్రెగ్నెన్సీలో గైనకాలజిస్టు సలహా తీసుకుని వ్యాయామం చేయాలి. 60 సంవత్సరాల తర్వాత ఇసిజి లాంటివి చెక్ చేసుకుని, డాక్టర్ సలహా మీదట వ్యాయామం మొదలుపెట్టాలి.
డాక్టర్ ఎన్. సుధాకర్ రావు
డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ ఎండోక్రైనాలజీ అండ్ అడిపోసిటీ
(ఐడియా క్లినిక్స్) ,హైదరాబాద్
తాజావార్తలు
- పోలీస్ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు
- RRR క్లైమాక్స్ మొదలైంది..రాజమౌళి ట్వీట్ వైరల్
- మావోయిస్టుల కంటే కాషాయ పార్టీ ప్రమాదకరం : మమత
- శంషాబాద్ విమానాశ్రయంలో ప్లాజా ప్రీమియం లాంజ్ పునరుద్ధరణ
- ఇండియన్స్‌ను తక్కువ అంచనా వేయం: ఆస్ట్రేలియా కోచ్
- 'కృష్ణా బోర్డు విశాఖలో వద్దు'
- టెస్లా ఎంట్రీతో నో ప్రాబ్లం: బెంజ్
- చైనాకు కాంగ్రెస్ లొంగుతుందా? : జేపీ నడ్డా
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ఎంపీలకు జలక్.. పార్లమెంట్లో ఆహార సబ్సిడీ ఎత్తివేత