బుధవారం 25 నవంబర్ 2020
Health - Oct 27, 2020 , 00:07:49

శిరోఘాతం తప్పించుకుందాం!

శిరోఘాతం తప్పించుకుందాం!

పక్షవాతం అంటే ఒకప్పుడు ఇక మంచాన పడి ఉండటమే అనుకునేవాళ్లు. రోగితో పాటు కుటుంబం కూడా ఎన్నో బాధలు పడేది. వైద్యులు కూడా ఏమీ చేయలేని స్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఎదుర్కోగల అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలితో బీపీ, అధిక ఒత్తిడి లాంటివాటిని కంట్రోల్‌ చేసుకోవడం, ఒకవేళ పక్షవాత లక్షణాలు కనిపిస్తే మరుక్షణమే స్పందించి డాక్టర్‌ దగ్గరికి వెళ్లడం... ఇవే మనం చేయాల్సిన పనులు. పక్షవాతం వల్ల మెదడును రక్షించగల ఆధునిక మందులు, చికిత్సలను అందిస్తున్నది ఇప్పటి వైద్యరంగం. వరల్డ్‌ స్ట్రోక్‌ డే సందర్భంగా పక్షవాతాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నారు వైద్యులు.

గుండెకు రక్త సరఫరా అందకపోతే హార్ట్‌ స్ట్రోక్‌ లేదా గుండెపోటు. అదే విధంగా మెదడులోని కణాలకు రక్తం అందకపోతే వచ్చేది బ్రెయిన్‌ స్ట్రోక్‌ లేదా మెదడు పోటు. ఏ కారణంతోనైనా రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే, ఆయా భాగాల్లోని మెదడు కణజాలం దెబ్బతింటుంది. ఇది దెబ్బతినకుండా రక్షించాలంటే తక్షణమే వైద్య సహాయం అందాలి. ఇందుకోసం పక్షవాతం ఎలా వస్తుంది, దాని లక్షణాలేంటి, అందుబాటులో ఉన్న చికిత్సలేంటో లుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

స్ట్రోక్‌.. రెండు రకాలు

 • ప్రధానంగా రెండు రకాల కారణాల వల్ల మెదడు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. 
 • మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల రక్తనాళం మూసుకుపోతుంది. దాంతో సరిపడా రక్తం అందక మెదడు కణాలు దెబ్బతింటాయి. దీన్నే ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ అంటారు. 
 • ఇకపోతే ఏ కారణంతోనైనా రక్తనాళం చిట్లితే ఇంట్రా సెరిబ్రల్‌ హెమరేజ్‌ (ఐసిహెచ్‌) అవుతుంది. దీనివల్ల వచ్చేదే హెమరేజిక్‌ స్ట్రోక్‌. 
 • అంటే రక్తప్రసరణ తగ్గినా, రక్తనాళం చిట్లినా అది చివరికి బ్రెయిన్‌ స్ట్రోక్‌కి దారితీస్తుంది. అప్రమత్తం చేసే లక్షణాలు

 • ఇస్కిమిక్‌ అయినా, హెమరేజిక్‌ స్ట్రోక్‌ అయినా చాలావరకు లక్షణాలు ఒకే రకంగా ఉండవచ్చు. ఈ లక్షణాలన్నీ అకస్మాత్తుగా కనిపిస్తాయి. 
 •  మాట ముద్దముద్దగా రావడం
 • కాలూ, చెయ్యి బలం తగ్గడం
 • కాలూ, చెయ్యి తిమ్మిర్లు రావడం
 • మాట తేడా రావడం
 • మూతి పక్కకి తిరగడం
 • చూపు సడెన్‌గా తగ్గడం
 • ఫిట్స్‌ రావడం
 • భరించలేని తలనొప్పి. ఇది ఇంతకుముందెప్పుడూ లేని విధంగా ఉంటుంది. దీని వెనుక సాధారణంగా రక్తనాళం చిట్లడం కారణం కావచ్చు. 

స్ట్రోక్‌ రాగానే ఏం చేయాలి?

ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వీలైనంత తొందరగా హాస్పిటల్‌కు వెళ్లాలి. ఆలస్యం చేయవద్దు. ప్రథమ చికిత్స లాంటివి చేయడం, తలనొప్పి, చూపు తగ్గడం లాంటివైతే తగ్గుతాయేమోనని వేచి చూడటం సరికాదు. హాస్పిటల్‌కు అత్యవసర చికిత్సకు తీసుకెళ్లాలి. ముందు బీపీ, షుగర్‌ చెక్‌ చేస్తారు. అవసరాన్నిబట్టి సీటీ, ఎంఆర్‌ఐ చేస్తారు. తదనుగుణమైన చికిత్స అందిస్తారు. 

భరోసా ఇస్తున్న చికిత్సలు

రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని తొలగించడానికి మంచి మందులు ఇప్పుడున్నాయి. ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ ఉన్నప్పుడు వెంటనే అవసరమైన స్కాన్‌లు, ఆంజియోగ్రామ్‌లు నిర్ణయించి న్యూరాలజీ అసెస్‌మెంట్‌ చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఐవి థ్రాంబోలైసిస్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. వీటివల్ల క్లాట్‌ కరుగుతుంది. రక్తనాళంలో ఏర్పడ్డ రక్తం గడ్డను ఇది తొలగిస్తుంది. నాలుగున్నర గంటలు దాటినా, లేక పెద్ద రక్తనాళంలో గడ్డ ఏర్పడ్డా దాన్ని రక్తనాళం ద్వారా సక్‌చేసి తీసేస్తారు. ఇంతకుముందైతే గుండెకు మాత్రమే స్టెంట్‌ వేసేవాళ్లు. ఇప్పుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌కి కూడా మేజర్‌ రక్తనాళంలో బ్లాక్‌ ఉంటే, తొందరగా వస్తే, మెదడు కణజాలాన్ని రక్షించగలమనుకుంటే ఈ చికిత్స చేస్తారు. ఇది ఇంతకుముందు 6 గంటలలోపు వసేన్తే చేసేవాళ్లు. ఇప్పుడు ఒకరోజు లోపల ఎప్పుడు అయినా చేయవచ్చు. మెదడు కణజాలాన్ని రక్షించగలుగుతామనుకున్నా, స్ట్రోక్‌ ఇంకా పెరుగుతుందనుకున్నా ఇలా థ్రాంబెక్టమీ ద్వారా క్లాట్‌ రిట్రీవల్‌ (గడ్డ తొలగించడం) చేస్తారు. ఇది ఆంజియోగ్రామ్‌ ద్వారా చేస్తారు. హెమరేజిక్‌ స్ట్రోక్‌ అయితే బీపీ కంట్రోల్‌ చేయడం, వాపు తగ్గడానికి మందులు, రక్తస్రావాన్ని ఆపడానికి క్లాటింగ్‌ ఫ్యాక్టర్లు ఎక్కించడం వంటివి చేస్తారు. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తక్కువ కావడం వల్ల, రక్తం పలుచన చేసే మందుల వల్ల, బీపీనా, తలకు దెబ్బ తగలడం వల్లనా అనే దాన్నిబట్టి చికిత్స ఉంటుంది. 

గోల్డెన్‌ అవర్‌

ఇంతకుముందు స్ట్రోక్‌ వస్తే గంటలోపు హాస్పిటల్‌కి రావాలని అనేవాళ్లు. కానీ ప్రతి సెకనూ ముఖ్యమే ఎంత తొందరగా వస్తే అంత మంచిది. 24 గంటలు దాటితే ఇక ఏమీ చేయలేం. తొందరగా రావడం వల్ల మెదడు కణాలు దెబ్బతినడాన్ని ఆపగలుగుతాం. సత్వర చికిత్స వల్ల శరీర అపసవ్యతలు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళంలో అడ్డంకి ఏర్పడితే వెంటనే దాన్ని తొలగించాలి. రక్తస్రావం ఉంటే దాన్ని వెంటనే ఆపాల్సి ఉంటుంది. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌కు వెళ్లాలి. 

మహిళలకూ కష్టమే!

మెనోపాజ్‌ వచ్చే వరకు మహిళల్లో కొంతవరకు స్ట్రోక్‌ రిస్కు తక్కువే. అయితే మెనోపాజ్‌ తర్వాత మాత్రం స్త్రీ, పురుషులిద్దరిలోనూ రిస్కు ఒకటే. అంతేగాక ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పలు రకాల బాధ్యతాయుతమైన, టెన్షన్లతో కూడిన వృత్తులు చేపడుతున్నారు. అందువల్ల కుటుంబ బాధ్యతలకు ఇప్పుడీ పని ఒత్తిడి కూడా మహిళల్లో ఉంటున్నది. ఫలితంగా వీళ్లలో కూడా స్ట్రోక్స్‌ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పిల్లల్లో స్ట్రోక్‌ వస్తుందా?

సాధారణంగా 60 ఏండ్లు పైబడినవాళ్లలో స్ట్రోక్‌ వస్తుంది. ఆ తర్వాత క్రమంగా రిస్కు పెరుగుతుంది. అయితే ఇది ఏ వయసులోనైనా రావచ్చు. పిల్లలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కాని కారణాలు మాత్రం వేరు. పిల్లల్లో చాలావరకు జన్యుపరమైన కారణాలే ఉంటాయి. సికిల్‌సెల్‌ ఎనీమియా లాంటి వ్యాధులు, రక్తంలో క్లాటింగ్‌ కారకాలు తక్కువగా ఉండటం, ఇన్‌ఫెక్షన్లు, వాస్కులైటిస్‌ లాంటి సమస్యలు పిల్లల్లో స్ట్రోక్‌కు కారణమవుతాయి. తలకు దెబ్బ తగలడం వల్ల కూడా పిల్లల్లో స్ట్రోక్‌ రావచ్చు. వీళ్లలో హెమరేజిక్‌ స్ట్రోక్‌ అరుదుగా కనిపిస్తుంది. ఆధునిక కాలంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, కంప్యూటర్‌ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, బరువు పెరగడం వల్ల చిన్న వయసులోనే స్ట్రోక్స్‌ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో టీనేజ్‌ పిల్లల్లో కూడా బీపీ పెరుగుతున్నది. దీనివల్ల చిన్న వయసులోనే స్ట్రోక్‌ బారిన పడే ప్రమాదముంది. 

పొగతాగారా.. అంతే సంగతులు!

పొగాకు దెబ్బతీయని అవయవమే ఉండదు. ఇందుకు కారణం ఇది రక్తనాళం లోపలి పొర అయిన ఎండోథీలియంను దెబ్బతీయడమే. ఎండోథీలియం డ్యామేజీ కావడం వల్ల కొలెస్ట్రాల్‌ డిపాజిట్‌ అవుతుంది. అందువల్ల పొగతాగడం ఇటు స్ట్రోక్‌ రిస్కునూ పెంచుతుంది. అటు గుండెపోటునూ పెంచుతుంది. పొగతాగడంతో పాటు బీపీ, రక్తం చిక్కబడటం కూడా ఎండోథీలియంను దెబ్బతీస్తాయి. 

రిస్కు కారకాలు

వయసు పెరుగుతున్న కొద్దీ స్ట్రోక్‌ వచ్చే రిస్కు పెరుగుతుంది. ఇప్పుడు మన ఆయుఃప్రమాణం పెరిగింది కాబట్టి ఎక్కువ మందిలో కనిపిస్తున్నది. వయసుతో పాటుగా ఆధునిక జీవనశైలి అగ్నికి ఆజ్యం పోస్తున్నది. శారీరకంగా చురుగ్గా లేకుండా వ్యాయామం చేయకపోవడం ఈ రిస్కు పెంచుతున్నది. బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్‌ కంట్రోల్‌లో లేకపోవడం, స్థూలకాయం, పొగతాగడం, ఆల్కహాల్‌ అధికంగా తీసుకోవడం, అధిక కొలెస్ట్రాల్‌, కొన్ని రకాల గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలున్నప్పుడు స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్యల వల్ల రక్తపీడనం (బీపీ) పెరిగి రక్తనాళం చిట్లి రక్తస్రావం అవుతుంది. కొన్ని రకాల మెడిసిన్స్‌ వల్ల కూడా రక్తస్రావం కావచ్చు. రక్తంలో సమస్యలున్నా ఇలాంటి ప్రమాదం ఉంటుంది. కొకైన్‌ లాంటి డ్రగ్స్‌ తీసుకునేవాళ్లలో స్ట్రోక్‌ రిస్క్‌ ఎక్కువ. గుండెపోటు ఉన్నవాళ్లలో స్ట్రోక్‌ ప్రమాదం ఎక్కువ. వీళ్లలో గుండెపోటు వల్ల (ఇస్కిమిక్‌) గానీ లేదా దానికి వాడే మందుల వల్ల గానీ (హెమరేజిక్‌) స్ట్రోక్‌ రావచ్చు. కొంతమందిలో ఏ కారణం లేకుండా కూడా స్ట్రోక్‌ రావచ్చు. దీన్ని క్రిప్టోజెనిక్‌ స్ట్రోక్‌ అంటారు. వీరిలో రిస్క్‌ కారకాలేవీ ఉండకపోయినా స్ట్రోక్‌ రావచ్చు. దాదాపు 25 నుంచి 30 శాతం మందిలో ఇలా ఉంటున్నదని అంచనా.  నివారణ ఇలా..

ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్‌గా బీపీ, షుగర్‌ చెక్‌ చేయించుకోవడం.

బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడం.

ఆహార నియమాలు పాటించడం - పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, ప్రొటీన్‌ ఎక్కువ ఉన్నవి తీసుకోవడం.

రెగ్యులర్‌గా వ్యాయామం, స్మోకింగ్‌ మానేయడం, ఆల్కహాల్‌ తగ్గించడం.

బరువు కంట్రోల్‌లో ఉంచుకోవడం. బాడీమాస్‌ ఇండెక్స్‌ చూసుకుంటుండాలి. 

స్ట్రోక్‌ చికిత్స అయ్యాక కారణాన్ని కనుక్కుని తదనుగుణమైన మందులు ఇస్తారు. వీటి ద్వారా మళ్లీ స్ట్రోక్‌ రాకుండా నివారించవచ్చు. 
డాక్టర్‌ 

జి.వి. సుబ్బయ్య చౌదరి

కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌

స్టార్‌ హాస్పిటల్స్‌ , హైదరాబాద్‌