గురువారం 22 అక్టోబర్ 2020
Health - Oct 12, 2020 , 23:37:49

కొవిడ్‌ నుంచి కోలుకున్నాక..

కొవిడ్‌ నుంచి కోలుకున్నాక..

ఒకవైపు కొవిడ్‌ చికిత్స జరుగుతున్నది. నెమ్మదిగా పరిస్థితి మెరుగుపడుతున్నది. ఒక్కసారిగా జ్వరం మళ్లీ వచ్చింది. సమస్యలు పెరిగాయి. కారణం...? సెకండరీ ఇన్‌ఫెక్షన్‌! 

కొవిడ్‌ నుంచి బయటపడి వారం అయింది. ఇక గండం గడిచిందని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా మళ్లీ ఆయాసం మొదలైంది. ఛాతీలో నొప్పి వచ్చింది. ఎందుకు..? న్యూమోథొరాక్స్‌!

 కరోనా తగ్గిపోయింది. కానీ.. ఇంకా నీరసంగానే ఉంటున్నది. ఎప్పుడు చూసినా మూడీగా ఉంటున్నారు. నిస్పృహ ఆవరించింది.నిద్ర పట్టడం లేదు...లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌!   

హమ్మయ్య! ప్రమాదం నుంచి బయటపడ్డాం. కొవిడ్‌ బాధ వదిలిందని ఊపిరి పీల్చుకున్నారో లేదో.. కొందరిలో  రకరకాల సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బతో బలహీనపడిన ఊపిరితిత్తులు ఆ తరువాత కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. అవేమిటో, వాటి నుంచి ఎలా బయటపడాలో వైద్యులు చెప్తున్న సూచనలివి.

పోస్ట్‌ కొవిడ్‌ ఫైబ్రోసిస్‌

చర్మంపై గాయం అయినప్పుడు అది తగ్గే క్రమంలో ఆ భాగం గట్టిగా మారుతుంది. చివరికి మచ్చ ఏర్పడుతుంది. ఊపిరి తిత్తులు కూడా కొవిడ్‌ వల్ల దెబ్బతిన్నప్పుడు, దెబ్బ  తగ్గే క్రమంలో గట్టిపడుతాయి. అంటే మృదువుగా ఉండే ఊపిరి తిత్తులు గట్టిగా మారుతాయి. దీన్నే ‘లంగ్‌ ఫైబ్రోసిస్‌' అంటారు. కొవిడ్‌ తర్వాత ముఖ్యంగా ఎక్కువ మందిలో ఈ పోస్ట్‌ కొవిడ్‌ ఫైబ్రోసిస్‌ కనిపిస్తున్నది. న్యుమోనియా వచ్చి తగ్గుతున్న క్రమంలో కొందరికి ఫైబ్రోసిస్‌ వస్తుంది. క్షయ వ్యాధి వచ్చినప్పుడు, స్వైన్‌ ఫ్లూ వల్ల కూడా ఇలా ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్‌ రావచ్చు. అయితే, మిగిలిన ఇన్‌ఫెక్షన్లలో కన్నా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తరువాత ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్‌ రావడం సర్వసాధారణంగా కనిపిస్తున్నది. అయితే ఇది అందరిలోనూ రాదు. తీవ్రస్థాయి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఆక్సిజన్‌ తగ్గి, ఐసియులో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటివాళ్లలోనే డిశ్చార్జి అయిన తరువాత, పోస్ట్‌ కొవిడ్‌ ఫైబ్రోసిస్‌ కనిపిస్తున్నది. కొంతమందిలో కేవలం 5 నుంచి 10 శాతం మందిలో ఈ డ్యామేజీ శాశ్వతంగా ఉంటుంది. 90 శాతం మంది మూడు నెలల్లో కోలుకుంటారు. ఇది ఎందుకు వస్తుందనేది ఇంతవరకు స్పష్టంగా తెలియదు. 

లక్షణాలు

ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లు తీసినప్పుడు ఊపిరితిత్తుల్లో ఇంకా మచ్చలు ఉంటాయి. ఆయాసం, దగ్గు వదిలిపెట్టవు. ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. డిశ్చార్జి అయ్యాక ఫైబ్రోసిస్‌ తగ్గేవరకు మూడు నాలుగు నెలల వరకు ఇలాగే ఉంటుంది. ఫైబ్రోసిస్‌ వల్ల ఊపిరితిత్తుల పని సామర్థ్యం తగ్గుతుంది. ఈ సమస్య మూడు నాలుగు నెలల తర్వాత క్రమంగా తగ్గుతుంది. 

చికిత్స

ఫైబ్రోసిస్‌ ఉన్నప్పుడు రెండుమూడు రకాల మందులు వాడాలి. ప్రధానంగా స్టెరాయిడ్స్‌ ఇస్తారు. ఎక్కువ రోజులు తక్కువ మోతాదులో ఇస్తారు. ఇంటస్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ (ఐఎల్‌డి) ఉన్నవాళ్లకు ఇచ్చే యాంటి ఫైబ్రోటిక్‌ మెడిసిన్‌ ఇస్తారు. ఫైబ్రోసిస్‌కి చివరి ఆప్షన్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌. కొవిడ్‌ ఉన్నవాళ్లలో 0.1 శాతం మందిలో మాత్రమే ఊపిరితిత్తుల మార్పిడి అవసరం కావచ్చు.

నివారణ

తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవాళ్లలోనే ఈ సమస్య కనిపిస్తుంది కాబట్టి, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా మారకుండా చూసుకోవడమే దీన్ని నివారించే మార్గం. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను తొలిదశలోనే గుర్తించాలి. లక్షణాలు కనిపించగానే, అశ్రద్ధ చేయకుండా  డాక్టర్‌ను కలవాలి. అవసరమైన చికిత్స తీసుకోవాలి. నాకెందుకు కొవిడ్‌ వస్తుందన్న అతి విశ్వాసం వద్దు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ శాచురేషన్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. లక్షణాలు ఉంటే డాక్టర్‌ సలహా తీసుకోవాలి. వైద్యం చేయించుకోవాలి. ఆలస్యం చేస్తే తీవ్రత పెరుగుతుంది. 

లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌

కొవిడ్‌ తగ్గిపోయిన కొన్ని నెలల వరకు.. దాదాపు మూడు నెలల పాటు రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇవి నిర్దుష్టంగా ఉండవు. దీన్నే లాంగ్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌గా భావిస్తారు. ఇలాంటప్పుడు బలహీనత, ఒళ్లునొప్పులు, ఏ కారణం లేకుండా చెమట ఎక్కువగా రావడం, మగతగా జ్వరం (99 - 100 డిగ్రీ ఫారన్‌హిట్‌), నిద్ర లేమి వంటి ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఒకవైపు, జబ్బు వల్ల కలిగే ఒత్తిడి మరోవైపు.. కలిసి నిద్ర సంబంధమైన సమస్యలకు కారణమవుతాయి. వీళ్లలో మూత్ర విసర్జన కూడా అధికంగా ఉంటుంది. పదేపదే వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. డిప్రెషన్‌కు లోనవుతారు. ఈ సమస్యల వల్ల ఏమవుతుందో అని భయపడాల్సిన పనిలేదు. మంచి ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.  సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడం చాలా ముఖ్యం. లక్షణాలను బట్టి సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. కొవిడ్‌ వచ్చి వెళ్లిన రెండు వారాల వరకు బలహీనత, నీరసం ఉంటాయి. చాలామంది నెల రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు. 10 నుంచి 20 శాతం మందిలో మాత్రం మూడు నెలల వరకు ఈ సమస్యలు ఉంటాయి. 

సెకండరీ ఇన్‌ఫెక్షన్లు

న్యుమోనియా వల్ల ఊపిరితిత్తుల్లో సహజంగా ఉండే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అందువల్ల శ్వాసకోశాల్లో రెండో ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. స్వైన్‌ఫ్లూ, వైరల్‌ న్యుమోనియాల్లో ఇది చాలా సాధారణమైన విషయం. అయితే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ ఇస్తారు కాబట్టి, ఇమ్యూనిటీ మరింత దెబ్బతింటుంది. దాంతో కొవిడ్‌ వచ్చిన తరువాత అది తగ్గకముందే గానీ, తగ్గిన తరువాత గానీ సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ రావడం సర్వసాధారణం. బాక్టీరియల్‌ న్యుమోనియా వచ్చినప్పుడు జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌లో కళ్లె ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది పసుపు రంగులో ఉంటుంది. 

ఇమ్యూనిటీ తగ్గితే ఫంగస్‌ దెబ్బ

సాధారణంగా క్షయవ్యాధి తరువాత, డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనప్పుడు, క్యాన్సర్‌ చికిత్స కోసం కీమోథెరపీ తీసుకున్న తరువాత.. సాధారణంగా ఊపిరితిత్తులకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు కొవిడ్‌లో, కొవిడ్‌ తరువాత కూడా మ్యూకార్‌, ఆస్పర్జిల్లస్‌ లాంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. స్టెరాయిడ్స్‌ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ మరింత తగ్గి, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం ఇంకా పెరుగుతున్నది. అందుకే స్టిరాయిడ్స్‌ను రెండో వారంలో ఇస్తాం. కొవిడ్‌ వచ్చిన మొదటి వారం వైరల్‌ దశ ఉంటుంది. రెండో వారం ఇన్‌ఫ్లమేటరీ దశ ఉంటుంది. ఈ దశలో స్టిరాయిడ్స్‌ ఇవ్వాలి. ముందుగా ఇవ్వవద్దు. వాటి మోతాదు కూడా సరిగ్గా చూసుకోవాలి. మొన్నటివరకు సొరియాసిస్‌ మందులు కూడా కొవిడ్‌ చికిత్స కోసం వాడారు. అవి మంచివే అనుకున్నాం. కానీ ఇవి స్టిరాయిడ్‌ కన్నా ఎక్కువగా ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కి చికిత్స తీసుకుంటూ, కొంత మెరుగుపడుతున్నారనుకోగానే మళ్లీ అకస్మాత్తుగా జ్వరం వచ్చి, ఆరోగ్యం దెబ్బతింటున్నదంటే సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని అర్థం. ఇలాంటప్పుడు సీటీ చేస్తే అది బాక్టీరియానా లేక ఫంగల్‌ ఇన్‌ఫెక్షనా అన్నది తెలుస్తుంది. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ అయితే యాంటీబయాటిక్‌, ఫంగల్‌ అయితే యాంటీ ఫంగల్‌ మందులు ఇస్తారు. 

న్యూమోథొరాక్స్‌

దగ్గినా, కొంచెం ఒత్తిడి పడినా ఊపిరితిత్తులు చిరిగిపోవడాన్నే న్యూమోథొరాక్స్‌ అంటారు. ఫైబ్రోసిస్‌ వల్ల ఉత్పన్నమయ్యే సమస్య ఇది. ఫైబ్రోసిస్‌ వల్ల ఊపిరితిత్తులు గట్టిపడతాయి. వీటిపై ఒత్తిడి పడినప్పుడు చిన్నపాటి రంధ్రం పడటం లేదా చిరిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల వాయుగోణుల్లో ఉండే గాలి బయటికి ఛాతీకుహరంలోకి లీక్‌ అవుతుంది. ఇలాంటప్పుడు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి, ఆయాసం వస్తాయి. న్యూమోథొరాక్స్‌ సమస్య ఉన్నప్పుడు ఛాతీ పక్కవైపు నుంచి ట్యూబ్‌ పెట్టి, లీక్‌ అయిన గాలిని బయటకు తీసేస్తాం. తద్వారా ఊపిరితిత్తి మూసుకుపోతుంది. ఎప్పటిలాగా సాధారణంగా అవుతుంది. 

పల్మనరీ ఎంబోలిజం

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవాళ్లలో మూడు నెలల వరకు రక్తనాళాల్లో క్లాట్స్‌ (రక్తం గడ్డలు) ఏర్పడే ప్రమాదం ఉంటుంది. జబ్బు ఉన్నా, తగ్గిపోయినా మూడు నెలల వరకూ ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి, ఊపిరితిత్తుల్లో కూడా ఈ క్లాట్స్‌ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీన్నే ‘పల్మనరీ ఎంబోలిజం’ అంటారు. ఇలాంటప్పుడు రక్తాన్ని పలుచన చేసే మందులను ఎక్కువ మోతాదులో ఇస్తారు. క్లాట్‌ కరగడానికి కూడా మందులు ఇస్తారు. మొదటి రెండు వారాల్లో ఈ రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు కనిపించగానే కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడకుండా కొంతవరకు నివారించవచ్చు. 

రీ-ఇన్‌ఫెక్షన్‌

ఒకసారి కరోనా ఇన్‌ఫెక్షన్‌ వచ్చి, చికిత్స తీసుకుని బయటపడిన తరువాత మళ్లీ వస్తుందా? అన్నది చాలామందిని భయపెడుతున్న ప్రశ్న. అయితే ఒకసారి తగ్గిన తరువాత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ రాదని కచ్చితంగా చెప్పలేం. కానీ చాలా తక్కువ మందిలో అంటే వెయ్యిమందిలో ఒకరికి ఇలాంటి రిస్క్‌ కనిపిస్తున్నది. మొదటిసారి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ చాలా మైల్డ్‌గా ఉన్నవాళ్లలోనే ఇలా రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తున్నది. మొదటిసారి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవాళ్లకు రెండోసారి రావడం అరుదు. అయితే, ‘కొవిడ్‌ వచ్చి వెళ్లింది కదా.. ఇక మాకేం కాదులే’ అన్న నిర్లక్ష్యం పనికిరాదు. యథావిధిగా అన్ని జాగ్రత్తలూ పాటించాలి. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, అనవసరంగా బయటతిరగకపోవడం వల్ల మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా నివారించవచ్చు. 

యాంటీబాడీలు ఉంటాయా.. లేదా?

తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన వాళ్లలో యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉంటున్నాయి. అంటే వాళ్లకు కొవిడ్‌ ఇమ్యూనిటీ ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. లక్షణాలు లేకుండా కొవిడ్‌ పాజిటివ్‌ అయిన వాళ్లలో యాంటీబాడీలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ..ఇలాంటివాళ్లకు మళ్లీ కొవిడ్‌ రాదని చెప్పలేం. సాధారణంగా మూడు నెలలకల్లా యాంటీబాడీలు తగ్గుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే కొందరికి ఆరు నెలల వరకు కూడా ఉంటున్నాయి. సగటున 3 నుంచి 6 నెలల వరకు యాంటీబాడీలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే, కొవిడ్‌లో ఐజిఎం (IgM), ఐజిజి (IgG) అనే రెండు రకాల యాంటీబాడీలు ఉంటాయి. ఐజిజి యాంటీబాడీలు ఉన్నాయంటే జబ్బు తగ్గి, ఇమ్యూనిటీ పెరిగిందని అర్థం. కేవలం ఐజిఎం యాంటీబాడీలు మాత్రమే ఉన్నాయంటే ఇంకా జబ్బు ఉందని అర్థం. రెండూ ఉంటే మధ్యస్థంగా ఉందని అర్థం. కొవిడ్‌ మొదలైన నాలుగైదు వారాలకు ఐజిజి ఉన్నాయో లేదో చూసుకోవచ్చు. కొవిడ్‌ తర్వాత హ్యమోరల్‌ (యాంటీబాడీ మీడియేటెడ్‌) ఇమ్యూనిటీ , టి-సెల్‌ మీడియేటెడ్‌ ఇమ్యూనిటీ అనే రెండు రకాల వ్యాధినిరోధకత పెరుగుతుంది. 

కొవిడ్‌ తరువాత.. ఏం చేయాలి?


  • కొన్ని ఆఫీసుల్లో, అపార్టుమెంట్లలో కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందని టెస్ట్‌ రిపోర్టు చూపించమంటున్నారు. అందువల్ల డిశ్చార్జి అయిన తరువాత చాలామంది కొవిడ్‌ నెగెటివ్‌ అయిందో లేదో తెలుసుకోవడానికి పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకుంటున్నారు. కానీ ఇది అవసరం లేదు. ఎందుకంటే ఇది జన్యుపరీక్ష. చికిత్స వల్ల చనిపోయిన వైరస్‌లలో జన్యువులు ఉంటాయి కాబటి,్ట కొవిడ్‌ చికిత్స తరువాత కూడా ఈ పరీక్షలో నెగెటివ్‌ రాకపోవచ్చు. 
  • మైల్డ్‌ కేసుల్లో లక్షణాలు తగ్గిన 15 రోజుల వరకు హోమ్‌ క్వారెంటైన్‌ పాటిస్తే చాలు. ఆ తరువాత వైరస్‌ ఉండదు. 
  • కొవిడ్‌ తరువాత ఇమ్యూనిటీ కోసం విటమిన్‌ టాబ్లెట్లు వాడాలా వద్దా అన్న సందేహం ఉంటుంది. అయితే విటమిన్‌ డి సొంతంగా వాడకూడదు. పరీక్ష చేయించుకుని, డాక్టర్‌ సలహాతో, సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. లేకపోతే విటమిన్‌ డి -టాక్సిసిటీ వస్తుంది. ఇకపోతే జింక్‌ (50 మి.గ్రా), విటమిన్‌-సి (1-1.5 గ్రా.) రోజుకొక టాబ్లెట్‌ వాడుకోవచ్చు. 
  • ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవాలని రోజూ మాంసాహారం అతిగా తినేయడం సరికాదు. సమతులాహారం తీసుకోవాలి. 
  • కొవిడ్‌ వచ్చి పోయిన వాళ్లలో కొందరు బరువు తగ్గుతున్నారు. ప్రొటీన్‌ తక్కువ అయిపోతున్నది. ఇలాంటివాళ్లు ప్రొటీన్‌ డైట్‌ తీసుకోవచ్చు. విటమిన్‌-సి, జింక్‌ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. విటమిన్‌-డి కోసం ఎండలో ఉండటమే కాకుండా, రోజూ పాలు తాగవచ్చు. 
  • కొవిడ్‌ దెబ్బతో అసలే బలహీనం అయిపోయిన ఊపిరితిత్తులు పొగతాగడం వల్ల మరింత దెబ్బతింటాయి. ఆల్కహాల్‌ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. న్యుమోనియా రిస్క్‌ పెరుగుతుంది. అందువల్ల ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. 
  • కొవిడ్‌ తరువాత ఎక్కువ ఒత్తిడికి గురవకుండా చూసుకోవడం ముఖ్యం. ఇందుకోసం యోగా, ప్రాణాయామం (డీప్‌ బ్రీతింగ్‌), ధ్యానం సహాయపడుతాయి. 
  • రోజూ అర్ద్దగంట వాకింగ్‌ చేయాలి. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. ఏరోబిక్‌ వ్యాయామాలు ఊపిరితిత్తులకు చాలా మంచిది. ట్రెడ్‌మిల్‌ చేసుకోవచ్చు. 
  • బరువు ఎక్కువైతే ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. క్లాట్స్‌ ఏర్పడే ప్రమాదం ఎక్కువ అవుతుంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలి. 
  • కొవిడ్‌ నుంచి బయటపడిన తరువాత యోగాలో ‘కపాలభాతి’ చేయకూడదు. 

డాక్టర్‌ వి. నాగార్జున మాటూరు

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ ,పల్మనాలజిస్ట్‌

యశోద హాస్పిటల్స్‌,హైదరాబాద్‌


logo