సోమవారం 26 అక్టోబర్ 2020
Health - Oct 01, 2020 , 23:50:25

కరోనా తగ్గింది.. ఏం తినాలి?

కరోనా తగ్గింది.. ఏం తినాలి?

నాకు 38 ఏండ్లు. కొవిడ్‌-19 నుంచి ఈమధ్యనే బయటపడ్డాను. ఇతర సమస్యలేవీ లేవు. కానీ బరువు ఎక్కువగానే ఉంటాను. పాజిటివ్‌ అయిన తరువాత మాత్రం హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ఇంతకుముందు నార్మల్‌గా అన్నీ తినేదాన్ని. ఇప్పుడు నేను బాగా కోలుకోవాలంటే ఆహారం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- సంధ్య, హైదరాబాద్‌

ఎంత తింటున్నామన్న దాని కన్నా ఏయే పదార్థాలు, ఎలా తింటున్నామన్నది చాలా ముఖ్యం. కొవిడ్‌ రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా, కొవిడ్‌ వచ్చి తగ్గిన వాళ్లయినా, పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లయినా అన్ని పోషకాలూ ఉన్న సమతులాహారం తీసుకోవడం అవసరం. ప్రతిరోజూ అన్ని పోషకాలూ ఆహారంలో ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఏ ఆదివారమో చికెనూ, చేపలూ తినేసి మిగతా రోజులు ప్రొటీన్‌ తీసుకోకపోతే వారానికి సరిపడా మాంసకృత్తులు మీ శరీరానికి అందవు. ఓ రెండు రోజులు తాజా పండ్లు తీసుకోకపోతే తగినన్ని యాంటి ఆక్సిడెంట్స్‌ అందవు. ఇది ఇమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుంది. అందుకే పోషకాలన్నీ సమతులంగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు రెండుసార్లు గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవాలి. వీటి ద్వారా అందే అమైనో ఆమ్లాలు, కేలరీలు మిమ్మల్ని చురుగ్గా ఉంచడమే కాకుండా, జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తాయి. ఫలితంగా ఇమ్యూనిటీ బాగుంటుంది. మధ్యాహ్న భోజనంలో గానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ ప్రొటీన్లు ఉండాలి. కూరగాయలు, ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. రోజుకి రెండుసార్లు పండ్లు తినాలి. వీటివల్ల తగినంత ఫైబర్‌ దొరుకుతుంది. కూరగాయలను అతిగా ఉడికించొద్దు. ప్రోబయోటిక్స్‌ను కూడా ఆహారంలో చేర్చాలి. ఇందుకోసం పులిసిన పదార్థాలు, పెరుగు లాంటివి వాడవచ్చు. అన్నింటి కన్నా ముఖ్యమైనది.. నీళ్లు ఎక్కువగా తాగడం. వ్యర్థాలను బయటికి పంపడంలో, పోషకాలను కణాలకు చేర్చడంలో నీటి పాత్ర ఉంటుంది. రోజుకి 10 గ్లాసుల నీళ్లయినా తాగాలి. రోజుకి రెండు కప్పుల కన్నా ఎక్కువ టీ, కాఫీలు తాగవద్దు. నూనెలు, కొవ్వులు, షుగర్స్‌ తగ్గించాలి.

అశ్విని సాగర్‌

న్యూట్రిషనిస్ట్‌, ఆహార్వేద బై అశ్విని సాగర్‌

కొంపల్లి, హైదరాబాద్‌


logo