బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 29, 2020 , 02:43:36

మీ గుండె చప్పుడు వింటున్నారా?

మీ గుండె చప్పుడు వింటున్నారా?

“ఏమోయ్‌.. వింటున్నావా...? నువ్వు ఇలాగే సిగరెట్లు కాలుస్తూ ఉంటే.. ఎప్పుడో ఒకసారి నేను మూలకు పడటం ఖాయం. శరీరాన్ని కదిలించకుండా అట్లా కూర్చునే ఉన్నావనుకో.. ఏదో ఒకరోజు నా కదలిక కూడా ఆగిపోవడం తథ్యం. మొన్నటి వరకు నీకు చెక్‌ చేసిన డాక్టర్‌ 

ఒకవైపు, నీ భార్య మరోవైపు చెప్తున్నా వినకపోతివి. ఇప్పుడు నాకు రక్తం అందడం లేదు.. ఊపిరాడటం లేదు... నేను ఎంత ప్రయత్నించినా ఈ స్పందనల వేగాన్ని ఆపలేకపోతున్నా.. వెంటనే డాక్టర్‌ దగ్గరికి బయలుదేరు”.

గుప్పెడంత గుండె.. మనకోసం అహోరాత్రాలు ఆగకుండా పనిచేసే హృదయం.. మనతో మాట్లాడితే ఇలాగే ఉంటుందేమో! తనకు జబ్బు చేసిందని మన గుండె మనకు ముందుగానే సంకేతాలను పంపుతూ ఉంటుంది. అవేంటో సరిగ్గా అర్థం చేసుకుని, సకాలంలో స్పందిస్తే గుండెను కాపాడుకోవచ్చు. ప్రాణాపాయాన్ని తప్పించుకోవచ్చు. 

గుండెపోటు వచ్చిన గంటలోగా వైద్య సహాయం అందితే ప్రాణాల మీదకు రాకుండా ఉంటుందని చెప్తారు డాక్టర్లు. గుండెపోటు విషయంలోనే కాదు.. ఏ రకమైన గుండె సమస్య అయినా ఎంత తొందరగా చికిత్స తీసుకోగలిగితే గుండెకు అయ్యే డ్యామేజీ అంత తక్కువగా ఉంటుంది. ఇలా తొందరగా చికిత్స అందాలంటే గుండెకు జబ్బు చేసిందనే విషయాన్ని సరైన సమయంలో గుర్తించగలగాలి. అలా తెలుసుకోవాలంటే మన గుండె చప్పుడును గమనిస్తూ ఉండాలి. లక్షణాల రూపంలో అది మనతో చెప్పే మాటల్ని వినగలగాలి. గుండె కష్టంలో ఉన్నప్పుడు అది ముఖ్యంగా మూడు సమస్యలుగా బయటపడుతుంది. 

ఆయాసం

అప్పటివరకూ రెండంతస్తులూ చకచకా ఎక్కేసినవాళ్లు ఒక్క అంతస్తు మెట్లు ఎక్కేసరికే ఆయాసపడుతున్నారంటే.. గుండె తనకు వైద్యం అందించమని అడుగుతున్నట్టే. ఓ పది అంతస్తులు ఒకేసారి ఎక్కితే ఎవరికైనా ఆయాసం వస్తుంది. కానీ ఇంతకుముందు ఎక్కగలిగిన మెట్లు ఎక్కినా, గతంలో సునాయాసంగా నడవగలిగిన దూరం నడుస్తున్నా ఇప్పుడు ఆయాసం వస్తున్నదంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే అప్పటివరకూ ఆ రెండంతస్తుల మేర ఎక్కగలిగేందుకు మాత్రమే మన కండరాలు, గుండెతో పాటు అన్ని అవయవాలు తమను తాము సర్దుబాటు చేసుకుని ఉంటాయి. కానీ ఆయాసం వస్తున్నదంటే వీటిలో ఏ భాగం పనితీరైనా డిస్ట్రబ్‌ అయిందని అర్థం. సాధారణంగా ఆయాసం ఉందంటే గుండెజబ్బే ఉందని అనుకోవచ్చు. కానీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నా, రక్తం తక్కువై రక్తహీనత ఉన్నా, కండరాల బలహీనత ఉన్నా ఆయాసం వస్తుంది. 

 • గుండె కండరం బలహీనపడినప్పుడు (కార్డియోమయోపతి) అది రక్తాన్ని ఎప్పటిలా పంపు చేయలేకపోవడం వల్ల ఆయాసం వస్తుంది. ఇందుకు కారణాలు అనేకం. 
 • గుండె కవాటాల్లో అడ్డంకులు ఉండటం లేదా అవి లీక్‌ కావడం గానీ జరగవచ్చు. బ్లాక్‌ ఉంటే రక్తం సరిగా బయటికి వెళ్లదు. లీక్‌ అయితే రక్తం రివర్స్‌లో వెనక్కి వెళ్తుంది. ఈ కారణాల వల్ల ఆయాసం వస్తుంది.
 • కరొనరీ ఆర్టరీ వ్యాధుల్లో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దాంతో గుండెకు రక్తం అందక ఆయాసంగా ఉంటుంది. 
 • పుట్టుకతో గుండెలో రంధ్రాలు ఉన్నవాళ్లలో (కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజెస్‌) ఏ వయసులో అయినా అది సమస్యగా మారవచ్చు. ఇది కూడా ఆయాసంగానే వ్యక్తమవుతుంది. కొన్ని రంధ్రాలు పుట్టిన ఏడాది, అయిదేండ్ల వయసులోనే కనిపించవచ్చు. మరికొందరిలో 40 ఏండ్లు దాటిన తరువాత కూడా ఆయాసం వచ్చి రంధ్రం ఉన్నదని తేలవచ్చు. లేదా కొందరిలో అసలు అవి బయటపడవు. జీవితాంతం వాళ్లలో ఏ సమస్యా లేకపోవచ్చు. 

ఛాతీ నొప్పి

గుండెనొప్పి అంటే.. గుండెలో నొప్పితో ఛాతీ పట్టుకుని కుప్పకూలిపోవడమే అనుకుంటాం. హృద్రోగాల లక్షణాలలో ఛాతీనొప్పి అంత సాధారణమైనది. సాధారణంగా గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు (కరొనరీ ఆర్టరీ డిసీజ్‌) దానికి తగినంత రక్తం అందదు. దాంతో ఛాతీలో నొప్పి మొదలవుతుంది. సాధారణంగా ఒక దగ్గర కూర్చోకుండా ఏదైనా పనిచేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఛాతీ నొప్పి ఎక్కువ అవుతుంటుంది. గుండెపోటు అయితే విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు చెమట అధికంగా పట్టడం కూడా చూస్తుంటాం. కరొనరీ ఆర్టరీ వ్యాధి మాత్రమే కాదు హృదయ స్పందనల్లో తేడాలు ఉన్నప్పుడు కూడా గుండె నొప్పి లేదా ఛాతీ నొప్పి రావచ్చు. కొన్నిసార్లు ఛాతీ నొప్పితో పాటు ఆయాసం కూడా ఎక్కువ కావడం గమనిస్తుంటాం. 

గుండెనొప్పా.. అసిడిటీనా?

కొన్ని రకాల గుండెపోట్లలో పొట్ట పైభాగంలో నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు అది గ్యాస్‌ వల్ల కావచ్చని పొరబడే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్యాస్‌ టాబ్లెట్లు వాడటం, గ్యాస్ట్రోఎంటరాలజిస్టును సంప్రదించడం, దవాఖానకు వెళ్లడం ఆలస్యం చేయడం లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. అంతకు ముందు ఎప్పడూ లేకుండా అకస్మాత్తుగా పై పొట్టలో నొప్పి వస్తున్నదంటే జాగ్రత్తపడాలి. సాధారణంగా ఎప్పటికీ గ్యాస్‌ సమస్య ఉండేవాళ్లలో గుర్తించడం కష్టం అవుతుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ట్రిక్‌ పెయిన్‌ వస్తున్నదంటే అశ్రద్ధ చేయవద్దు. చాలా సందర్భాల్లో ఈ నొప్పితో పాటుగా చెమట అధికంగా రావడం, ఆయాసం, గుండె వేగం తగ్గి కండ్లు తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నదంటే వెంటనే అప్రమత్తం కావాలి. 

గుండెదడ

భయంతో గుండె వేగం పెరిగింది.. దడ మొదలైంది... అనడం వింటుంటాం. అంటే హృదయ స్పందనల వేగం పెరుగుతుందన్నమాట. ఇలాంటప్పుడు కనిపించే లక్షణమే గుండెదడ. గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకోవాలి. గుండెలోని విద్యుత్‌ ప్రవాహం వల్ల ఈ హృదయ స్పందన జరుగుతూ ఉంటుంది. కొందరికి ఈ విద్యుత్‌ ప్రవాహంలో తేడాలు వస్తాయి. దాంతో గుండె కొట్టుకునే వేగంలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. సాధారణ హృదయ స్పందన వేగం తక్కువ అయిపోతుంది (బ్రాడీకార్డియా). లేదా ఎక్కువ అవుతుంది (టాకీకార్డియా). ఇలాంటప్పుడు గుండెలో దడ వస్తుంది. దాంతో పాటు కండ్లు తిరగడం, ఆయాసం కూడా ఉండవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పి కూడా కనిపిస్తుంది. గుండె వేగం ఎక్కువగా ఉన్నప్పుడు తట్టుకోలేక ఛాతి నొప్పి వస్తుంది. గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువైనా, తక్కువైనా అపస్మారక స్థితికి వెళ్తారు. దీన్ని సింకోపీ అంటారు. హృదయ స్పందనలు 40కన్నా తక్కువకు పడిపోతే మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి, సింకోపీతో పడిపోతారు. గుండె వేగం 200 కన్నా ఎక్కువకు పెరిగినా గుండె సంకోచ వ్యాకోచాలు గతి తప్పి సింకోపీ స్థితి ఏర్పడుతుంది. 

ఏం చేయాలి?

  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఈ లక్షణాల వెనుక కారణం ఏంటన్నది సరిగ్గా విశ్లేషించాలి. కొన్నిసార్లు మానసిక సమస్య వల్ల కూడా ఇలా కావచ్చు. ఏమీ లేకపోయినా ఆయాసం లాగా రావచ్చు. యాంగ్జయిటీ, ప్యానిక్‌ అటాక్స్‌ కూడా ఆయాసం లాగా వ్యక్తమవుతాయి. గుండె, ఊపిరితిత్తులు, రక్తపరీక్షలు నార్మల్‌గా ఉన్నాయనుకుంటే మానసికమైన కారణం ఉందేమో తెలుసుకోవాలి. లక్షణాలే కాకుండా పేషెంట్‌ హిస్టరీ, క్లినికల్‌ పరీక్షలు, పేషెంటుతో మాట్లాడటం ద్వారా కూడా సరైన కారణాన్ని కనుక్కోవచ్చు. గుండెలో ఏ సమస్య ఉందో దానికి సంబంధించిన చికిత్స సకాలంలో అందేలా చూసుకోవాలి. 
  • నిరంతరం మనకు ప్రాణం పోస్తూ ఉన్న గుండెకు చేటు చేసే జీవనశైలిని మార్చుకోవడం మన బాధ్యత. మంచి ఆహారం, సరైన వ్యాయామం, అనారోగ్యమైన అలవాట్లకు దూరంగా ఉండటం సదా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. 
  • వ్యాయామం తీవ్రంగా చేస్తే, తీవ్రమైన ఎమోషన్స్‌లో గుండె వేగం పెరుగుతుంది. దీనివల్ల సింపథెటిక్‌ డ్రైవ్‌ ఉంటుంది. దాంతో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. వీటివల్ల గుండె వేగం కూడా పెరుగుతుంది. ఇది సహజమైన విషయం. అథ్లెట్స్‌ బాగా వ్యాయామం చేస్తారు. కాబట్టి ఆ గుండె వేగానికి వాళ్ల శరీరం అలవాటు అవుతుంది. కాని ఉన్నట్టుండి తీవ్రమైన వ్యాయామం మొదలుపెడితే మాత్రం హార్ట్‌ బీట్‌ పెరుగుతుంది. అప్పటికే గుండె సమస్య ఉంటే ప్రమాదం కావచ్చు. లేకపోతే సాధారణంగా ఏం కాదు. రెస్ట్‌ తీసుకోగానే తగ్గుతుంది. అయితే డయాబెటిస్‌, అధిక వయసు, స్థూలకాయం, బీపీ, ఫ్యామిలీ హిస్టరీ లాంటి రిస్క్‌ ఫ్యాక్టర్లున్నవాళ్లు ఉన్నట్టుండి జిమ్‌ లేదా ఇతర వ్యాయామాలు మొదలుపెడితే కష్టం. వీళ్లు వ్యాయామం మొదలుపెట్టడానికి ముందే నిపుణుల సూచనలు తీసుకోవాలి. 
  • ఈ కొవిడ్‌ కాలంలో గుండెజబ్బును అస్సలు అశ్రద్ధ చేయవద్దు. డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు.   logo