శనివారం 31 అక్టోబర్ 2020
Health - Sep 22, 2020 , 00:08:04

విటమిన్లే విషమైతే!

విటమిన్లే విషమైతే!

ముంబయిలోని ఫోర్టిస్‌ హాస్పిటల్‌.. డాక్టర్‌ తేజల్‌ లాథియా దగ్గరికి కిడ్నీ సమస్యతో ఒక డయాబెటిస్‌ పేషెంటు వచ్చింది. చక్కెర వ్యాధి వల్ల కిడ్నీలు పాడయ్యాయేమో అనుకున్నారు. కానీ, పరీక్షల్లో తేలిన విషయం షాక్‌కి గురిచేసింది. రక్తంలో విటమిన్‌-డి లెవల్స్‌ 150 నానోగ్రామ్‌ /మి.లీ.  కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాంటిది ఆ పేషెంటుకు 348 నానోగ్రామ్‌ /మి.లీ. ఉంది. విటమిన్‌-డి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సోషల్‌  మీడియాలో చదివిందామె. కొవిడ్‌ భయంతో రోజుకో విటమిన్‌-డి టాబ్లెట్‌ వేసుకుంది. ఫలితం... విటమిన్‌-డి టాక్సిసిటీ. తద్వారా, పాడైపోయిన కిడ్నీ. 

ఇప్పుడు సప్లిమెంట్ల హవా నడుస్తున్నది. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అందరూ సప్లిమెంట్ల వెంట పరుగులు తీస్తున్నారు. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ల్లను ఇష్టానుసారంగా వాడితే మొదటికే మోసం వస్తుందంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా, విటమిన్‌-డి సప్లిమెంట్లను వైద్యసలహా లేకుండా తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. 

విటమిన్లు, మినరల్స్‌ (ఖనిజ లవణాలు)ను సూక్ష్మ పోషకాలు అంటారు. అంటే, ఇవి మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం. కానీ ఇవి శారీరక, మానసిక ఎదుగుదల,  ఇతర జీవావసరాలకు అత్యవసరం. ఇవి లోపిస్తే సమస్యలు వస్తాయి. కానీ, వీటి పరిమాణం ఎక్కువైనా కష్టమే.

విటమిన్‌ - డి

విటమిన్‌-డి లోపం ఉంటే న్యుమోనియా, బ్రాంకైటిస్‌ లాంటి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు, విటమిన్‌-డి ఉన్నవాళ్లలో కన్నా, లేనివాళ్లలోనే కొవిడ్‌ వచ్చే ప్రమాదం రెండొంతులు ఎక్కువ. మనకు ఎండ ఎక్కువ కాబట్టి విటమిన్‌-డి లోపం మనలో ఉండదనే అనుకునేవాళ్లం. కానీ గ్రామీణులు, వ్యవసాయ కూలీల్లో కూడా దీని లోపం కనిపిస్తున్నది. ఇంతకు ముందు పొలాల్లో చొక్కా లేకుండా పనిచేసేవాళ్లు. ఇప్పుడలా కాదు. మన సంప్రదాయ దుస్తులు కూడా ఒళ్లంతా కప్పి ఉంచేవే. పైగా ఎండలో కన్నా ఏసీల్లోనే ఎక్కువగా ఉంటున్నాం. అందుకే మనవాళ్లలో కూడా విటమిన్‌-డి లోపం అధికంగా ఉంటున్నది. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతున్నది. విటమిన్‌-డి ఒకప్పుడు  ఎముకలు, దంతాలకు సంబంధించిన పని మాత్రమే చేస్తుందని అనుకున్నాం. ఆహారం ద్వారా తీసుకునే కాల్షియంను శరీరం గ్రహించడానికి.. ఎముకలు, దంతాల పెరుగుదలలో ఇది కీలకమైనదే. కానీ దాదాపు అన్ని అవయవాలకూ ఈ విటమిన్‌ ఉపయోగపడుతుందని అనేక పరిశోధనల్లో తెలిసింది. ఇదేవిధంగా ‘ఇన్నేట్‌ ఇమ్యూనిటీ’ని పెంచుతుందని చెప్పే అధ్యయనాలు కూడా ఉన్నాయి. బాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ ఏ ఇన్‌ఫెక్షన్‌ నుంచైనా ఇది రక్షిస్తుంది. అందుకే కొవిడ్‌ టైంలో విటమిన్‌-డి సప్లిమెంట్లు వేసుకోవాలని ఎవరికివారు నిర్ణయించుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో చూసి సొంతవైద్యం చేసుకుంటున్నారు. సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల అనేక రకాలుగా ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. చర్మం కందిపోవచ్చు కూడా. దీంతో, చాలామంది సప్లిమెంట్లు తీసుకోవాలనుకుంటున్నారు. కానీ, మోతాదు మించి విటమిన్‌-డి తీసుకుంటే సైడ్‌ ఎఫెక్టులు ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.  

విటమిన్‌-డి టాక్సిసిటీ

మన శరీరానికి రోజుకి 400 యూనిట్ల క్యాల్షియం చాలు. 70 ఏండ్ల వయసులో 800 యూనిట్లు కావాలి. కానీ, రోజుకు 10 వేలకు మించవద్దు. విటమిన్‌-డి ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా శరీరానికి చేరే క్యాల్షియం ఎక్కువైపోతుంది. దానివల్ల వివిధ కణజాలాల్లో కండరాల బలహీనత, మృదుకణజాల్లో నొప్పుల వంటి రకరకాల సమస్యలు వస్తాయి. విటమిన్‌-డి టాక్సిసిటీ లక్షణాలు కనిపించడానికి ఎక్కువ రోజులు పడుతుంది. 

 హైపర్‌ కాల్సీమియా

విటమిన్‌-డి టాక్సిసిటీ వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్టుల్లో ఇది ముఖ్యమైంది. రక్తంలో ఎక్కువ మోతాదులో క్యాల్షియం ఉండటాన్ని హైపర్‌ కాల్సీమియా అంటారు. విటమిన్‌-డి అవసరానికి మించి ఉంటే శరీరంలో క్యాల్షియం లెవెల్స్‌లో కూడా తేడాలు వస్తాయి. తద్వారా ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం, వికారంగా ఉండటం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. 

కిడ్నీలకు చేటు:   

విటమిన్‌-డి అధికమైతే కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అవసరానికి మించి ఉన్న క్యాల్షియం గుండె, కిడ్నీ లాంటి కీలక అవయవాల్లో కూడా చేరడం వల్ల అవి సమస్యలో పడుతాయి. అందువల్ల అప్పటికే కిడ్నీ, గుండె సమస్యలుంటే డాక్టర్‌ను సంప్రదించకుండా విటమిన్‌-డి సప్లిమెంట్లు అస్సలు వేసుకోకూడదు. 

 బోన్‌ లాస్‌: 

ఎముకల ఆరోగ్యంలో విటమిన్‌-డి పాత్ర కీలకమైందనే కారణంతో, అతిగా తీసుకుంటే ఎముకలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. ఎముక సాంద్రత తగ్గవచ్చు. అందువల్ల ఎముకల ఆరోగ్యం సవ్యంగా ఉండాలంటే, ఎక్కువ తక్కువలు కాకుండా సరైన మోతాదులో క్యాల్షియం, విటమిన్‌-డి ఉండేలా చూసుకోవాలి. 

జీర్ణ సమస్యలు:వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం

క్యాల్షియం అతిగా ఉన్నప్పుడు వికారం, వాంతులు ఉంటాయి. ఆకలి తగ్గిపోతుంది. ఈ కోణంలో అనేక అధ్యయనాలున్నాయి.

విటమిన్‌-డి, క్యాల్షియం ఎక్కువైతే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందువల్ల విటమిన్‌-డి మోతాదుకు మించి తీసుకుంటే కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు రావచ్చు. అయితే ఇతర ఆరోగ్య సమస్యలున్నప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.  అదే జరిగితే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 

జింక్‌

జింక్‌ లోపించడం సర్వసాధారణం. పేగుల్లో జబ్బు వల్లనో, మరే కారణం చేతనో పోషకాహారలోపం ఏర్పడినవాళ్లలో, మందుబాబులలో దీని లోపం ఎక్కువ. జింక్‌ తక్కువుంటే మన శరీరంలో స్వతహాగా ఉండే ఇన్నేట్‌ ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. జింక్‌ బాగా ఉంటే కణాల పొరలు గట్టిగా ఉంటాయి. దాంతో వైరస్‌ కణంలోకి ప్రవేశించలేదు. తద్వారా, ఇన్‌ఫెక్షన్లను నిరోధిస్తుంది. తగినంత జింక్‌ లేకపోతే నరాలు మొద్దుబారుతాయి. చర్మంలో పుండ్లు నయం కావు. ఇన్‌ఫర్టిలిటీ, హైపోగొనాడిజమ్‌ లాంటి సమస్యలు వస్తాయి.  

మామూలుగా అయితే రోజుకి 10 మి.గ్రా. జింక్‌ టాబ్లెట్‌ చాలు. ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసమైనా రోజుకు 10 మి.గ్రా. టాబ్లెట్‌ వాడవచ్చు. కొవిడ్‌ లక్షణాలుంటే వారం నుంచి 10 రోజుల పాటు 50 మి.గ్రా వాడవచ్చు. కొవిడ్‌ రాకపోయినా ఎక్కువ జింక్‌ వాడితే ఎక్కువ ఇమ్యూనిటీ వస్తుందని రోజుకు 50 మి.గ్రా. వాడితే, చివరికి బలహీనతే మిగులుతుంది.  నరాలు దెబ్బతింటాయి. తిమ్మిర్లు వస్తాయి. వాంతులు, వికారం, విరేచనాలు, ఒక్కోసారి పొట్టలో నొప్పి ఇబ్బందిపెడతాయి. చాలా ఎక్కువైతే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు.  

ఎలా వాడాలి? 

విటమిన్‌-డి సప్లిమెంట్లు తీసుకోవాలని అనుకుంటే నిపుణుల సలహా తప్పనిసరి. డాక్టర్‌ సూచన లేకుండా వాడవద్దు.  ఈ సప్లిమెంట్‌ను 8 నుంచి 12 వారాల పాటు వారానికి ఒకసారి 60 వేల యూనిట్ల క్యాప్సుల్‌ గానీ టాబ్లెట్‌ గానీ, పొడి గానీ వాడవచ్చు. ఆ తరువాత నెలకు ఒకటి వేసుకోవాలి. అలా ఈ కొవిడ్‌ సీజన్‌ అయిపోయేదాకా నెలకొకటి వేసుకుంటూ ఉండవచ్చు. మనదేశంలో చాలావరకు విటమిన్‌-డి తక్కువ ఉంటుంది. టెస్ట్‌ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, ఇంతవరకు అందరూ వాడవచ్చు. విటమిన్‌-డి కొవ్వులో కరుగుతుంది. కాబట్టి ఈ టాబ్లెట్‌ను నీటితో బదులుగా పెరుగు, పాలు, స్వీటు లాంటి కొవ్వు పదార్థం తిన్నాక వేసుకుంటే శరీరం బాగా శోషించుకుంటుంది. టాబ్లెట్‌ వేసుకుని నీళ్లకు బదులు పాలు తాగితే మంచిది. 

విటమిన్‌-సి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, ఐరన్‌ గ్రహించడానికి కూడా ఉపయోగపడుతుంది. నీటిలో కరిగే  సి -విటమిన్‌ శరీరంలో తయారుకాదు. ఒంట్లో నిల్వ కూడా ఉండదు. కాబట్టి, బయటి నుంచే తీసుకోవాలి. ఆహారంలో సిట్రస్‌,  తాజా కూరగాయలు తీసుకునేవాళ్లలో దీని లోపం రావడం అరుదు. మనకు రోజుకి 65 మిల్లీగ్రాముల విటమిన్‌-సి కావాలి. ఒకవేళ 200 మిల్లీగ్రాములు (2 గ్రాములు) తీసుకున్నా ఏం కాదు. సాధారణంగా విటమిన్‌-సి టాక్సిసిటీ ఏర్పడదు. అరుదుగా విరేచనాలు, వికారం, వాంతులు, అసిడిటీ, తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, మగవారిలో కిడ్నీ స్టోన్స్‌ రావచ్చు.  తాజా పండ్లు, కూరగాయలు తినేవాళ్లకు సప్లిమెంట్‌ అవసరం లేదు. లేకుంటే 500 మి.గ్రా. టాబ్లెట్‌ను రోజుకొకటి వేసుకోవచ్చు. కొవిడ్‌ లక్షణాలుంటే రోజుకి 500 మి.గ్రా. నుంచి 1000 మి.గ్రా. వరకు ఇస్తారు.