శుక్రవారం 23 అక్టోబర్ 2020
Health - Sep 22, 2020 , 00:51:43

పిల్లలు పక్కెందుకు తడుపుతారు?

పిల్లలు పక్కెందుకు తడుపుతారు?

నిద్రలో పక్క తడిపే పిల్లల్ని చులకన చేసి మాట్లాడుతుంటారు చాలామంది. తల్లిదండ్రులు కూడా చిరాకు పడుతుంటారు. కొందరు పిల్లలు పెద్దయ్యాక కూడా పక్క తడుపుతుంటారు. దీంతో కన్నవాళ్లు ‘పక్కలో మూత్రం పోశావంటే చూడు’.. అంటూ బెదిరిస్తుంటారు. ఎంత చెప్పినా వినడం లేదని కోప్పడుతుంటారు. క్రమశిక్షణ పేరుతో వేధిస్తుంటారు. కానీ ఇలాంటి ప్రయత్నాలేవీ పిల్లల మీద పనిచేయవు. ఎందుకంటే, ఇది ఆ పిల్లలు కావాలని చేస్తున్న పనేమీ కాదు. 

సాధారణంగా శిశువులకు మూత్రాన్ని నిలుపుకోవడం తెలియక పక్కలోనే పోసేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ బ్లాడర్‌ని నియంత్రించే నాడులు పరిణతి చెందుతూ వస్తాయి. కాబట్టి, పట్టి ఉంచగలుగుతారు. దాదాపు ఏడేండ్ల వయసుకల్లా పక్క తడపడం మానేస్తారు. కొందరిలో ఆ తర్వాత కూడా కొనసాగడానికి కారణాలు అనేకం. రాత్రంతా మూత్రం ఆపుకోలేకపోవడం, బ్లాడర్‌ నిండినా మెలకువ రాకపోవడం, రాత్రిపూట ఎక్కువ మూత్రం తయారుకావడం, పగటి సమయంలో మూత్రవిసర్జనకు వెళ్లకపోవడం కారణాలు కావచ్చు. కొన్నిసార్లు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, మలబద్ధకం, ఊబకాయం, నిద్రలో శ్వాసకు అడ్డంకులేర్పడటం, మధుమేహం, మూత్రకోశం, నాడీవ్యవస్థల్లో లోపాలూ ఉండవచ్చు. అందువల్ల ఏడేండ్ల తర్వాత కూడా పక్క తడుపుతుంటే దాని వెనుక కారణమేంటో గుర్తించి, చికిత్స చేయించాలేగానీ పిల్లలను నిందించకూడదు. 


logo