ఆదివారం 01 నవంబర్ 2020
Health - Sep 18, 2020 , 03:27:59

తల్లి నెగెటివ్‌.. బిడ్డ పాజిటివ్‌.. ఇప్పుడెలా?

తల్లి నెగెటివ్‌.. బిడ్డ పాజిటివ్‌.. ఇప్పుడెలా?

మా అక్క నాలుగు నెలల గర్భవతి. తనది ఎ నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌. మా బావ గారిది ఎబి పాజిటివ్‌. ఇప్పుడు మా అక్కకు పుట్టబోయే బిడ్డది పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఉంటే ఎలా? గర్భిణులు నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌తో, బిడ్డ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌తో ఉంటే సమస్యలు వస్తాయా? దీని గురించి కాస్త వివరంగా తెలియజేయండి. - నివేదిత, కూకట్‌పల్లి

ఎర్ర రక్తకణాల పైన ఉండే ప్రొటీన్‌ను యాంటిజెన్‌ అంటారు. ఇవి చాలా రకాలు. వాటిలో డి యాంటిజెన్‌ చాలా ముఖ్యమైంది. డి యాంటిజెన్‌ ఉంటే ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ అనీ లేకపోతే ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ అనీ అంటారు. సాధారణంగా 85 శాతం జనాభా ఆర్‌హెచ్‌ పాజిటివ్‌తో ఉంటారు. కేవలం 15 శాతం మంది మాత్రమే నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌తో ఉంటారు. భార్యాభర్తలిద్దరి బ్లడ్‌ గ్రూప్‌ నెగెటివ్‌ అయితే పుట్టే బిడ్డ వందశాతం నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌నే కలిగివుంటుంది. ఇలాంటప్పుడు ఏ సమస్యా ఉండదు. ఇక గర్భిణి ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ అయివుండి, ఆమె భర్త పాజిటివ్‌ అయితే బిడ్డకు పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ఉండే అవకాశం 50 శాతం ఉంటుంది. 

గర్భంతో ఉన్నప్పుడు తల్లీ, బిడ్డల రక్తప్రసరణలు వేర్వేరుగా ఉంటాయి. కాని కొన్ని చిన్న చిన్న సైనస్‌ల ద్వారా బిడ్డ రక్తం కొంత తల్లికి చేరే అవకాశం ఉంటుంది. అబార్షన్లు, లేదా కడుపుపై దెబ్బ తగలడం వల్ల గానీ, కాన్పు జరిగే సమయంలో గానీ బిడ్డ రక్తం, తల్లి రక్తంతో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లిలో వ్యాధి నిరోధక వ్యవస్థ చర్యల వల్ల యాంటీబాడీలు తయారవుతాయి. అయితే ఈ ఐజిఎం (IgM) యాంటీబాడీలు ప్లసెంటాను దాటి వెళ్లలేవు. కాబట్టి మొదటి బిడ్డకు ప్రమాదం ఉండదు. కానీ ఆరు నెలల్లో ఇవి ఐజిజి (IgG) యాంటీబాడీల్లా తయారవుతాయి. కాబట్టి రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఇవి ప్లసెంటా ద్వారా బిడ్డలోకి ప్రవేశించి ఎర్ర రక్తకణాలపై ప్రభావం చూపిస్తాయి. తద్వారా బిడ్డలో రక్తహీనత వస్తుంది. పుట్టిన తర్వాత కూడా కామెర్లు వస్తాయి. దీన్నే ఎరిత్రోబ్లాస్టోసిస్‌ ఫిటాలిస్‌ అంటారు. ఇది అప్పుడే పుట్టిన బిడ్డలో వచ్చే హీమోలైటిక్‌ వ్యాధి. ఇది రాకుండా ఉండటం కోసం యాంటి డి యాంటిబాడీలను ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. 28 వారాల గర్భం ఉన్నప్పుడు ఒక డోస్‌, డెలివరీ అయిన తర్వాత 72 గంటల లోపు రెండో డోసు ఇస్తారు.

డాక్టర్‌ పి. సరోజ

సీనియర్‌ 

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రిక్స్‌, గైనకాలజీ

బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌

హైదరాబాద్‌