శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Sep 08, 2020 , 00:09:12

మధుమేహం జరభద్రం

మధుమేహం జరభద్రం

చిన్నారులన్న జాలి లేదు.. పెద్దవాళ్లన్న గౌరవం లేదు.. స్త్రీ, పురుష భేదం అసలే లేదు. కొవిడ్‌ 19కి ఎవరైనా ఒకటే. అనారోగ్యంతో ఉన్నారా.. ఇక మరింత సులువుగా విరుచుకుపడుతుంది. అసలే డయాబెటిస్‌.. శరీరాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే.. దానికి ఇప్పుడు కరోనా తోడవుతున్నది. ఫలితంగా మధుమేహులు మరణానికి చేరువ అవుతున్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ గుబులు పుట్టించే మరో విషయాన్ని బయటపెట్టింది. 2019 సంవత్సరంలో నిర్వహించిన అధ్యయన అంచనా ప్రకారం మనదేశంలో 77 మిలియన్ల మంది మధుమేహులు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఇది రెండో స్థానం. ఈ కరోనా వేళ.. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తం కావాల్సిన తరుణమిది. అందుకే షుగర్‌ ఉన్నవాళ్లు తమ జబ్బును ఎలా అదుపు చేసుకోవాలో ఇలా సూచిస్తున్నారు నిపుణులు.

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానం మనదే. పాశ్చాత్యుల కన్నా మన భారతీయుల్లో సహజంగానే డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. మన జన్యు స్వభావమే ఇందుకు కారణం. క్లోమ గ్రంథి (పాంక్రియాస్‌)లోని బీటా కణాల పనితీరు దెబ్బతినడం వల్లనే మధుమేహ వ్యాధికి దారితీస్తుంది. గ్లూకోజ్‌ వినియోగానికి అవసరమయ్యే ఇన్సులిన్‌ విడుదలకు ఈ బీటా కణాలే ముఖ్యమైనవి. మన భారతీయుల్లో బీటా కణాలు దెబ్బతినే రిస్కు జన్యుపరంగా ఎక్కువ. దీనికి తోడు మన భారతీయ వంటకాల్లో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, కొవ్వులు, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా వాడుతుంటాం. ఈ కారణాల వల్ల డయాబెటిస్‌, అధిక రక్తపోటు, గుండెజబ్బులు మనవాళ్లకు ఎక్కువగా వస్తున్నాయి. డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోతే కార్డియోవాస్కులర్‌ వ్యాధులు, కిడ్నీ ఫెయిల్యూర్‌, కంటి సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు కొవిడ్‌ 19 రిస్కు కూడా ఈ కోవలోకి చేరింది. 

కొవిడ్‌తో తంటా ఇదే: మిగిలిన అందరి లాగానే డయాబెటిస్‌ ఉన్నవాళ్లు కూడా కొవిడ్‌ 19 బారిన పడేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్నవాళ్ల కన్నా చక్కెర వ్యాధి ఉన్నవాళ్లకు కొవిడ్‌ 19 ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ వల్ల లక్షణాలు, కాంప్లికేషన్లు చాలా తీవ్రంగా ఉంటాయి. డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు, స్థూలకాయం, డిస్‌లిపిడీమియా, కార్డియోవాస్కులర్‌ వ్యాధులు కూడా ఉంటే కొవిడ్‌ 19 తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు కొవిడ్‌ సోకితే చనిపోయే ప్రమాదం 50 శాతం ఎక్కువ. మధుమేహం వల్ల ఇమ్యూనిటీ మరింత తగ్గిపోవడమే ఇందుకు కారణం. మామూలు వ్యక్తుల కంటే డయాబెటిస్‌ ఉన్నవారు ఈ వైరస్‌ సోకినప్పుడు ఎక్కువ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు ఈ వైరస్‌ సోకినప్పుడు ఆహారం సరిగా తీసుకోకపోతే హైపోైగ్లెసీమియా (రక్తంలో చక్కెరలు తగ్గిపోవడం) సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌ (డికెఎ)కు దారితీయవచ్చు. ఈ స్థితిలో వెంటనే చికిత్స అందించకపోతే మరణాలు సంభవించవచ్చు. 

జీవనశైలి - క్రమశిక్షణ: డయాబెటిస్‌ వచ్చినప్పటికీ, కంట్రోల్‌లో ఉంచుకునేవాళ్లకు కొవిడ్‌ రిస్కు తక్కువ. పెద్దవాళ్లు, డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనివాళ్లకు దీని తీవ్రత ఎక్కువ. కాబట్టి ఇలాంటి పాండెమిక్‌ పరిస్థితుల్లో క్రమశిక్షణతో కూడిన జీవనశైలే ఈ విపత్తును తప్పించే మార్గం. ఇటు డయాబెటిస్‌ కంట్రోల్‌ కావాలన్నా, అటు కొవిడ్‌ 19 తీవ్రమైన ప్రభావం చూపకుండా ఉండాలన్నా మన జీవనశైలిని ఒక క్రమ పద్ధతిలో పాటించడం తప్పనిసరి. మనం తినే ఆహారం, చేసే పనులలో క్రమశిక్షణ ఉండాలి. ఇదే కొవిడ్‌ విశ్వమారి నుంచి మధుమేహులను కాపాడే రక్షణ మార్గం. ఇప్పుడిదే మనందరి తారక మంత్రం కావాలి.

ఏం చేయాలి?

 • ఈ పాండెమిక్‌ టైంలో రక్తంలో చక్కెరల మోతాదును ఎప్పటికప్పుడు మేనేజ్‌ చేసుకుంటుండటం అత్యవసరం. హోమ్‌ మానిటరింగ్‌ కిట్‌ తెచ్చుకుని పరీక్ష చేసుకుంటుండటం మంచిది. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు మాత్రమే కాదు.. మధుమేహం ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నవాళ్లు, అధిక కొలెస్ట్రాల్‌, స్థూలకాయం, అధిక బరువు, బీపీ ఉన్నవాళ్లు కూడా షుగర్‌ టెస్టు చేసుకుంటుండాలి. పీసీఓఎస్‌ లాంటి సమస్యలున్న మహిళలలో ముందుగానే టెస్టు చేయించాలి. 30 ఏండ్లు దాటినవాళ్లందరూ రెగ్యులర్‌గా డయాబెటిస్‌ పరీక్షలు చేయించుకుంటుండాలి. 
 • డయాబెటిస్‌ ఉన్నవాళ్లు హెచ్‌బీఏ1సీ (ైగ్లెకేటెడ్‌ హిమోగ్లోబిన్‌) కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఇమ్యూన్‌ సిస్టమ్‌ మెరుగ్గా పనిచేస్తుంది. అందువల్ల రక్తంలో చక్కెరతో పాటుగా ైగ్లెసిమిక్‌ స్థాయి ఎలా ఉందో కూడా చెక్‌ చేసుకుంటుండాలి.
 • టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్నట్టయితే రోజుకి 4 నుంచి 7 సార్లు రక్తపరీక్ష చేసుకోవాలి. బ్లడ్‌ షుగర్‌ 200 కన్నా ఎక్కువ ఉంటే వాళ్లు డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్లు కీటోన్‌ స్ట్రిప్స్‌ను వాడుకుని కీటోన్స్‌ ఉన్నాయా లేదా అని పరీక్ష చేసుకోవాలి. కీటోన్స్‌ ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. 
 • హైపోైగ్లెసీమియా లక్షణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయి తక్కువ (70మి.గ్రా.) ఉంటే 15 గ్రాముల గ్లూకోజ్‌ లేదా తేనె, జామ్‌, క్యాండి లేదా పండ్ల రసం లాంటివి తీసుకోవాలి. 15 నిమిషాలకు ఒకసారి పరీక్ష చేయాలి. గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరిగేవరకు ఇలానే చేయాలి. అయినా పెరగకపోతే డాక్టర్‌ను అడగాలి.
 •  జలుబు ఉందని మందుల షాపుల్లో కొని వాడే మందుల వల్ల బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరగవచ్చు. దగ్గు మందుల వల్ల కూడా చక్కెరలు పెరుగుతాయి. జ్వరం, నొప్పి నివారణ మందులు కూడా ఇబ్బందికరమైనవే. పెద్దమోతాదులో యాస్పిరిన్‌ తీసుకుంటే గ్లూకోజ్‌ లెవల్స్‌ పడిపోవచ్చు. అందుకే జలుబు, ఫ్లూ, ఇతర వైరస్‌ ఇన్‌ఫెక్షన్లకు సొంతవైద్యం వద్దు. 
 • ఒక్క పూట కూడా డయాబెటిస్‌ మందులు మరవద్దు. టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఇన్సులిన్‌ తీసుకోవాలి. కొందరు టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో కూడా నోటి మాత్రల వల్ల కంట్రోల్‌ లేకుంటే ఇన్సులిన్‌ అవసరం అవుతుంది. 
 • రెగ్యులర్‌గా డాక్టర్‌ను సంప్రదించాలి. కొవిడ్‌ భయంతో డాక్టర్‌ను కలవకుండా ఉండవద్దు. కనీసం ఫోన్‌లో, టెలిమెడిసిన్‌ ద్వారా అయినా సంప్రదించాలి. ఏం తినాలి?

 • ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 
 • గోధుమ, చిరుధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
 • ఈ విపత్తు సమయంలో శరీరానికి బలాన్నిచ్చేమంచి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. 
 • డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తమ ఆహారం విషయంలో సరైన నియమాలు పాటించాలి. విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లు, యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
 • కేలరీలు ఎక్కువ అవుతాయని తినడం మానవద్దు. అయితే ఆహారాన్ని చిన్న చిన్న విభాగాలుగా చేసి, కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. 
 • ప్రొటీన్లు, ఫైబర్‌, సూక్ష్మపోషకాలు (విటమిన్లు, మినరల్స్‌) ఉన్న ఆహారం మధుమేహులకు చాలా ముఖ్యం. 
 • రోజుకు 3-4 సార్లు పండ్లు, కూరగాయలు సలాడ్‌ రూపంలో అయినా తీసుకోవాలి. ఫైబర్‌, సూక్ష్మపోషకాల కోసం గింజలు, విత్తనాల వంటివి తీసుకోవాలి. 
 • కార్బోహైడ్రేట్లు, కొవ్వులను తక్కువ మోతాదులో, ప్రొటీన్లు, ఫైబర్‌, ఇతర సూక్ష్మ పోషకాలు ఎక్కువ మోతాదులో ఉండే విధంగా సమతులాహారం తీసుకోవాలి.
 • మరో ముఖ్యమైన విషయం.. నీళ్లు. నిరంతరం నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతుండాలి. ఒకేసారి నీళ్లు తాగడంలో ఇబ్బందులు ఉంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 
 • కొంచెం నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్‌ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. 


కదిలితే మేలే

 • చురుకైన జీవనశైలి చక్కెర వ్యాధిని నియంత్రించే చక్కని మార్గం. లైఫ్‌ స్టయిల్‌ యాక్టివ్‌గా ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్‌ లెవల్స్‌ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అందుకే బయటికి వెళ్లి వాకింగ్‌ చేసే వెసులుబాటు లేకపోతే, ఇంట్లోనే వ్యాయామం రెగ్యులర్‌గా చేయాలి.  
 • ఆరోగ్యకరమైన డైట్‌, రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లలో కూడా టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్కు తగ్గించవచ్చు. అందుకే బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ) 23 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ, పురుషుల్లో 90 సెం.మీ కన్నా మించవద్దు. 

ఇవి వద్దు

 •  డయాబెటిస్‌ ఉన్నవాళ్లు కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఇందుకోసం షుగర్‌, తేనె, బెల్లం, కేకులు, పేస్ట్రీలు, ఇతర తీపి పదార్థాలు తీసుకోవద్దు. ఇవన్నీ రక్తంలో చక్కెరలను తొందరగా పెంచుతాయి. 
 • వైట్‌ బ్రెడ్‌, ఆలుగడ్డ చిప్స్‌, కుకీస్‌ లాంటి ప్రాసెస్‌ చేసిన పదార్థాలలో ఉప్పు, నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి జోలికి వెళ్లవద్దు. 
 • ఏరేటెడ్‌, కెఫినేటెడ్‌ డ్రింక్స్‌ అసలు తీసుకోవద్దు. 
 • కృత్రిమ స్వీట్‌నర్స్‌ను కాఫీ, టీలలో కొద్దిగా తీసుకోవచ్చు. తినడం మాత్రం మానవద్దు. 
 •  రోజుకి 5 గ్రా. /1 టీ స్పూన్‌ కన్నా ఎక్కువ ఉప్పు వాడకూడదు. లేకుంటే రక్తపోటు పెరగవచ్చు. 
 • డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఇంటర్‌మిటెంట్‌ ఫాస్ట్‌ డైట్‌ లేదా కీటో డైట్‌ లాంటి వాటి జోలికి వెళ్లవద్దు. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, విత్తనాలపై దృష్టి పెట్టాలి.

డాక్టర్‌ రవిశంకర్‌ ఇరుకులపాటి 

సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ ,అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌ 


logo