శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 31, 2020 , 23:29:00

నాలుక చేసే హెచ్చరిక

నాలుక చేసే హెచ్చరిక

జబ్బు చేసి డాక్టర్‌ దగ్గరికి వెళ్తే నాడి చూసి, నోరు తెరిచి నాలుక చూపించమని అడిగేవాళ్లు ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లు. నోరు అనేక రకాల అనారోగ్యాలకు సంబంధించిన సంకేతాలను ఇస్తుంది. అందుకే అలా నాలుకను చూపమనేవాళ్లు. చైనా సంప్రదాయిక వైద్యులు డయాబెటిస్‌ను గుర్తించడానికి కూడా నాలుక పరీక్షను చేసేవాళ్లు. అందులో ఉపయోగం లేకపోలేదంటున్నారు ఇప్పటి ఆధునిక పరిశోధకులు.  

మధుమేహం వచ్చిందని తెలుసుకోవడానికి పెద్దగా సంకేతాలేమీ ఉండవు. టెస్టుల్లో తప్ప షుగర్‌ వ్యాధి బయటపడదు. అతిగా ఆకలి వేయడం, అతి దాహం, తరచుగా మూత్ర విసర్జన, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపించేసరికే చాలామందికి షుగర్‌ కంట్రోల్‌ తప్పి ఉంటుంది. రక్తంలో చక్కెరల మోతాదు ఎక్కువగా ఉందన్న సంకేతాలను నాలుక కూడా ఇస్తుందంటున్నారు పరిశోధకులు. గతంలో చైనా సంప్రదాయిక వైద్యులు ఉపయోగించే షుగర్‌ పరీక్షను ఇప్పుడు ఆధునిక సైంటిస్టులు కూడా నిర్ధారించారు. రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉందని నాలుక హెచ్చరిస్తుందని పాతకాలం చైనీస్‌ మెడిసిన్‌ వైద్యులు నమ్మేవాళ్లు. రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉందని  నాలుక హెచ్చరిస్తుంది. క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ పరిశోధకుల ప్రకారం నాలుక మండుతూ ఉన్నదంటే రక్తంలో చక్కెరలు పెరిగాయేమోనని అనుమానించాలి. సాధారణంగా నాలుకపై ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్ల నోటిపూత ఏర్పడి నాలుక మంట పుడుతుంది. రక్తంలో చక్కెరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కు అనువైన వాతావరణాన్ని నోటిలోని లాలాజలం కల్పిస్తుంది. అందుకే డయాబెటిస్‌ ఉన్నవాళ్లలో తరచుగా నోటిపూత, అల్సర్లు, చిగుళ్ల సమస్యలను గమనిస్తుంటాం. అందుకే నోటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయంటే వెంటనే షుగర్‌ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. 


logo