శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Aug 25, 2020 , 23:04:50

పీసీఓడీకి ఆయుర్వేదం పనిచేస్తుందా?

పీసీఓడీకి ఆయుర్వేదం పనిచేస్తుందా?

మాకు పెండ్లి అయి ఏడు సంవత్సరాలవుతున్నది. నా భార్య వయసు 28 సంవత్సరాలు. ఇది వరకు ఆమెకు రెండు సార్లు అబార్షన్లు జరిగాయి. ఆమె ముఖం మీద చాలా మొటిమలు కూడా వస్తున్నాయి.  డాక్టర్‌ పరీక్షలు చేసి ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్టు నిర్ధారణ చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఇంగ్లీష్‌ వైద్యం చేయించుకుంటున్నాము. అయితే ఆయుర్వేదంలో ఈ సమస్యలకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? ఈ సమస్యను ఆయుర్వేద చికిత్స ద్వారా పూర్తిగా నయం చెయ్యవచ్చా? దయచేసి వివరాలు తెలియజేయగలరు.  - చంద్రమౌళి, మిర్యాల గూడ

పీసీఓడి అంటే అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడటం అని చెప్పవచ్చు. ఈ సమస్యలో నెలసరి క్రమం తప్పడం లేదా, నెలసరి అసలు రాకపోవడం, చర్మం మీద నల్లటి మచ్చలు ఏర్పడడం, ముఖం మీద మొటిమలు, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో సమస్యలు రావడం, లేదా గర్భందాల్చినప్పటికి అది నిలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ క్రియాశీలకంగా లేకపోవడం వల్ల మధుమేహ సమస్య కూడా కనిపించవచ్చు. అకారణంగా బరువు పెరగడం ఇందులో ముఖ్యమైన మరో లక్షణం. మాములుగా బాహ్య లక్షణాలను బట్టి సమస్యను అంచనా వేయవచ్చు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా కూడా సమస్యను నిర్ధారించవచ్చు. పిల్లలు పుట్టని దంపతులు సంతానం కోసం వాడే మందులే చాలావరకు ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. అందుకే ఇతరత్రా మందుల వాడకాన్ని నివారించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఆయుర్వేదంలో మంచి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. నాగకేసతాల చూర్ణం, పుష్యానుగ చూర్ణంతో సమానంగా తీసుకుని 6 గ్రాముల చొప్పున తేనెతో రోజుకు మూడు  సార్లు తీసుకోవాలి. పల్లేరు కాయల చూర్ణం, నువ్వులు, తేనె, నెయ్యి సమాన భాగంలో తీసుకుని రోజుకు మూడు పూటల సేవించాలి. పెద్దదూలగొండి విత్తులు, గోధుమలను పాలతో ఉడికించి, చల్లబరిచి నెయ్యితో కలిపి తీసుకోవాలి. పాలతో తాగితే మంచిది. అల్లం రసాన్ని తేనెతో గానీ, పాత బెల్లంతో గాని కలిపి సేవిస్తే ఉపయోగకరం. జ్యోతిష్మతి పత్రాలను నెయ్యితో వేయించి చూర్ణం చేసి, మజ్జిగతో కలిపి తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. మీరు మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద నిపుణులను కలిసి వారి సూచనల మేరకు చికిత్స తీసుకొంటే మీ సమస్యకు ఆయుర్వేదం ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది.


logo