సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Aug 24, 2020 , 22:40:48

లేజర్‌తో మొటిమలు పోతాయా?

లేజర్‌తో మొటిమలు పోతాయా?

నాకు చిన్నప్పటి నుంచి మొటిమలు ఉన్నాయి. వాటి నుంచి రక్తం కూడా వస్తున్నది. వీటివల్ల నాకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది. బయటికి నలుగురిలోకి వెళ్లాలంటేనే బిడియంగా ఉంటున్నది. హార్మోన్లలో మార్పుల వల్ల అలాగే వస్తాయి అంటున్నారు. దీనికి పరిష్కారమే లేదా? లేజర్‌ చేయించుకుంటే మొటిమలు పోతాయని విన్నాను. నిజమేనా? - శిరీష, హన్మకొండ

సాధారణంగా 13 ఏండ్ల వయసు నుంచి మొటిమల సమస్య కనిపిస్తుంది. వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఈ మొటిమల వల్ల బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ మొదలై అవి అలాగే చర్మం మీద ఉన్నప్పుడు ఆయిల్‌ ఇంకా పేరుకుపోయి ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. దాంతో అక్కడ చీము ఏర్పడుతుంది. కొందరికి రక్తం కూడా చేరుతుంది. ఇది చాలా తీవ్రమైన దశ. దీన్ని నాడ్యులోసిస్టిక్‌ యాక్నె అంటారు. ఏ రకమైన యాక్నె అయినా కూడా డైరెక్ట్‌గా లేజర్‌ చికిత్స ఇవ్వడం కరెక్ట్‌ కాదు. మీకు ఏ వయసులో అయినా సరే మొటిమలకు డైరెక్ట్‌గా లేజర్‌ చికిత్స చేయరు. ముందు దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది విశ్లేషించుకోవడం అవసరం. నెలసరిలో సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. మీరు వాడే క్రీమ్స్‌ వల్ల మొటిమలు వస్తున్నాయా, ఏవైనా సప్లిమెంట్లు ప్రత్యేకించి విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకుంటే ఈ సమస్య రావొచ్చు. బి12 విటమిన్‌ సప్లిమెంట్ల వల్ల కూడా కొందరికి మొటిమలు ఎక్కువయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. క్షయ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకున్నప్పుడు కూడా మొటిమలు పెరుగుతాయి. మీరు వాడే కాస్మెటిక్స్‌ ఏమైనా చర్మంపై ప్రభావం చూపుతున్నాయా అనేది కూడా పరీక్షించాలి. ఆ తరువాత మీ చర్మం రకాన్ని బట్టి మీకు నిర్దుష్టమైన క్రీమ్స్‌ను సూచిస్తారు. చీము ఏర్పడి, రక్తం వస్తుంటే యాంటిబయాటిక్స్‌ను ఒకట్రెండు వారాలు తప్పనిసరిగా వాడాలి. ఆ తరువాత హార్మోనల్‌ పరీక్షల కోసం టోటల్‌ సీరమ్‌ టెస్ట్‌, ప్రొలాక్టిన్‌ లెవల్స్‌, డిహెచ్‌ఇఎస్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌ హార్మోన్ల లెవల్స్‌ పరీక్షించాలి. పీసీఓడీ సమస్యలున్నాయేమో చూడాలి. ఎందుకంటే చాలారోజుల నుంచి మొటిమలు ఉన్నాయంటే ఈ పరీక్షలన్నీ అవసరం. హార్మోన్‌ సమస్యలు ఉన్నప్పుడు గడ్డం దగ్గర మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి హెయిర్‌ గ్రోత్‌ కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు హార్మోనల్‌ థెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవేవీ లేకుంటే ఐసోట్రిటనిన్‌ బేస్డ్‌ మందులు ఇస్తుంటాం. యాంటిబయాటిక్‌ క్రీమ్స్‌, బ్లాక్‌ హెడ్స్‌ - వైట్‌ హెడ్స్‌ని తీసేసే కొమడోలైటిక్‌ క్రీమ్స్‌ వాడాలి. దాంతో క్రమంగా మొటిమలు తగ్గుముఖం పడుతాయి. లేజర్‌ చికిత్స ఏంటంటే.. ఇలా నాడ్యులోసిస్టిక్‌ యాక్నె ఉన్నప్పుడు కొందరు ఇంటెన్స్‌ పల్స్‌ లైట్‌ థెరపీ చేస్తారు. కొందరు బ్లూ లైట్‌ థెరపీ చేస్తారు. మొటిమలు వేగంగా తగ్గడానికి చేస్తారు. ఏ పెండ్లో, ఫంక్షనో ఉందని, వెంటే రిజల్ట్‌ రావాలనుకున్నప్పుడు చేస్తారు. ఇదేకాదు, కెమికల్‌ పిల్స్‌ కూడా ఉంటాయి. వీటివల్ల కూడా యాక్టివ్‌ యాక్నె తగ్గేందుకు అవకాశం ఉంటుంది. బ్లాక్‌, వైట్‌ హెడ్స్‌ కూడా తగ్గుతాయి. మీ చర్మం రకాన్ని బట్టి మీకు మొదట మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. అయినా తగ్గట్లేదంటే అప్పుడు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. logo