మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Aug 11, 2020 , 00:06:08

జీవనశైలి తలనొప్పి

జీవనశైలి తలనొప్పి

ఎండలోకి వెళ్లి వచ్చారా... రాత్రి నిద్ర సరిపోలేదా... మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్నారా...ఇక అంతే..!  తలలో ఒక భాగమంతా నరాలు లాగేస్తున్నట్టు విపరీతమైన బాధ. కళ్లు తెరిచి చూడలేనంత తలనొప్పి. చిన్న శబ్దం విన్నా, కొంచెం వెలుతురు చూసినా తట్టుకోలేరు. పార్శపు నొప్పి లేదా మైగ్రేన్‌తో బాధపడేవాళ్లకు తరచుగా ఎదురయ్యే సమస్యే ఇది. 12 శాతం మంది  మైగ్రేన్‌తో బాధపడతారని అంచనా. 

మైగ్రేన్‌

ఎవరి జీవితంలో అయినా తలనొప్పి చాలా సాధారణం. అలాంటి సాధారణ తలనొప్పుల్లో మైగ్రేన్‌ ఒకటి. టెన్షన్‌ తలనొప్పి, క్లస్టర్‌ హెడేక్‌ కూడా సహజంగా కనిపించేవే. మన జీవనశైలి కలిగించే ఒత్తిళ్ల వల్ల ఇలాంటి తలనొప్పులు బాధిస్తాయి. ఇవి రావడం వెనుక వేరే ఇతర సమస్యలేమీ ఉండవు. స్కాన్‌ చేస్తే నార్మల్‌గానే ఉంటుంది. అంతేగాక తలనొప్పి కాకుండా వేరే ఇబ్బందులేమీ పెద్దగా ఉండవు. వీటిని ప్రైమరీ హెడేక్స్‌ అంటారు. మైగ్రేన్‌, టెన్షన్‌, క్లస్టర్‌ తలనొప్పులు ఇలాంటివే. కానీ కొన్నిసార్లు అదే పెద్ద ‘తలనొప్పై’ కూచుంటుంది. వాటి వెనుక ప్రమాదకరమైన కారణం ఉంటుంది. అంటే వేరే ఇతర సమస్య వల్ల తలనొప్పి వస్తే దాన్ని సెకండరీ తలనొప్పి అంటారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు దెబ్బ తగిలినా, రక్తస్రావం అయినా, మెదడులో రక్తం గడ్డ కట్టినా, అది చిట్లిపోయినా, బ్రెయిన్‌ ట్యూమర్లున్నా, మెదడులో ఇన్‌ఫెక్షన్‌ (మెనింజైటిస్‌) ఉన్నా ఇలాంటి తలనొప్పి వస్తుంది. సైనస్‌ సమస్య వల్ల వచ్చే తలనొప్పి కూడా సెకండరీ హెడేక్‌నే. అయితే ఏది ప్రైమరీ, ఏది సెకండరీ తలనొప్పి అని కనుక్కోవడమే ముఖ్యమైన విషయం. 

సాధారణంగా మైగ్రేన్‌ హెడేక్‌లో తలలో ఒకవైపు భాగం నొప్పిగా ఉంటుంది. ఆ వైపున నాడి కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. తలనొప్పి ఉన్నప్పుడు అక్కడ వైబ్రేషన్‌ తెలుస్తుంటుంది. రక్తనాళంలో పల్స్‌ లాగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని పల్సేటింగ్‌ హెడేక్‌ అంటారు. మైగ్రేన్‌ ఉన్నప్పుడు కొందరికి తలనొప్పి రాబోతున్నదని ముందుగానే తెలుస్తుంది. తలనొప్పి వచ్చే ముందు కంటిచూపులో తేడా వస్తుంది. తిమ్మిర్లు వస్తాయి. చెవిలో శబ్దాల్లా రావొచ్చు. డిప్రెషన్‌, యాంగ్జయిటీ ఉండవచ్చు. కళ్ల ముందు నక్షత్రాల్లా కనిపించవచ్చు. ఇలా ముందుగానే రకరకాల సంకేతాలు కనిపించడాన్ని ఆరా అంటారు. ఈ ఆరాతో పాటు వచ్చే తలనొప్పిని మైగ్రేన్‌ విత్‌ ఆరా అంటారు. కొందరిలో ఈ సంకేతాలేవీ లేకుండా కూడా మైగ్రేన్‌ రావొచ్చు. దాన్ని నాన్‌ ఆరా మైగ్రేన్‌ అంటారు. మైగ్రేన్‌ ఉన్నప్పుడు  కొందరికి వాంతులు అవుతాయి. కంటి చూపు తగ్గడంతో పాటు వికారం, తీవ్రమైన అలసట ఉంటాయి. ఇలాంటప్పుడు కాంతి, శబ్దాలను తట్టుకోలేరు. 

 మహిళలు - మైగ్రేన్‌: వయసును బట్టి హార్మోన్ల తేడాను బట్టి కూడా మైగ్రేన్‌ మారుతుంటుంది. ఆడవాళ్లలో మైగ్రేన్‌ వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువ. వీళ్లలో కనిపించే హార్మోన్ల తేడాలే ఇందుకు కారణం. కొందరికి మెన్‌స్ట్రువల్‌ మైగ్రేన్‌ ఉంటుంది. అంటే కేవలం నెలసరి సమయంలో మాత్రమే తలనొప్పి వస్తుంటుంది. మరికొందరిలో మెన్‌స్ట్రువల్‌ రిలేటెడ్‌ మైగ్రేన్‌ ఉంటుంది. అంటే సాధారణంగా వచ్చే తలనొప్పే నెలసరి సమయంలో చాలా ఎక్కువ అవుతుంది. ఇది నెలసరికి రెండుమూడు రోజుల ముందు (పిఎంఎస్‌) నుంచి ప్రారంభమై నెలసరి మూడు రోజుల దాకా ఉంటుంది. దీనికి కారణం ఈస్ట్రోజన్‌ లెవల్స్‌ ఒక్కసారిగా తగ్గిపోవడం. పీరియడ్స్‌ ముందు ఈస్ట్రోజన్‌ తగ్గిపోతుంది. ఈ హార్మోన్లలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పులే మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్లలో తేడాలకు కారణమై తలనొప్పి వస్తుంది. 

సాధారణ తలనొప్పి.. ప్రమాదకరమైన తలనొప్పి: కొందరిలో మామూలుగా మైగ్రేన్‌ లేదా టెన్షన్‌ తలనొప్పి లాంటి ప్రైమరీ హెడేక్స్‌ ఉండి, ఇంకేదైనా సమస్య రావొచ్చు. దానివల్ల సెకండరీ తలనొప్పి కూడా రావొచ్చు. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి మైగ్రేన్‌ ఉన్నవాళ్లకి 40 ఏండ్లు దాటాక మెదడులో ఏ కణితో ఏర్పడి సెకండరీ తలనొప్పి కూడా కనిపించొచ్చు. ఇలాంటప్పుడు ప్రమాదకరమైన తలనొప్పిని కూడా సాధారణ మైగ్రేన్‌గా పొరబడితే ప్రమాదం. అందుకే ఇలాంటప్పుడు లక్షణాలను తరచూ చూసుకోవాలి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ తలనొప్పిలో వచ్చే తేడాను సాధారణంగా తీసుకోవద్దు. 

 • ఇంతకు ముందు నుంచీ మైగ్రేన్‌ ఉన్నప్పటికీ 40 ఏండ్ల తర్వాత తలనొప్పితో పాటుగా జ్వరం, ఫిట్స్‌ లాంటివి వస్తున్నాయేమో చెక్‌ చేసుకోవాలి. (జ్వరంతో పాటుగా తలనొప్పి తీవ్రంగా ఉంటే మెదడులో ఇన్‌ఫెక్షన్‌ ఉండే ప్రమాదం ఉంది).
 • అకస్మాత్తుగా కాలు లేదా చెయ్యిలో బలం తగ్గుతుందేమో గమనించాలి. 
 • అంతకుముందు టాబ్లెట్లతో తగ్గిన తలనొప్పి ఇప్పుడు తగ్గడం లేదంటే సెకండరీ కారణం ఉందేమోనని అనుమానించాలి.
 • అప్పటి వరకూ వచ్చే తలనొప్పి, ఇప్పుడు వస్తున్న తలనొప్పిలో ఏమన్నా తేడా కనిపిస్తుందేమో చెక్‌ చేసుకోవాలి. 
 • బీపీ ఉన్నా, రక్తప్రసరణ ఎక్కువైనా తలనొప్పి రావొచ్చు. అందువల్ల తప్పనిసరిగా బీపీ పరీక్షించుకోవాలి. 
 • ఇంతకుముందు క్షయ వ్యాధి వచ్చి తగ్గితే, ఇప్పుడు తలనొప్పి వస్తుంటే అప్రమత్తం కావాలి. 
 • నలభైలలో మొట్టమొదటిసారిగా తీవ్రమైన తలనొప్పి వస్తుంటే అశ్రద్ధ చేయవద్దు. 
 • ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి. 

చికిత్స: తలనొప్పి వచ్చిందని మెడికల్‌ షాప్‌కి వెళ్లి తలనొప్పి మాత్రలు తెచ్చుకుని వాడటం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఇలా ఎడాపెడా పెయిన్‌ కిల్లర్లు వాడితే అవి అలవాటైపోయి దీర్ఘకాలిక తలనొప్పిగా మారుతుంది. నెలలో 15 రోజుల కన్నా ఎక్కువ కాలం, మూడు నెలల పాటు ఉంటే అది క్రానిక్‌ హెడేక్‌ అన్నమాట. అందుకే డాక్టర్‌ సలహా లేకుండా సొంతవైద్యం చేయొద్దు. చాలావరకు పారాసిటమాల్‌ లాంటి మాత్రలతోనే తలనొప్పి తగ్గిపోతుంది. దీర్ఘకాలిక తలనొప్పి ఉన్నవాళ్లకు సాధారణంగా 3 నెలల పాటు ప్రివెంటివ్‌ మెడిసిన్‌గా మందులు వాడుతారు. వీటితో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలావరకు మైగ్రేన్‌ తగ్గిపోతుంది. ఇకపోతే మైగ్రేన్‌తో పాటు ఇతర సమస్యలుంటే రెండింటిపై పనిచేసే మందులు ఇస్తారు. ఉదాహరణకు బీపీ ఉన్నవాళ్లకు బీటా బ్లాకర్లు ఇస్తే అటు బీపీ, ఇటు మైగ్రేన్‌ రెండూ కంట్రోలవుతాయి. యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లాంటివి ఉన్నప్పుడు కూడా మైగ్రేన్‌కి కూడా పనికొచ్చే మాత్రలను ఎంచుకుంటారు. 

మైగ్రేన్‌కి సీజీఆర్‌పీ (కాల్సిటోనిన్‌ జీన్‌ రిలేటెడ్‌ పప్టైడ్‌ ఇన్‌హిబిటర్లు) అనే కొత్త మందులు ఉన్నాయి. వీటి ద్వారా మైగ్రేన్‌ను నివారించొచ్చు. ఈ ఇంజెక్షన్లను కొందరికి నెలకోసారి, కొందరికి మూడు నెలలకోసారి వాడితే సరిపోతుంది. అయితే ఇవి చాలా ఖరీదైనవి. మన దేశంలోకి ఇంకా రాలేదు. మైగ్రేన్‌ నివారించాలంటే మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుచుకోవడం ముఖ్యం. 

ప్రేరకాలు - ట్రిగ్గరింగ్‌ కారకాలు


 • చాలావరకు సరైన జీవనశైలి పాటించకపోవడం వల్లనే మైగ్రేన్‌ తలనొప్పి దాడి చేస్తుంది. 
 • మైగ్రేన్‌ రావడానికి కొన్ని ఇతర కారకాలు దోహదం చేస్తాయి. 
 • కంప్యూటర్‌ ముందు ఎక్కువ 
 • సేపు పనిచేయడం
 • డిప్రెషన్‌, యాంగ్జయిటీ, 
 • మానసిక ఒత్తిడి n ఎండలోకి వెళ్లడం, 
 • ఏసీ గాలి డైరెక్ట్‌గా పడటం
 • గింజలు, చాక్లెట్ల లాంటి కొన్ని ఆహార పదార్థాలు
 • ఆకలి వేయటం
 • రెడ్‌వైన్‌ 
 • నిద్ర లేకపోవడం

పిల్లల్లో మైగ్రేన్‌ ఉంటుందా?


సాధారణంగా 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయసులో మైగ్రేన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికి వయసు తేడా లేదు. చిన్న పిల్లలకు రావొచ్చు. 50 ఏండ్ల తర్వాత కూడా రావొచ్చు. ఏడాదిన్నర వయసులో కూడా మైగ్రేన్‌ కనిపించవచ్చని ఆధారాలున్నాయి. అయితే స్కూల్‌కి వెళ్లే వయసు పిల్లల్లో 10 శాతం, కౌమారంలోని పిల్లల్లో 20 నుంచి 30 శాతం వరకు మైగ్రేన్‌ కనిపిస్తుంది. మైగ్రేన్‌ వచ్చే స్వభావం ఉన్నవాళ్లలో 50 శాతం మందికి మొట్టమొదటి మైగ్రేన్‌ అటాక్‌ 12 ఏండ్లలోపే రావొచ్చు. అయితే 30 ఏండ్ల వయసు దాటిన తరువాత తీవ్రంగా కనిపిస్తుంది. 

ప్రెగ్నెన్సీ - మైగ్రేన్‌ 

మైగ్రేన్‌కి ప్రధాన కారణం ఒత్తిడి. నార్మల్‌ డెలివరీ ఎలా అవుతుందో అన్న బెంగ నుంచి బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందో లేదో అన్న ఆందోళన వరకు గర్భిణులు ఒత్తిడికి గురవుతారు. హార్మోన్ల మార్పులు కూడా ఒత్తిడి కలిగిస్తాయి. కాబట్టి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మైగ్రేన్‌ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇలాంటప్పుడు వాళ్లకు ముందు కౌన్సెలింగ్‌ చేయాలి. ఇంతకుముందు మైగ్రేన్‌ ఉందా, ఇదే మొదటిసారా కనుక్కోవాలి. మొదటి సారి అయితే బీపీ, ఫండస్‌ పరీక్ష లాంటివి చేయాలి. సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు 50 శాతం వరకు మైగ్రేన్‌ పెరుగుతుంది. కొందరికి తగ్గవచ్చు. ఎవరిలో ఎలాంటి ప్రభావం ఉంటుందనేది చెప్పలేం. అయితే గర్భంతో ఉన్నప్పుడు మైగ్రేన్‌తో పాటు దృష్టిలో ఇబ్బంది ఉన్నా, ఫిట్స్‌ వచ్చినా, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా తలనొప్పి ఉన్నా, మామూలుగా వచ్చే నొప్పి ఇప్పుడు తీవ్రంగా బాధిస్తున్నా దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. వీళ్లకి ఎంఆర్‌ వీనోగ్రామ్‌ చేస్తారు. బీపీ, ఎక్లాంప్సియా సమస్యలున్నాయేమో చెక్‌ చేసుకోవాలి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తలనొప్పి విషయంలోనే కాదు, ఏ సమస్య ఉన్నా సొంతంగా మందులు వాడొద్దు. గర్భం వచ్చిన మొదటి మూడు నెలలు (మొదటి ట్రైమిస్టర్‌) ఎంబ్రియోజెనెసిస్‌ ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటప్పుడు మందులు వాడటం శ్రేయస్కరం కాదు. వీటివల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అందుకే సాధ్యమైనంతవరకు మందులకు దూరంగా ఉండాలి. అవసరమైతే డాక్టర్‌ సలహాతో వాడాలి. తలనొప్పి తగ్గడానికి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం, తలకు బాగా నూనె పట్టించి మర్దన చేసుకోవడం వంటివి చేయాలి. 


logo