మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Aug 11, 2020 , 00:06:06

కొవిడ్‌ సీజన్‌లో ఐవిఎఫ్‌కి వెళ్లొచ్చా?

కొవిడ్‌ సీజన్‌లో ఐవిఎఫ్‌కి వెళ్లొచ్చా?

నా వయసు 36 ఏండ్లు. ఒక ఏడాది కాలంగా ప్రెగ్నెన్సీ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. నాకు ఫర్టిలిటీ టెస్టులన్నీ చేసి మే నెలలో ఐవిఎఫ్‌ సైకిల్‌ కోసం రమ్మన్నారు. కాని కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ భయంతో నేను హాస్పిటల్‌కి వెళ్లలేదు. ఈ పరిస్థితుల్లో ఐవిఎఫ్‌ చికిత్స తీసుకోవడం మంచిదేనా? లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే రిస్కు ఎక్కువగా ఉంటుందా? ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియలో బిడ్డకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుందా? నాకు సరైన సలహా ఇవ్వగలరు. 

- నీరజ, మేడ్చల్‌

సంతాన సాఫల్య చికిత్సలు ఇవ్వాలా లేదా అనే విషయంపై ఇప్పటివరకైతే ఎటువంటి గైడ్‌లైన్స్‌ ఇవ్వలేదు. ఇది ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవచ్చు. అయితే తల్లి గానీ, బిడ్డ గానీ ఇన్‌ఫెక్షన్లకు గురవకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ఎక్కువసార్లు హాస్పిటల్‌కి రాకపోవడమే మంచిది. తల్లి నుంచి బిడ్డకు ప్లసెంటా ద్వారా వ్యాధి వ్యాపిస్తుందనడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలూ లేవు. ఒకవేళ అలా వచ్చినా అందుకు ప్లసెంటా మార్గం కాదు. బిడ్డ ప్రసవించేటప్పుడు తల్లికి దగ్గరగా ఉండడమే కారణం కావొచ్చు. 

నావెల్‌ కరొనా వైరస్‌ (ఎన్‌-కొవిడ్‌ 19) వయసు, లింగ భేదం లేకుండా ఎవరికైనా వ్యాపించొచ్చు. అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల గర్భం కోసం ప్రయత్నించేవాళ్లు (సహజంగా లేదా అసిస్టెడ్‌ రిప్రోడక్టివ్‌ ట్రీట్‌మెంట్‌) ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం కొంతవరకు ఉంటుంది. అందువల్ల చాలామంది జంటలు ఐవిఎఫ్‌ చికిత్స కోసం ప్లాన్‌ చేసుకున్నప్పటికీ దాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కొంతమంది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ చేసే తేదీలను మార్చుకుంటున్నారు. 

ఈ నావెల్‌ కరోనా వైరస్‌ మనకు చాలా కొత్తది. అందువల్ల మన ఆరోగ్యం, ప్రెగ్నెన్సీ, ఎదిగే పిండంపైన ఎలాంటి ప్రభావాలు చూపుతుందనే అధ్యయనాలు ఇంకా జరుగలేదు. కాని దీనివల్ల గర్భస్రావం అవుతుందని గానీ, నెలలు నిండకుండా ప్రసవం అవుతుందని గానీ, బిడ్డ లోపాలతో పుడతాడని గానీ ఎటువంటి ఆధారాలూ లేవు. 


logo