గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Aug 11, 2020 , 00:05:52

గాయమైతే పప్పు తినొద్దా?

గాయమైతే పప్పు తినొద్దా?

అంత పెద్ద దెబ్బ తగిలింది.. పప్పు తింటావేం.. అంటూ మందలించే పెద్దలు చాలామంది కనిపిస్తూనే ఉంటారు. దెబ్బలు తగిలి, గాయాలైనప్పుడు పప్పు తింటే సెప్టిక్‌ అవుతుంది. చీము కారుతుంది. గాయం మానదు... అందుకే వాటికి దూరంగా ఉండాలని చెప్తుంటారు. 

ఈ నమ్మకంలో నిజమెంత?

పప్పు తింటే గాయం మానదనీ, మరింత ఎక్కువ అవుతుందని ఎక్కడా ఆధారాలు లేవు. పైగా పప్పు లాంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలంటారు పోషకాహార నిపుణులు. గాయం వల్ల దెబ్బతిన్న కణజాలాలను ప్రొటీన్లు మరమ్మతు చేస్తాయి. ప్రొటీన్‌ లోపం ఉంటే గాయం త్వరగా మానదు. తగినంత ప్రొటీన్‌ లేకుంటే కొల్లాజన్‌ ఏర్పడటం కష్టమవుతుంది. కొత్త కణజాలాలు ఏర్పడటానికి కొల్లాజన్‌ కావాలి. గాయం అయినప్పుడు గాయం తీవ్రతను బట్టి దాదాపు 100 మిల్లీగ్రాములకు పైగా ప్రొటీన్‌ బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి గాయమైనప్పుడు ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం అవసరం. 

గాయం మానే ప్రక్రియపై అనేక రకాల ప్రభావాలుంటాయి. పోషకాహార ప్రభావం మరింత ఎక్కువ. మంచి పోషకాహారం ముఖ్యంగా ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గాయం త్వరగా మానుతుందంటున్నారు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కి చెందిన నిపుణులు. గాయమై పుండు ఏర్పడినప్పుడు పప్పులు, కోడిగుడ్లు, పాల వంటి ప్రొటీన్లతో పాటు విటమిన్‌ సి, కాల్షియం కూడా ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే గాయమైనప్పుడు ఎటువంటి భయం లేకుండా హాయిగా పప్పు తినేయండి. 


logo