గురువారం 13 ఆగస్టు 2020
Health - Jul 29, 2020 , 23:13:55

త్వరలోనే బయటపడతాం!

త్వరలోనే బయటపడతాం!

‘దేశంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు మొదలైన సమయానికి తెలంగాణలోని వైద్యులకు,  ఆరోగ్య అధికారులకు ఆ వైరస్‌ స్వభావం గురించి తెలిసింది చాలా తక్కువ. జూలై చివరికి.. హైదరాబాద్‌ మాత్రమే కాదు, దేశమంతా కూడా కొవిడ్‌ను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అంటున్నారు కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) వ్యవస్థాపకులు, తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ బి. భాస్కర్‌రావు.

చైనాలో మొదలైన కొవిడ్‌-19 కేసులు క్రమంగా ప్రపంచవ్యాప్తం అవుతున్న సమయంలో, లాక్‌డౌన్‌ ఉపయోగపడుతుందని మేం భావించాం. అది అప్పటి పరిస్థితులను బట్టి తీసుకున్న నిర్ణయం. అప్పట్లో ఈ వైరస్‌ గురించి చైనా, ఇటలీల నుంచి వచ్చిన సమాచారం మినహా మరో ఆధారం లేదు. కొవిడ్‌-19 బారిన పడిన రోగుల చికిత్సకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి లాంటి సంస్థలు తరచూ మార్గదర్శకాలలో మార్పులు చేయడం గురించి కూడా  చాలామంది విమర్శలు గుప్పించారు. కానీ ఎప్పటికప్పుడు మారిపోతున్న  కొవిడ్‌  తీరు, ఆ వైరస్‌ గురించి వెలువడుతున్న తాజా సమాచారం, నిత్యం జరుగుతున్న పరిశోధనల ఫలితాలను బట్టి మార్పుచేర్పులు చేయడంలో తప్పు లేదని నా ఉద్దేశం. మనం కొవిడ్‌ను ఎదుర్కోవడానికి వీలైనంత వేగంగా సమాయత్తం అవుతూనే.. వైద్య రంగంలోని మౌలిక వసతులనూ, మానవ వనరులనూ సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది కదా!

మొదట్లో క్వారంటైన్‌ గడువును నాలుగు వారాలుగా నిర్ణయించారు. వైరస్‌ గురించి మరింత సమాచారం వచ్చాక, ఆ వ్యవధిని క్రమంగా పదిహేను రోజులకు కుదించారు. ప్రస్తుతం, కొవిడ్‌ సోకిన వ్యక్తులు పూర్తిగా కోలుకునేందుకు పది రోజులు పడుతుందని నిర్ధరించారు. చాలా సందర్భాలలో ఈ వ్యాధి తేలికపాటి స్థాయిలో సోకిన వారు..  మూడు నుంచి నాలుగు రోజులలోనే కోలుకోవడాన్ని గమనిస్తున్నాం. ఇలాంటి మహమ్మారుల విషయంలో తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, తదనుగుణంగా వ్యూహం మార్చుకోవాలి. ఔషధాల విషయంలో కూడా మొదట్లో హైడ్రోక్లోరోక్విన్‌, ఆ తర్వాత రెమ్‌డెసివర్‌, టొకిలిజుమాబ్‌ లాంటి మందులు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ప్లాస్మా చికిత్స కూడా కొవిడ్‌ బాధితులకు చాలా ఉపయోగపడుతున్నది.

పడకల కొరత

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నమోదు కావడం మొదలుపెట్టగానే.. మేం ఇతర విభాగాలలోని పడకలను కూడా తక్షణం కొవిడ్‌ బాధితులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నాం. అయితే కొవిడ్‌-19కు ముందు నుంచీ కూడా ఆరోగ్య రంగంలో మౌలిక వసతులకు సంబంధించి అనేక సవాళ్లు ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొదట్లో కొవిడ్‌ సోకిన ప్రతి వ్యక్తికీ ఆసుపత్రులలోనే చికిత్స అందించేవాళ్లం. ఇది పడకల లభ్యత మీద తీవ్ర ప్రభావం చూపింది. కానీ రోగ లక్షణాలు కనిపించని బాధితులను ఇంటి దగ్గరే క్వారంటైన్‌లో ఉంచుతూ చికిత్స చేయవచ్చని తెలుసుకున్నాం. రోగ తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకి, ఇంట్లోనే చికిత్స అందించడం వల్ల ఆరోగ్య రంగం మీద చాలా వరకు ఒత్తిడి తగ్గింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా త్వరగా అమలు చేయడమే కాకుండా, అందుకు తగిన సూచనలను ప్రైవేటు ఆరోగ్య సంస్థలకు అందించడంలో సఫలం అయ్యింది.

వెంటనే సంప్రదించాలి

ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులు ఎప్పటికప్పుడు తమ ఆక్సిజన్‌ స్థాయిని గమనించుకుంటూ ఉండాలి. ఎలాంటి తేడా కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటున్న రోగులు, నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. దానివల్ల, రోగుల ఆక్సిజన్‌ స్థాయిలో అనూహ్యమైన మార్పులు వచ్చినప్పుడు తక్షణమే పడకను ఏర్పాటు చేస్తారు. ఆక్సిజన్‌ అందక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న రోగిని అప్పటికప్పుడు వైద్య సహాయం కోసం దవాఖానకు తీసుకురావడం అంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. అలాంటి రోగుల పరిస్థితిని ముందు తాత్కాలికంగా మెరుగుపరిచి, తర్వాతే తీసుకొస్తే మంచి ఫలితం ఉంటుందని గ్రహించాలి. అందుకోసం ఇంటి నుంచే చికిత్స తీసుకుంటున్న రోగులు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. దాని వల్ల రోగికి అత్యవసర పరిస్థితులలో పడక అందలేదన్న ఆరోపణ కూడా రాదు.

వెయ్యి మందికి చికిత్స

ప్రస్తుతం మా ఆసుపత్రిలో నేరుగా కానీ, మా వైద్యుల పర్యవేక్షణలో కానీ సుమారు వెయ్యిమంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. చాలా ప్రైవేటు ఆసుపత్రులు, రోగులకు ఐసొలేషన్‌ లేదా క్వారంటైన్‌లో చికిత్స అందించేందుకు హోటళ్లను ఉపయోగించుకుంటున్నాయి. మేము కూడా మా ఇతర విభాగాలు అన్నింటినీ కొవిడ్‌ చికిత్సలకు అనుగుణంగా తగిన మార్పులు చేశాం. భౌతిక దూరం, మాస్కులను ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం.. లాంటి సదుపాయాలను ఆసుపత్రిలోని ప్రతిచోటా అమలు చేస్తున్నాం. దానివల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలుగుతున్నాం. కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్న రోగులు చాలా త్వరగా కోలుకుంటున్న విషయాన్ని మనం గమనించాలి. అప్పటికే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న అవగాహన కూడా ఇప్పటికే వచ్చేసింది. కాబట్టి.. మనం ఈ మహమ్మారి నుంచి వీలైనంత తక్కువ ప్రాణనష్టంతో బయటపడతామనే నమ్మకం నాకుంది.

భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది?

కొత్తలో కొవిడ్‌ గురించి తీవ్రమైన ఆందోళన ఉండేది. ఆ భయం ఇప్పటికీ ఉంది కానీ,  క్రమంగా తగ్గుముఖం పట్టడం గమనించాను. దీన్ని మనం తేలికగా తీసుకోకూడదు. అలాగని అతిగా స్పందించనూ కూడదు. సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ల రాకతో, ఈ మహమ్మారి నుంచి మనకు కొంతమేర ఉపశమనం లభించి తీరుతుంది. అప్పటి వరకూ కరోనా మాయమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం.. తదితర జాగ్రత్తలతో కొవిడ్‌ నుంచి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. 


logo