గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jul 27, 2020 , 23:21:30

కాలేయ..కాలకేయ ముఠా!

కాలేయ..కాలకేయ ముఠా!

  • హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్లు

ఒక వైపు కొవిడ్‌ స్వైరవిహారం. మరోవైపు వర్షాకాలపు రోగాలు. మనం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో కనిపించే ఇన్‌ఫెక్షన్లలో హెపటైటిస్‌ కూడా ఒకటి. కాలేయంలో వాపువచ్చి జ్వరం, వాంతులు, కామెర్ల వంటి లక్షణాలతో ఈ వ్యాధి బాధపెడుతుంది. డాక్టర్‌ బ్లూంబర్గ్‌ హెపటైటిస్‌ వైరస్‌ను మొట్టమొదట గుర్తించారు. నేడు ఆయన పుట్టిన రోజు. అందుకే, జూలై 28ని అంతర్జాతీయ హెపటైటిస్‌ దినంగా జరుపుకొంటున్నాం. హెపటైటిస్‌ లేని భవిష్యత్తును సాధించడమే ఈ ఏడాది హెపటైటిస్‌ డే లక్ష్యం. 

జీర్ణ ప్రక్రియలోనే కాకుండా శరీరంలోని విష పదార్థాలను బయటికి  పంపించడంలో కూడా కీలకపాత్ర పోషించే అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది దెబ్బతింటే జీవక్రియ అస్తవ్యస్తం అయిపోతుంది. కాలేయాన్ని దెబ్బతీసే ప్రధాన కారణం.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లే. ఆ వైరస్‌ ఇన్‌ఫెక్షన్లలో ముఖ్యమైంది హెపటైటిస్‌. ఈ వైరస్‌లో అయిదు రకాలున్నాయి. అవి హెపటైటిస్‌- ఎ, బి, సి, డి, ఇ. వీటిలో హెపటైటిస్‌ బి, సిల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. వైరల్‌ హెపటైటిస్‌ రోజూ కొన్ని వేల ప్రాణాలకు చేటు తెచ్చిపెడుతున్నది. గత సంవత్సరం 1.4 మిలియన్ల మంది వీటివల్ల చనిపోయారు. 

హెపటైటిస్‌ కాలేయ వ్యాధి కాబట్టి, దాని లక్షణాలు కూడా దాదాపుగా కాలేయ, జీర్ణవ్యవస్థకి సంబంధించినవే అయివుంటాయి. సాధారణంగా హెపటైటిస్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన వారం తరువాత లక్షణాలు బయటపడుతాయి. హెపటైటిస్‌ ఉన్నవాళ్లకు ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వాంతులు అవుతుంటాయి. జ్వరం కూడా వస్తుంది. కళ్లు, మూత్రం, చెమట పసుపు రంగులోకి మారుతాయి. అంటే కామెర్ల లక్షణాలన్నీ ఉంటాయి. రక్త, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు. 


హెపటైటిస్‌ -ఎ (హెచ్‌ఏవీ)

వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌ హెపటైటిస్‌-ఎ. ఇది కలుషిత నీరు, ఆహారం ద్వారా వస్తుంది. దీనివల్ల స్వల్ప అస్వస్థత నుంచి తీవ్ర అనారోగ్యం వరకూ... ఏ స్థాయి సమస్య అయినా రావచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌తో వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, కామెర్లు ఉంటాయి. పరిశుభ్రతను పాటించడమే దీన్ని నివారించగల ప్రధాన సూత్రం. హెపటైటిస్‌-ఎ ఇన్‌ఫెక్షన్‌ నుంచి సాధారణంగా చాలామంది కోలుకుంటారు. ఇక, వీళ్లకు జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుంది. అయితే చాలా కొద్ది మంది మాత్రం తీవ్రమైన కాలేయ సమస్యతో చనిపోతారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఆహారమూ నీరూ కలుషితం కాకుండా చూసుకోవడం.. తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. హెపటైటిస్‌-ఎ వాక్సిన్‌ వేసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. హెపటైటిస్‌-ఎ నివారణకు సమర్థవంతమైన వాక్సిన్‌ ఉంది.

హెపటైటిస్‌-సి (హెచ్‌సీవీ)

హెపటైటిస్‌-సి వైరస్‌తో కలుషితమైన రక్తం ద్వారా హెపటైటిస్‌ సి-ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కూడా తాత్కాలిక, దీర్ఘకాలిక హెపటైటిస్‌లను కలిగిస్తుంది. ఈ వ్యాధి కొన్ని వారాల్లో తగ్గవచ్చు. లేదా అంతకన్నా తీవ్రంగా కూడా ఉండవచ్చు. జీవితాంతం కూడా వెంటాడవచ్చు. దీని బారిన పడిన ప్రతి అయిదుగురిలో నలుగురు దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతారు. అయితే అందరిలోనూ ప్రభావం ఒకే రకంగా ఉండకపోవచ్చు. కొందరిలో అయిదేండ్లకే కాలేయ సమస్యలు మొదలైతే మరికొందరికి సిర్రోసిస్‌ రావడానికి ఇరవై ఏండ్లకు పైగా సమయం పట్టవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 71 మిలియన్ల మంది క్రానిక్‌ హెపటైటిస్‌-సి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. హెపటైటిస్‌ మరణాలకు ప్రధాన కారణం.. సిర్రోసిస్‌, హెపటోసెల్యులర్‌ కార్సినోమా (ప్రైమరీ లివర్‌ క్యాన్సర్‌). హెపటైటిస్‌-సి ప్రధానంగా రక్తం ద్వారా సంక్రమించే వ్యాధి. అరక్షిత శృంగారం, ఇంజెక్షన్లు, సిరంజిల ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్‌-సి ఉన్నవారి రక్తాన్ని మార్పిడి చేస్తే కూడా వస్తుంది. 

చికిత్స: హెపటైటిస్‌-సి ఉన్నప్పుడు కూడా హెపటైటిస్‌-బి లక్షణాలే ఉండవచ్చు. దీన్ని గుర్తించేందుకు హెచ్‌సీవీ యాంటీబాడీల పరీక్ష చేస్తారు. వైరస్‌ మోతాదు తెలుసుకోవడానికి హెచ్‌సీవీ వైరస్‌ లోడ్‌ పరీక్ష చేస్తారు. హెపటైటిస్‌-సితో పాటు హెపటైటిస్‌-బి ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం తోడైతే హెపటైటిస్‌-సి వేగంగా ముదురుతుంది. దీర్ఘకాలికంగా హెపటైటిస్‌-సి ఉన్నవారిలో మూడోవంతు మందిలో 10 నుంచి 15 ఏండ్లకు కామెర్లు, రక్తపు వాంతుల వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. హెపటైటిస్‌-సి బాధితులకు  సిర్రోసిస్‌, లివర్‌ క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువ. అయితే, యాంటివైరల్‌ మందుల ద్వారా 95 శాతం మంది కోలుకుంటారు. సిర్రోసిస్‌, లివర్‌ క్యాన్సర్‌ రిస్కు కూడా తగ్గించవచ్చు. హెపటైటిస్‌-సికి వాక్సిన్‌ లేదు. ఆ ప్రయత్నం ఇంకా పరిశోధన దశలో ఉంది.

హెపటైటిస్‌-బి (హెచ్‌బీవీ) 

హెపటైటిస్‌ వైరస్‌లలో ముఖ్యమైంది హెపటైటిస్‌-బి. ఇది కాలేయంపై దాడి చేసి వ్యాధిని కలిగిస్తుంది. చాలా వేగంగా కాలేయానికి సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒక రకంగా హెచ్‌ఐవీ కన్నా 50 నుంచి వంద రెట్లు ప్రమాదకరం.

ఇలా వ్యాపిస్తుంది:  రక్తం, లాలాజలం, వీర్యం, సర్వికల్‌ ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. శరీరంలో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవారి రక్తం, వివిధ శారీరక స్రావాల ద్వారా ఇతరులకు సంక్రమించే ప్రమాదం ఉంది. అంటే.. అరక్షిత శృంగారం, ఇతరులకు వాడిన ఇంజెక్షన్లు, సూదులు, సిరంజిలు, బ్లేడ్లు, టూత్‌బ్రష్‌లు, నెయిల్‌ క్లిప్పర్ల వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు పాకుతుంది. వైరస్‌ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కొద్దిమందిలో ఫ్లూ లాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లూ ఒళ్లూ పచ్చబడటం వంటి కామెర్ల లక్షణాలు, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్లనొప్పులు ఉండవచ్చు. దీన్ని గుర్తించేందుకు యాంటిజెన్‌ పరీక్ష చేస్తారు. వైరస్‌ చేరిన వెంటనే ఈ పరీక్ష చేస్తే తెలియదు. ఆరు నుంచి పన్నెండు వారాల తర్వాతే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది.  

చికిత్స: హెపటైటిస్‌-బి బారిన పడిన పదిమందిలో తొమ్మిది మందికి ఆరు నెలల్లో దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. కొద్దిమందిలో మాత్రమే శరీరంలో ఉండిపోయి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. ఫలితంగా కాలేయం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. లివర్‌ క్యాన్సర్‌కు అతి ముఖ్య కారణం హెపటైటిస్‌-బి వైరసే. అందుకే హెపటైటిస్‌-బి ఇన్‌ఫెక్షన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చికిత్స చేయించుకోవాలి. ఇలాంటప్పుడు ఇన్‌ఫెక్షన్‌ ముదిరి, లివర్‌ దెబ్బతినకుండా వైద్యం అందిస్తారు. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసే ఫెగ్‌ ఇంటర్‌ఫెరాన్‌ లాంటి ఇంజెక్షన్లు ఇస్తారు. కొన్ని వారాల పాటు మందులు వాడితే వైరస్‌ పెరుగుదల ఆగిపోతుంది. కొన్నిసార్లు జీవితాంతం చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. హెపటైటిస్‌-బి ఉన్న స్త్రీలు గర్భం దాలిస్తే కడుపులోని శిశువుకు కూడా ఇన్‌ఫెక్షన్‌ పాకవచ్చు. అయితే హెపటైటిస్‌-బికి వాక్సిన్‌ను తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు. 


హెపటైటిస్‌-ఇ (హెచ్‌ఈవీ)

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది హెచ్‌ఈవీ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. వీరిలో 3.3 మిలియన్ల మందికి తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయి. ఈ వైరస్‌ కూడా కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తుంది. మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకుండా ఆహారం తీసుకున్నా వస్తుంది. హెప టైటిస్‌-ఇకి వ్యాక్సిన్‌ తయారు చేశారు. కానీ దీనికి చైనాలో మాత్రమే లైసెన్స్‌ ఉంది. అన్ని చోట్లా అందుబాటులో లేదు. 

డాక్టర్‌ కె.యస్‌. సోమశేఖర్‌ రావు

కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

హెపటాలజిస్ట్‌, అపోలో హెల్త్‌ సిటీ ,హైదరాబాద్‌


logo