సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Jul 20, 2020 , 23:53:50

సంతాన సాఫల్యానికి.. సులువైన సర్జరీ

సంతాన సాఫల్యానికి.. సులువైన సర్జరీ

ఎండోస్కోపీ.. జీర్ణ సంబంధ సమస్యల కోసం చేసే పరీక్షగానే చాలామందికి తెలుసు. ఆపరేషన్లలో కూడా ఎండోస్కోపీ విధానాన్ని వాడుతున్నారు. ఇది, గొంతులో నుంచి పంపే గొట్టపు వైద్యం మాత్రమే కాదు.  చిన్నచిన్న రంధ్రాల ద్వారా శరీరంలోకి పరికరాలను పంపి కూడా  చికిత్సలను చేస్తారు. ఎండోస్కోపీ పద్ధతులను ఇప్పుడు స్త్రీ సంబంధ సమస్యలకూ వాడుతున్నారు. ముఖ్యంగా, సంతానలేమితో బాధపడేవారిలో ఈ చికిత్సలు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. 

జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా వాటిని ఆస్వాదించే వారసులు లేకపోవడం ఓ వెలితే. మారిన జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. పెరుగుతున్న ఒత్తిడి... కారణం ఏదైనా, మొత్తానికి హార్మోన్ల గతిని మార్చేస్తున్నాయి. ఫలితంగా సంతానలేమితో ఎన్నో జంటలు ఆవేదన చెందుతున్నాయి. చాలా సందర్భాల్లో మందులతో హార్మోన్లను సమతుల్యం చేసి, గర్భం వచ్చేలా చేయవచ్చు. కానీ కొన్నిసార్లు లోపాన్ని సర్జరీ ద్వారా మాత్రమే సరిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మంచి ఎంపిక.. ఎండోస్కోపిక్‌ ఇన్‌ఫర్టిలిటీ సర్జరీలు. 

ఒకప్పుడు సర్జరీ అంటే.. పెద్ద పెద్ద కోతలు పెట్టి లోపలి అవయవాల్ని సరిచేయాల్సి వచ్చేది. అందువల్ల రక్తస్రావం ఎక్కువగా ఉండేది.  కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. కానీ గత రెండు దశాబ్దాలుగా గైనకాలజీ సమస్యలకు చేసే సర్జరీల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎండోస్కోపిక్‌ పద్ధతులు ఇన్‌ఫర్టిలిటీతో పాటు ఇతర గైనిక్‌ సర్జరీలను మరింత సులభతరం చేశాయి. ఎండోస్కోపీ పద్ధతి జబ్బును కనిపెట్టడానికే కాదు.. చికిత్సలో కూడా ముఖ్యపాత్ర వహిస్తున్నది. ఆపరేషన్లను కూడా విజయవంతం చేస్తున్నది. 

పెల్విక్‌ అధెషన్లు


కొందరిలో పొత్తికడుపులో ఉన్న అవయవాలను కలుపుతూ అసాధారణ పొరలు ఏర్పడుతాయి. ఈ కణజాలాలు అవయవాల పనితీరుపై ప్రభావం చూపించడం వల్ల ఇన్‌ఫర్టిలిటీ వస్తుంది. ఈ అసాధారణ కణజాలాలను లాపరోస్కోపిక్‌ పద్ధతిలో తొలగిస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. 

నొప్పి తక్కువ

ఎండోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేయించుకుంటే హాస్పిటల్‌లో ఉండాల్సిన సమయం తగ్గుతుంది. సాధారణంగా రెండోరోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. రక్తస్రావం తక్కువ కావడంతో తొందరగా కోలుకుంటారు. నొప్పీ తక్కువే.  గైనకాలజీ సంబంధిత ఎండోస్కోపీలో లాపరోస్కోపీ, హిస్టరోస్కోపీ.. అని రెండు పద్ధతులు ఉంటాయి. లాపరోస్కోపీలో ఒక చిన్న టెలిస్కోప్‌ను నాభి మార్గం ద్వారా పంపిస్తారు. ఇతర పరికరాలను పంపడానికి  5 మి.మీ. రంధ్రాలు పెడుతారు. హిస్టరోస్కోపీలో టెలిస్కోప్‌ను గర్భసంచిలోకి పంపి సమస్యలేమిటో కనుక్కుంటారు. 

ఇన్‌ఫర్టిలిటీలో ఎండోస్కోపీ

 

పిల్లలు లేనివారికి ఎండోస్కోపిక్‌ సర్జరీ ద్వారా చికిత్స అందించి, సంతానం పొందేలా చేయవచ్చు. ఫెలోపియన్‌ ట్యూబులు బ్లాక్‌ కావడం అనేది పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణం. ట్యూబుల్లో అడ్డంకి ఉండటం వల్ల వీర్యకణం అండాన్ని చేరుకోలేదు. అందువల్ల ఫలదీకరణం చెందదు. పిండం ఏర్పడదు. గర్భసంచిలో అంతకు ముందే ఇన్‌ఫెక్షన్లు రావడం, పాలిప్స్‌ ఏర్పడటం వల్ల కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంది. ఎండోస్కోపిక్‌ పద్ధతి ద్వారా ఈ అడ్డంకులను సులువుగా తొలగించవచ్చు. అడ్డంకి ఎక్కడ ఉందనేదాన్ని బట్టి లాపరోస్కోపీ లేదా హిస్టరోస్కోపీని ఎంచుకుంటారు. 

పీసీఓడీ 


ఇటీవలి కాలంలో పాలీసిస్టిక్‌ ఓవరీ వ్యాధి (పీసీఓడీ) చాలామందిలో కనిపిస్తున్నది. మనదేశంలో సంతానలేమి సమస్యలకు ఇది ప్రధాన కారణం. దీనివల్ల అండాశయాల్లో చిన్నచిన్న సంచుల్లాంటి నిర్మాణాలు అనేకం ఏర్పడుతాయి. వీటిని సిస్టులంటారు. వీటివల్ల నెలసరి క్రమం తప్పుతుంది. అండాలు ఏర్పడలేవు. ఈ సమస్య ఉన్నవాళ్లు బరువు పెరుగుతారు. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లలో కూడా ఈ సమస్య ఎక్కువ. పాలీసిస్టిక్‌ ఓవరీ ఉన్నప్పుడు లాపరోస్కోపీ ద్వారా అండాశయంలోని సిస్టులకు విద్యుత్‌ ప్రవాహాన్ని పంపి, వాటిని తీసేస్తారు. ఈ చికిత్స తరువాత అండాల ఉత్పత్తి మెరుగుపడి, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 

ఎండోమెట్రియాసిస్‌: మహిళలను వేధించే సమస్యల్లో ఎండోమెట్రియాసిస్‌ ఒకటి. దీనివల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది. అధిక రక్తస్రావం జరుగుతుంది. ఎండోమెట్రియం అతిగా పెరగడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అందువల్ల ఈ సమస్య ఉన్నవాళ్లలో ప్రెగ్నెన్సీ రావడం కష్టం. అయితే లాపరోస్కోపీ చికిత్స ద్వారా ఎండోమెట్రియాసిస్‌ సమస్యను తగ్గించవచ్చు. 

అండాశయంలో సిస్టులు:  అండాశయాల్లో రకరకాల సిస్టులు ఏర్పడుతాయి. వయసును బట్టి, కారణాన్ని బట్టి ఇవి అనేక రకాలుగా ఉంటాయి. ఇవి ఫెలోపియన్‌ నాళాలు, అండాశయాల్లో తేడాలకు కారణమవుతాయి. చాలావరకు మందులతో తగ్గించవచ్చు. కానీ కొన్ని పెద్దపెద్ద సిస్టులు ఇన్‌ఫర్టిలిటీకి దారితీస్తాయి. కాబట్టి ఆపరేషన్‌ ద్వారా తొలగించాల్సి వస్తుంది. ఇందుకోసం లాపరోస్కోపిక్‌ సర్జరీ చేస్తారు. లాపరోస్కోపీ వల్ల త్వరగా కోలుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ అవకాశాలు మెరుగుపడతాయి.

యుటెరస్‌ సెప్టమ్‌: కొందరిలో పుట్టుకతోనే గర్భసంచి రెండుగా విడిపోయి ఉంటుంది. అంటే గర్భసంచి లోపల మధ్యలో ఒక గోడలా కణజాలపు పొర పెరుగుతుంది. దీనివల్ల గర్భం దాల్చినా.. ఏదో ఓ దశలో గర్భస్రావం అవుతుంటుంది. కాబట్టి పిల్లలు పుట్టరు. ఈ సెప్టమ్‌ను హిస్టరోస్కోపీ పద్ధతిలో తొలగించవచ్చు. ఆ తరువాత సాధారణంగా గర్భం దాలుస్తారు. 

ఫైబ్రాయిడ్లు: గర్భసంచిలో ఏర్పడే ఫైబ్రాయిడ్లు కూడా ఇన్‌ఫర్టిలిటీకి కారణమవుతాయి. వీటి పరిమాణం, అవి ఏర్పడిన చోటును బట్టి ఇన్‌ఫర్టిలిటీ తీవ్రత ఉంటుంది. ఇవి వీర్యకణం అండాన్ని చేరే మార్గంలో ఆటంకాల్ని కలిగిస్తాయి. అందువల్ల ఫలదీకరణ జరుగదు. పిండం ఏర్పడదు. చిన్న వయసు ఆడపిల్లల్లో కూడా ఫైబ్రాయిడ్లు కనిపిస్తున్నాయి. అయితే అన్ని సందర్భాల్లో వీటిని తీసేయడానికి సర్జరీ అక్కర్లేదు. వాటివల్ల కలిగే సమస్యలు, వాటి పరిమాణం, అవి ఉన్న చోటును బట్టి ఆపరేషన్‌ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఫైబ్రాయిడ్ల వల్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మయోమెక్టమీ ద్వారా తొలగిస్తారు. ఒక్కోసారి హిస్టరెక్టమీ ద్వారా గర్భసంచిని కూడా తీసేయాల్సి రావచ్చు. ఈ సర్జరీలను లాపరోస్కోపీ పద్ధతిలో చేస్తారు. సర్జరీ తరువాత సాధారణంగా మరుసటి రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రక్తస్రావం ఎక్కువగా ఉండదు కాబట్టి, త్వరగా కోలుకుని ఎప్పటిలా పనులు చేసుకోవచ్చు.

గర్భస్రావాలు: కొంతమందిలో పదేపదే గర్భస్రావం అవుతూ ఉంటుంది. మూడోనెల గర్భం రాగానే అబార్షన్‌ అయిపోతుంటుంది. ఇందుకు కారణం సర్వికల్‌ ఇన్‌కంపీటెన్స్‌. అంటే సర్విక్స్‌ (గర్భాశయ ముఖద్వారం) చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల కడుపులో బిడ్డను పట్టి ఉంచలేదు. గర్భం బరువును సర్విక్స్‌ మోయలేకపోవడంతో గర్భస్రావం అయిపోతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు సర్వికల్‌ సర్‌క్లేజ్‌ అనే చికిత్స ద్వారా గర్భాశయ ముఖద్వారానికి ఒక చిన్న కుట్టు వేస్తారు. దీన్ని జననాంగం (వ్జైనా) ద్వారా గానీ, లాపరోస్కోపీ పద్ధతిలో గానీ వేస్తారు. అయితే, లాపరోస్కోపీ వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈచికిత్సను గర్బం వచ్చిన తొలినాళ్లలో గానీ, గర్భం రావడానికి ముందు గానీ చేయించుకోవాలి. గర్భం రాకముందే చేయించుకుంటే మంచిది. ఈ సర్జరీ 80 నుంచి 90 శాతం వరకు విజయవంతం అవుతుంది. 
logo