శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Jul 19, 2020 , 23:46:31

క్యాన్సర్‌ ఏ అవయవానికైనా రావొచ్చు!

క్యాన్సర్‌ ఏ అవయవానికైనా రావొచ్చు!

క్యాన్సర్‌లో దాదాపు వంద రకాలకు పైగా ఉన్నాయి. శరీరంలోని ఏ అవయవానికైనా వచ్చే క్యాన్సర్‌ చివరికి కళ్లకూ, గుండెకూ వస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. క్యాన్సర్‌ మొదట కణాల్లో ప్రారంభమవుతుంది. మన శరీరంలోని ప్రతి అవయవం కణాల సముదాయమైన కణజాలాలతో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా కణాలు విభజితమౌతూ ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పడుతూ పాతవి నశిస్తూ ఉంటాయి. కానీ పాత కణాలు నశించకుండానే కొత్త కణాలు ఏర్పడితే అక్కడ ఒక గడ్డలా ఏర్పడుతుంది. దీన్నే క్యాన్సర్‌ లేదా మాలిగ్నెంట్‌ ట్యూమర్‌ అంటారు. ఈ కణాలు రక్తప్రవాహం ద్వారా, లింఫ్‌ వ్యవస్థ ద్వారా శరీరంలోని మిగతా భాగాలకు వ్యాపించి అక్కడ కూడా అపరిమితంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ దశనే మెటాస్టాసిస్‌ అంటారు. ఈ దశకు చేరుకుంటే క్యాన్సర్‌ లొంగడం చాలా కష్టం. తొలిదశలోనే కనుక్కోవడం ద్వారా క్యాన్సర్‌ కణితిని, చుట్టుపక్కల భాగాలను తీసివేయడం ద్వారా దాదాపుగా దాన్ని నయం చేయగలం. 

ఎన్నో బిలియన్ల కణాలతో ఏర్పడే క్యాన్సర్‌ కణితి.. కణాలు పెరిగే కొద్దీ రక్తసరఫరాకు దూరమై ఆక్సిజన్‌ అందక నశించవచ్చు. కానీ ఆ కణాలు కొత్త రక్తనాళాలను ఏర్పరుచుకుంటూ పెరుగుతూ పోతాయి. దీన్నే వైద్య పరిభాషలో యాంజియోజెనెసిస్‌ అంటారు. ఈ విధంగా రక్తనాళాలు ఏర్పడకుండా యాంజియోజెనెసిస్‌ కారకాలను అరికట్టాలని ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ ఇంతవరకు సఫలం కాలేకపోయారు. 

ఇంతకుముందు కన్నా ఇప్పుడు క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో , చికిత్సా విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్‌తో పాటు తొలిదశలోనే కనుక్కునే స్క్రీనింగ్‌ టెస్టులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా, ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో లేదా రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నవారిలో.. అంటే వంశపారంపర్యంగా క్యాన్సర్‌ ఎక్కువగా వస్తున్నా, స్మోకింగ్‌, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లు, వారు చేసే వృత్తిని బట్టి క్యాన్సర్‌ను ముందుగానే కనుక్కోవడానికి చేసే పరీక్షలను స్క్రీనింగ్‌ పరీక్షలంటారు. అలాంటి వాటిలో రొమ్ము క్యాన్సర్‌కు చేసే మామోగ్రామ్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే పాప్‌స్మియర్‌, పెద్దపేగు క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు చేసే పరీక్షలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. 

మనలో చాలామంది హాస్పిటల్‌ అన్నా, హెల్త్‌ చెకప్స్‌ అన్నా భయపడుతారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ లాంటి తీవ్రమైన సమస్యలున్నప్పుడు కూడా ఇన్ని రకాల పరీక్షలు.. ఇంత ఖర్చు ఎందుకని ఆలోచించేవారు కూడా ఉంటారు. క్యాన్సర్‌ కణం చాలా సూక్ష్మమైంది. ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈరోజుల్లో క్యాన్సర్‌ చికిత్సలు వ్యక్తికీ, వ్యక్తికీ మారుతున్నాయి. వాటినే టార్గెటెడ్‌ లేదా పర్సనలైజ్డ్‌ ట్రీట్‌మెంట్స్‌ అంటా రు. కణితి సైజు, వ్యాపించే గుణం, స్టేజ్‌, ఎన్ని లింఫ్‌ నాళాలకు సోకింది, ఇతర శరీర భాగాలకు వ్యాపించిందా, పేషెంట్‌ వయసు, వారి ఇతర ఆరోగ్య సమస్యలు, వాటికి వాడే మందులు.. ఇలా ఆ క్యాన్సర్‌ రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. దాన్ని నిర్ధారణ చేయడానికి అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. 

క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు కూడా లక్షణాల మాదిరిగానే క్యాన్సర్‌ వచ్చిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమవుతాయి. లక్షణాలు కనిపించినప్పుడు ఈ పరీక్షలతో నిర్ధారణ చేశాక, చికిత్స మొదలుపెట్టేటప్పుడు మిగతా విషయాలను తెలుసుకోవడానికి రక్తపరీక్షలు, మల, మూత్ర పరీక్షలు, సీటీ స్కాన్‌, పెట్‌ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటివి చేస్తారు. 

క్యాన్సర్‌ పరీక్షల్లో కొన్ని..

1. ఎ.ఎఫ్‌.పి. (ఆల్ఫా ఫీటో ప్రొటీన్‌) : లివర్‌ క్యాన్సర్‌లో ఈ పరీక్ష లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయి. 

2. సి.ఎ. 15.3 : రొమ్ము క్యాన్సర్‌లో ఈ బ్లడ్‌ మార్కర్‌ ఫలితాల రేంజ్‌ ఎక్కువగా ఉంటుంది. 

3. సి.ఎ. 19.9 : గ్యాస్ట్రిక్‌, పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌లను తెలుపుతుంది. 

4. సి.ఎ. 125 : మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్‌ను తెలుపుతుంది. 

5. సీఈఏ (కార్సినో ఎంబ్రియోనిక్‌ యాంటిజెన్‌) : జీర్ణవ్యవస్థ, పెద్దపేగు (కోలన్‌), మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్లలో చేస్తారు. 

6. డి.ఆర్‌.-70 : 13 రకాల క్యాన్సర్లను నిర్ధారణ చేసే రక్త పరీక్ష. 

7. పీఈటీ (పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ) : క్యాన్సర్‌ కణాల మెటబాలిక్‌ రేటును తెలిపే పరీక్ష. దీని ద్వారా శరీరంలో క్యాన్సర్‌ కణాలు ఎక్కడికి వ్యాపించాయో తెలుస్తుంది. మామూలు కణాల కంటే క్యాన్సర్‌ కణాలు గ్లూకోజ్‌ను ఎక్కువగా తీసుకుంటాయి. 

8. ఎండోస్కోపీ : చిన్న గొట్టం ద్వారా శరీరం లోపలి భాగాలను పరీక్షించడం. వీటిలో పొట్ట లోపలి భాగాలను పరీక్షించేవి, ముక్కులో పరీక్షించే నోసల్‌ ఎండోస్కోపీ, పెద్దపేగులోకి కొలనోస్కోపీ, శ్వాసవ్యవస్థలో బ్రాంకోస్కోపీ వంటివి ఉంటాయి. 

9. పీఎస్‌ఏ : పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందే తెలుసుకునేందుకు వీలయ్యే ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ అనే రక్తపరీక్ష ఇది. 

క్యాన్సర్‌ను ఒక ఎక్స్‌రే లేదా ఒక అల్ట్రాసౌండ్‌తోనే నిర్ధారణ చేయలేరు. ఇలా ఏదో ఒక నిర్దుష్టమైన పరీక్షతో నిర్ధారణ సాధ్యం కాదు. కాని కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ, మిగతా ఇన్‌ఫెక్షన్లు, సిస్ట్‌లు, క్యాన్సర్‌ కాని కణుతులు ఉన్నప్పుడు బయాప్సీలో క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యాకే చికిత్స మొదలు పెట్టడానికి ఈ పరీక్షలు అవసరమవుతాయి. అంతేగాక.. క్యాన్సర్‌ వచ్చి తగ్గాక కూడా మళ్లీ ఎక్కడైనా తిరగబెట్టే ప్రమాదం ఉందా అని తెలుసుకోవడానికి కూడా క్యాన్సర్‌ రకాన్ని బట్టి మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. 

ఈ మార్పులుంటే టెస్ట్‌లు తప్పనిసరి..

  • మల, మూత్ర విసర్జనల్లో మార్పులు
  • ఆకలి, బరువు తగ్గడం
  • మానని పుండు, కణితి, కణితిలో మార్పులు
  • వీడని జ్వరం, తీవ్రమైన అలసట
  • మహిళల్లో నెలసరి మధ్యలో రక్తస్రావం, చనుమొనల నుంచి రక్తస్రావం
  • తీవ్రమైన తలనొప్పిగొంతులో మార్పులు కొంతకాలంగా ఉండడం
  • జీర్ణవ్యవస్థలో చాలాకాలంగా తగ్గని అల్సర్లు
  • శరీరం మీద మచ్చలు, పుట్టుమచ్చల్లో మార్పులు, అవి పెరగడం.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, పరీక్షలంటే భయపడకుండా అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి. logo