సోమవారం 28 సెప్టెంబర్ 2020
Health - Jul 19, 2020 , 23:46:30

ఆయుర్వేదంతో కడుపుబ్బరం తగ్గుతుందా?

ఆయుర్వేదంతో కడుపుబ్బరం తగ్గుతుందా?

నా వయసు 52 ఏండ్లు. గృహిణిగా కుటుంబంలోని మూడు తరాలను చూసుకుంటున్నాను. గత మూడేండ్లుగా కడుపులో గ్యాస్‌, మలబద్ధకంతో బాధపడుతున్నాను. పోయిన వారం నుంచీ ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. తిన్నా, తినకపోయినా కడుపుబ్బరంగానే ఉంటున్నది. ఆయుర్వేదంలో నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. 

- రాజ్యలక్ష్మి, సిద్దిపేట

సాధారణంగా ఆడవాళ్లు ఇంటి పనుల ఒత్తిడిలో బాత్‌రూమ్‌కు వెళ్లడాన్ని కూడా వాయిదా వేసుకుంటారు. దాంతో అపానవాయు.. అంటే, వాత సమతుల్యం దెబ్బతింటుంది. ఇది పేగులలోని కండరాలు పనిచేయడానికి.. విసర్జనను ప్రేరేపించే వాత ప్రకృతి. విసర్జనకు వెళ్లాలని అనిపించినప్పటికీ వాయిదా వేయడం వల్ల దీనిలో తేడాలు వచ్చి మలబద్ధకానికి దారితీస్తుంది. ఈ సమస్య పోవాలంటే ఉదయం పరగడపునే గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కడుపులో ఉండిపోయిన జీర్ణక్రియలోని వ్యర్థాలు గోరువెచ్చని నీటి ద్వారా బయటికి వెళ్లిపోయి, శరీరం డీటాక్సిఫై అవుతుంది. కాఫీ, టీలు తాగడం వల్ల జీర్ణాశయంలోని మ్యూకోసా, రెక్టమ్‌ పొడిబారుతుంది. దాంతో మలం గట్టిగా వచ్చి, మలబద్ధ్దకం అవుతుంది. త్రిఫల, అవిపత్తికర టాబ్లెట్లు, పత్యాది క్వత లాంటి మందులు ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. అయితే వీటిని ఆయుర్వేద వైద్యుని ర్యవేక్షణలో, సూచించిన మోతాదులోనే వాడాలి.  జీర్ణవ్యవస్థను సరిచేయడానికి మందులతో పాటుగా జీలకర్ర, ధనియాలు వంటివాటితో తయారుచేసిన కషాయాన్ని కూడా సూచిస్తారు. రాగి, జర్మన్‌ సిల్వర్‌ పాత్రల్లో ఉంచిన నీటిని రోజంతా తాగకూడదు. పొద్దున్నే ఒక గ్లాసు తీసుకుంటే చాలు. ప్రాణాయామం, యోగాసనాల వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతాయి. పొద్దున్నే లేచి, సూర్యనమస్కారాలు చేయడం మంచిది. వ్యాధి తగ్గాలంటే మందులు మాత్రమే సరిపోవు. ఆయుర్వేదం ఆహార, విహార, ఔషధాలన్నీ కలిపి చికిత్స చేస్తుంది. కాబట్టి మీ జీవనశైలి మీద శ్రద్ధ పెట్టడం కూడా తప్పనిసరి. 


logo