శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jul 13, 2020 , 23:27:11

కొవిడ్‌ కాలం..గుండె పదిలం!

కొవిడ్‌ కాలం..గుండె పదిలం!

మొన్నటికి మొన్న.. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు. కారణం.. సడెన్‌ కార్డియాక్‌ డెత్‌! అకస్మాత్తుగా గుండె ఆగిపోయింది. పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ అని కూడా తేలింది. కరోనా వల్ల ఎక్కడో ఒకచోట ఇలాంటి మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కరోనా వైరస్‌ గుండెపై ప్రభావం చూపించడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఊపిరితిత్తులే కాదు.. శరీరంలోని ఏ భాగాన్నీ వదలడం లేదు కరోనా. ఈ నేపథ్యంలో గుండెపై కొవిడ్‌ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరం. 

జలుబు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలుంటే చాలు.. కరోనా వచ్చిందేమో అని భయపడే రోజులివి. సాధారణంగా శ్వాస వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే, కరోనాను ఊపిరితిత్తులను దెబ్బతీసే వైరస్‌గా మాత్రమే భావిస్తూ వచ్చాం. నిజానికి ఇది దాడిచేయని అవయవం లేదు. ఊపిరితిత్తులే కాదు.. గుండె, లివర్‌, కిడ్నీ లాంటి కీలకమైన అవయవాలన్నీ దెబ్బతినవచ్చు. అయితే కరోనా శరీరంపై చూపే ప్రభావం రకరకాలుగా ఉంటుంది. 


కేవలం 18 నానో మైక్రాన్ల పరిమాణంలో ఉండే సార్స్‌ వైరస్‌ కరోనా. ఇది మొదట గొంతు, ముక్కులోని గాలి మార్గాల ద్వారా ప్రవేశించి, ఊపిరితిత్తుల్లోని యాంజియోటెన్సిన్‌ రీసెప్టార్‌ గుండా లోపలికి చేరుతుంది. తర్వాత రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. ప్రతి అవయవానికి ఎండోథీలియం లైనింగ్‌ ఉంటుంది. దీన్నే కణత్వచం లేదా కణకవచం అంటారు. వైరస్‌ దీనిలో తిష్టవేసి ఎండోథీలియలైటిస్‌కి మూలం అవుతుంది. అంటే, ఎండోథీలియంలో ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. అన్ని అవయవాల్లోని కణాలకూ ఉండే కణత్వచం ఇలాగే ప్రభావితం అవుతుంది. ఫలితంగా, సిస్టమిక్‌ ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తుంది. అయితే ముందుగా ఊపిరితిత్తులే ప్రభావితం అవుతాయి కాబట్టి, వాటికి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు సులువుగా సిస్టమిక్‌ దశకు చేరుకుంటారు. ఇది శరీరంలోని వివిధ వ్యవస్థలు కుప్పకూలేందుకు కారణం అవుతుంది. రోగిని వెంటిలేటర్‌ మీద ఉంచాల్సి వస్తుంది. అయితే అదృష్టవశాత్తు, 5 శాతం కంటే తక్కువ మందిలోనే.. ఇలా ప్రాణాపాయం ఉంటుంది.

ఏ భాగం ప్రభావితం? 

ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్‌, గుండె స్కాన్‌.. ద్వారా గుండె ఏ రకంగా ప్రభావితమైందో తెలుసుకోవచ్చు. ట్రోపొనిన్‌ బయోమార్కర్‌ పరీక్ష వల్ల మయోకార్డయిటిస్‌ ఉంటే బయటపడిపోతుంది. మయోకార్డియమ్‌ ప్రభావితమైతే ‘ట్రోపొనిన్‌' పెరుగుతుంది. ఇది మరీ ఎక్కువ పెరిగితే మాత్రం భయపడాల్సిందే. కొన్నిసార్లు ఏ లక్షణాలూ ఉండవు. కానీ సబ్‌క్లినికల్‌గా ట్రోపొనిన్‌ పెరుగుతుంది. దీన్ని సబ్‌క్లినికల్‌ మయోకార్డయిటిస్‌ అంటారు. ఈసీజీలో హృదయ స్పందనల సమస్యలు, గుండెలోని విద్యుత్‌ రసాయన వలయాలు, విద్యుత్‌ ప్రవాహ సమస్యల గురించి తెలిసిపోతుంది. రోగ లక్షణాలున్నవాళ్లకు ఈ టెస్టులు చేస్తారు. 

మనం.. అదృష్టవంతులమే!  

మన దగ్గర కొవిడ్‌కి ఇన్‌ఫెక్టివిటీ (ఇన్‌ఫెక్ట్‌ చేసే సామర్థ్యం) ఎక్కువగానే ఉంది. కానీ విరులెన్స్‌ (వ్యాధిని తీవ్రతరం చేసే సామర్థ్యం) అధికంగా లేదు. అందువల్ల కేసులు అధికంగా ఉంటాయి కానీ, ప్రమాదం తక్కువ. మన వ్యాధి నిరోధక వ్యవస్థే 80 శాతం నియంత్రిస్తుంది. ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవాళ్లు, పెద్దవాళ్లు, ఇతర జబ్బులున్నవాళ్ల పైనే దీని ప్రతాపం. ఇమ్యూనిటీ ఉన్న వాళ్లకు ప్రమాదం లేదు. అందులోనూ మన దేశంలో వచ్చిన వైరస్‌ న్యూయార్క్‌, ఇటలీలలో విజృంభించినంత ప్రమాదకారి కాదు. వైరస్‌ విరులెన్స్‌ తక్కువగా ఉండటం, మనదగ్గర యువత ఎక్కువగా ఉండటం కూడా.. ఇందుకు కారణం కావచ్చు. మనం చిన్నప్పటి నుంచీ మట్టిలో ఆడుకుంటాం కాబటి,్ట చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లకు ఎక్స్‌పోజ్‌ అయి వుంటాం. దీంతో, శరీరంలో సహజంగానే వ్యాధినిరోధకత ఎక్కువగా ఉంటుంది. 

ఆక్సిజన్‌ తీసుకెళ్లలేని ఆర్‌బీసీ

ఇటీవల బయటపడిన చేదు నిజం ఏమిటంటే, ఎర్ర రక్తకణాల ఆక్సిజన్‌ వాహక సామర్థ్యం తగ్గిపోతున్నది. ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ రక్తం ద్వారా శరీరంలోని అన్ని కణాలకూ ఆక్సిజన్‌ను అందిస్తుంది. కానీ కొవిడ్‌ ఆక్సిజన్‌ను పట్టుకెళ్లే ఆ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నది. దాంతో ఆక్సిజన్‌ శాచురేషన్‌ (ప్రాణవాయువు అందే స్థాయి) తగ్గుతున్నది. ఇలా హిమోగ్లోబిన్‌కు  ఆక్సిజన్‌ను మోసుకెళ్లే కెపాసిటీ తగ్గడాన్ని హాపీ హైపాక్సీ సిండ్రోమ్‌ అంటారు. ఆక్సిజన్‌ తగ్గడానికి ఊపిరితిత్తులు కారణం కాదు కాబట్టి, కొందరికి ఆక్సిజన్‌ పెట్టినా పరిస్థితి మెరుగుపడటం లేదు. సాధారణంగా ఆక్సిజన్‌ శాచురేషన్‌  90 కన్నా తక్కువ ఉంటే రోగికి ఆయాసం వస్తుంది. చురుగ్గా తిరుగలేరు. కానీ హ్యాపీ హైపాక్సియా ఉన్నవాళ్లు చక్కగానే ఉంటారు. అయితే, వాళ్ల ఆక్సిజన్‌ శాచురేషన్‌ 90 కన్నా తక్కువ ఉంటుంది. ఇది 80 కన్నా తక్కువకు పడిపోయినప్పుడు గుండె సరిగా పనిచేయదు. అకస్మాత్తుగా ఆగిపోతుంది. కొందరు, కొవిడ్‌ రోగుల హఠాన్మరణానికి ఇదే ప్రధాన కారణం. మరికొందరిలో ఊపిరితిత్తుల ఎండోథీలియం ఇన్‌ఫెక్ట్‌ అవుతుంది. దాంతో రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తి అంతటా వైరస్‌ విస్తరిస్తుంది. ఇలాంటప్పుడు, కొన్నిసార్లు లక్షణాలు ఉండవు కానీ, ఎక్స్‌రేలో ఊపిరితిత్తులు తెల్లగా కనిపిస్తాయి. చివరి దశ వరకు వీళ్ల ఊపిరితిత్తులు మేనేజ్‌ చేసుకుంటాయి. అవి పూర్తిగా దెబ్బతినేసరికి వెంటిలేటర్‌ మీద పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

గుండెపై ప్రభావం..

గుండె లోపలి కరొనరీ ధమనుల ఎండోథీలియం పొరకు.. వైరస్‌ వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. ఫలితంగా అక్కడ ‘క్లాట్స్‌' ఏర్పడి గుండెపోటు రావచ్చు. గుండె కండరం (మయోకార్డియమ్‌) ప్రభావితమైతే మయోకార్డయిటిస్‌కు దారితీస్తుంది. దీనివల్ల గుండె పంపింగ్‌ తగ్గి ఆయాసం వస్తుంది. గుండె కండరమే కాకుండా, దాని మీద ఉన్న పొర.. పెరికార్డియమ్‌ ప్రభావితం అయితే పెరికార్డియల్‌ ఎఫ్లూజన్‌ వస్తుంది. అంటే పెరికార్డియల్‌ స్పేస్‌లో ద్రవం పేరుకుంటుంది. ఇలాంటప్పుడు గుండె వ్యాకోచించలేదు కాబట్టి, గుండె పంపింగ్‌ తగ్గి, బీపీ తగ్గుతుంది. గుండెలోని విద్యుత్‌ రసాయన వ్యవస్థ సైనోవియల్‌ నోడ్‌, ఏట్రియోఫిబ్రియల్‌ నోడ్‌, గుండె 80 సార్లు కొట్టుకునే ప్రక్రియ.. ప్రభావితమై గుండె కొట్టుకోవడం తగ్గడం, పెరగడం, అసాధారణంగా బీపీ పెరగడం జరుగుతుంది. గుండె కండరం ప్రభావితమైనప్పుడు కూడా బీపీ అసాధారణంగా పెరుగుతుంది. దాంతో బీటింగ్‌ అబ్‌నార్మలిటీల వల్ల వీటీ వీఎఫ్‌ (వెంట్రిక్యులర్‌ టాకికార్డియా, ఫిబ్రిలేషన్‌) వచ్చి హఠాన్మరణం సంభవించవచ్చు. సార్స్‌.. అంటే సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌ వచ్చినప్పుడు శరీరంలో అన్ని భాగాలూ ప్రభావితం అవుతాయి. ఇలాంటప్పుడు పరోక్షంగా గుండె పనితీరు దెబ్బతింటుంది. మొత్తం గుండె పంపింగ్‌ తగ్గిపోతుంది. దీన్ని ‘కార్డియోజెనిక్‌ షాక్‌' అంటారు. సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ వల్ల సెప్సిస్‌కి దారితీస్తుంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల సెకండరీ బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా రావచ్చు. శరీరంలో బ్లీడింగ్‌-క్లాటింగ్‌ సిస్టమ్‌ దెబ్బతినవచ్చు.

చికిత్స.. ఎలా?

 కొవిడ్‌ వల్ల గుండె ప్రభావితం అయినప్పుడు ముందుగా బ్లడ్‌ థిన్నర్లను ఇస్తారు. వీటిలో చాలా మందులు ఉన్నాయి. అక్యూట్‌ హార్ట్‌ ఎటాక్‌కు ఆంజియోగ్రామ్‌ చేసి చూసి, అడ్డంకును తొలగిస్తారు. రక్తనాళాల్లో బ్లాక్‌ లేకపోతే సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. ఇప్పుడు రకరకాల మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ యాంటి వైరల్‌ డ్రగ్స్‌. వైరస్‌కి నిర్దుష్టమైన మందు లేదు. కాబట్టి, వేరే వైరస్‌ నియంత్రణకు తయారుచేసిన యాంటి వైరల్‌ డ్రగ్స్‌ అయిదు రోజులు ఇస్తున్నారు. వీటితో కొందరిలో కొంతమేర తగ్గుతున్నట్టు తెలిసింది. ఇంతకుముందు క్లోరోక్విన్‌ ఇచ్చేవాళ్లు. ఇన్‌ఫెక్ట్‌ అయినవాళ్లకు ఇది పనిచేయడం లేదు. కానీ పేషెంట్లకు దగ్గరగా ఉండేవాళ్లు, డాక్టర్లు, నర్సులు వేసుకుంటే మాత్రం రాకుండా ఉంటుంది. నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అయితే, ఇమ్యునో మాడ్యులేటర్లు ఇస్తారు. ఇవి అసాధారణ వ్యాధినిరోధక చర్యలు జరుగకుండా నియంత్రిస్తాయి. ఇప్పుడు ప్లాస్మా థెరపీ ద్వారా ఇచ్చే ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీలు కొవిడ్‌ను తగ్గిస్తాయని భావిస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా వ్యాధి నిరోధక శక్తిని పెంచే  ఆహారం తీసుకోవడమే ముఖ్యమైన చికిత్స.

 ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) గైడ్‌లైన్స్‌ ప్రకారం, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అందరూ వేసుకోకూడదు. దీన్ని ఇంతకుముందు మలేరియాకూ, కీళ్లనొప్పులకూ వాడేవాళ్లు. అయితే ఇది కణాల్లో ఆమ్లత్వాన్ని పెంచి, వైరస్‌ లోపలికి ప్రవేశించకుండా ఆపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఈ విధానమే పనిచేయదని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే.. పేషెంట్లకు దగ్గరగా ఉండేవాళ్లు, డాక్టర్లు, నర్సులు వేసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం తగ్గుతుంది. అయితే, డాక్టర్‌ సలహా లేకుండా దీన్ని వాడకూడదు. గుండె సమస్య ఉన్నవాళ్లు వాడితే గుండెలో విద్యుత్‌ రసాయన చర్యల్లో తేడాలు వస్తాయి. దీంతో ఎరిథిమియాస్‌ (హృదయ స్పందన సమస్యలు) చుట్టుముడుతున్నట్టు తెలిసింది. 

మందులు మానొద్దు

డయాబెటిస్‌ ఉన్నా, బీపీ ఉన్నా, స్టెంట్‌ వేసినా, బైపాస్‌ అయినా, గుండె పంపింగ్‌ తక్కువున్నా సంబంధిత మందులు మానకుండా వేసుకోవడం ముఖ్యం. లేకుంటే సమస్య జటిలం అవుతుంది. కొవిడ్‌ ఉన్నా లేకున్నా వీటిని మానకూడదు. కొందరు డాక్టర్‌కు చూపించడం వీలు కాలేదని ఆపేస్తారు. కానీ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్‌ టెలికాన్ఫరెన్సు ద్వారా డాక్టర్ల సలహాలను అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లు కూడా ఉన్నాయి. అదీ వీలుకాకపోతే పాత మందులు వాడుకోవాలి. అంతే గానీ, పూర్తిగా మానకూడదు. కొవిడ్‌ చికిత్స తీసుకుంటూనే ఈ మందులు కూడా కొనసాగించాలి.


డాక్టర్‌ శ్రీనివాస్‌ కుమార్‌

డైరెక్టర్‌,కార్డియాలజీ అండ్‌ క్లినికల్‌ రీసెర్చ్‌

అపోలో హాస్పిటల్స్‌,హైదరాబాద్‌


logo