ఆదివారం 09 ఆగస్టు 2020
Health - Jul 06, 2020 , 23:28:37

ఈ తలనొప్పి తగ్గేదెలా?

ఈ తలనొప్పి తగ్గేదెలా?

నా వయసు ఇరవై ఆరు. రెండేండ్లుగా తీవ్రమైన తలనొప్పితో సతమతం అయిపోతున్నా. పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నా.  ఇప్పటికి చాలామంది డాక్టర్లను సంప్రదించాను. మైగ్రేన్‌ లక్షణాలున్నట్టు అనుమానించి, మందులు ఇచ్చారు. కానీ వాటి వల్ల తాత్కాలిక ఉపశమనమే. ఒక్కోసారి తలనొప్పి వస్తే రెండు రోజులు వేధిస్తుంది. తగిన పరిష్కారం చెప్పండి.  

- నీలిమ,  హైదరాబాద్‌

మైగ్రేన్‌ను నిర్ధారించడానికి ప్రత్యేక పరీక్షలంటూ ఏమీ ఉండవు. కేవలం మీరు వివరించే లక్షణాలను బట్టి ఓ నిర్ణయానికి వస్తారు. మైగ్రేన్‌ తలలో ఒకవైపు మాత్రమే వస్తుంది. సాధారణంగా వస్తూ పోతూ ఉంటుంది. మెదడులో కణితి మూలంగా వచ్చే తలనొప్పి స్వభావమే అంత, వస్తూ తగ్గుతుంటుంది. కానీ పూర్తిగా తగ్గదు. పైగా నొప్పి తీవ్రత ఒకసారి కంటే మరోసారి బాగా పెరుగుతుంది. వాంతులు కూడా కావచ్చు. వాంతి అయిన తర్వాత నొప్పి కాస్త తగ్గినట్టు అనిపించి, మళ్లీ కొద్దిసేపటికే పెరిగిపోతుంది. కొంతమందిలో తలనొప్పి ఒకసారి వస్తే మళ్లీ మూడు నెలల పాటు రాకపోవచ్చు. కొందరికి తరచూ వచ్చే అవకాశం ఉంది. 

ఒక్కసారి మొదలైతే ఎన్ని గంటలపాటు నొప్పి ఉంటుందన్నదాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ప్రయాణం చేసినా, ఎండలో తిరిగినా, జలుబు చేసినా, నిద్ర లేకపోయినా, ఆహారం ఆలస్యంగా తీసుకున్నా, బాగా అలసిపోయినా మైగ్రేన్‌ అటాక్‌ అవుతుంది. అలాగే సైనసైటిస్‌ వల్ల కూడా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. మైగ్రేన్‌కు మందులతో పరిష్కారం ఉండదు. మీ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం అర్దగంట పాటు వ్యాయామం, యోగా చేయాలి. 


logo