శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Jul 06, 2020 , 23:28:37

బాడీ బిల్డింగ్‌ ఉత్పత్తుల్లో ఆరోగ్యమెంత?

బాడీ బిల్డింగ్‌ ఉత్పత్తుల్లో ఆరోగ్యమెంత?

సిక్స్‌ ప్యాక్‌లు, జీరోప్యాక్‌ల కోసమే కాదు.. ఆరోగ్యంగా ఉండాలన్నా శారీరక దృఢత్వం తప్పనిసరి. అయితే, కొంతమంది వ్యాయామాలు చేయడంతో పాటు హెల్త్‌ సప్లిమెంట్లు తీసుకుంటారు. ప్రత్యేకమైన డైట్‌ను పాటిస్తుంటారు. ఇది చాలదన్నట్టు, ఎవరేం చెప్పినా గుడ్డిగా అనుసరిస్తుంటారు. రాత్రికి రాత్రే ఫలితాలు రావాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో భాగంగానే బాడీ బిల్డింగ్‌ కోసం కొన్ని ప్రత్యేక ఉత్పత్తులు  వాడుతుంటారు. జిమ్‌లలో  శిక్షకులు ఎలాంటి అర్హతా లేకపోయినా, ఏవో సలహాలిస్తుంటారు. కొన్ని జిమ్‌లలో అయితే ఈతరహా ఉత్పత్తులు అమ్ముతుంటారు కూడా. ఆ తెలిసీతెలియని సలహాల వల్ల సమస్యలు వస్తాయి.

ఈ ఉత్పత్తులలో.. టెస్టోస్టిరాన్‌, ఇతర ఆండ్రోజెన్‌లు, అరోమాటిక్‌ ఇన్‌హిబిటర్లు, హెచ్‌సీజీ, ఫాస్ఫోడైస్టరేస్‌ ఇన్‌హిబిటర్లతో సహా అనేక పదార్థాలు వుండవచ్చు. ఇలాంటి కారకాల వల్ల ఆశించిన ప్రయోజనం కలుగకపోగా, శరీరానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజమైన టెస్టోస్టిరాన్‌ను అణచివేస్తాయి. పురుషుల్లో అసాధారణంగా రొమ్ములు పెరిగిపోయి గైనెకోమాస్టియా సమస్య ఉత్పన్నం అవుతుంది. గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు దారితీసే విధంగా హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. రక్తం గడ్డకడుతుంది. 

మంచి కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. దాంతో గుండె సమస్యలు రావచ్చు. ఈ ఉత్పత్తులను అధికంగా వాడితే యుక్తవయసు వచ్చినా శారీరక ఎదుగుదల ఉండదు. ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లకు లోనవుతుంటారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతుంది. పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది. మహిళల్లో పురుష లక్షణాలు కనిపిస్తాయి. లైంగిక జీవితంలో సమస్యలు వస్తాయి. మహిళల్లో మగ గొంతుక రావటం, జట్టు ఊడిపోవడం, ముఖంపై వెంట్రుకలు రావడం.. తదితర మార్పులు మొదలవుతాయి. నెలసరి సమస్యలు ఇబ్బందిపెడతాయి. అందులోనూ కొన్ని బాడీ బిల్డింగ్‌ ఉత్పత్తులు అధిక ప్రొటీన్‌ను కలిగి ఉంటాయి. అవి మూత్రపిండాలను శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి, వీటిని నిపుణులైన వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.


logo