సోమవారం 06 జూలై 2020
Health - Jun 30, 2020 , 01:52:32

మచ్చ..తొలగించుకోవచ్చు!

మచ్చ..తొలగించుకోవచ్చు!

చిన్న సమస్యే.. ఒక్కోసారి పెద్ద భూతంలా భయపెడుతుంది. అదేవిధంగా ఒక చిన్న మచ్చ.. ఆమెకు జీవన్మరణ సమస్య అయింది. చిన్నప్పటి నుంచీ అవమానాలకు సాక్ష్యంగా నిలిచింది. పెండ్లికి ఆటంకంగా మారింది. దాన్ని వదిలించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఫలించక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అయితే, పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. మానవ ప్రయత్నం ఉండాలంతే.  ఇప్పుడామె మచ్చ లేని చందమామలా మెరిసిపోతున్నది. బొల్లి లేదా విటిలిగో వ్యాధి నుంచి బయటపడిన ఒక అమ్మాయి కథ ఇది.

కాలేజీ నుంచి విసురుగా వచ్చి గదిలోకి వెళ్లిపోయింది వనజ. ‘ఏమిటే.. తొందరగా వచ్చేశావు. ఏమైనా తింటావా?’ తల్లి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. సీరియస్‌గా ఆలోచిస్తూ కూర్చుంది. ఒకటికి నాలుగుసార్లు తన మొహాన్ని అద్దంలో చూసుకుంది. పెదవుల పై భాగంలో, ముక్కు మీద తెల్లగా మచ్చలున్నాయి. వీటివల్లే కదా తను ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నది.. లేకుంటే ఆ బీకామ్‌ అమ్మాయి ఎందుకలా మాట్లాడుతుంది! స్కూల్‌ రోజుల నుంచీ ఇదే సమస్య. అందరూ గేలిచేసేవాళ్లే. బడికెళ్లాలంటే భయం కలిగేది. తరచూ డుమ్మా కొట్టేది. ఒక అమ్మాయి అయితే ‘తెల్లమూతి పిల్ల’ అంటూ పేరు కూడా పెట్టేసింది. అబ్బాయిలంతా అలా పిలుస్తూ ఎగతాళి చేసేవాళ్లు. కొన్నిసార్లు తెల్లమచ్చల చుట్టూ బొగ్గు పూసేసుకునేది. అది కాస్తా మీసంలా తయారయ్యేది.

మరింత ఏడిపించేవాళ్లు. ఇంటికొచ్చి దిగాలుగా కూర్చునేది. డిగ్రీకి వచ్చినా తన పరిస్థితిలో మార్పులేదు. ఏ ఫంక్షన్‌కి వెళ్లాలన్నా భయమే. ఎవరి పెండ్లికి హాజరవ్వాలన్నా బెరుకే. ఏ కాలు మీదో, చేతి మీదో అయితే డ్రెస్‌తో కవర్‌ చేసుకోవచ్చు. మొహాన్ని ఎలా కప్పుకుంటుంది? అందుకే, ఎక్కడా సంతోషంగా ఉండలేకపోతున్నది. లోలోపల ఎంతగానో కుమిలిపోతున్నది. ఆలోచనల మధ్య  తల్లి లోపలికి వచ్చిన విషయం కూడా గమనించలేదు. ‘ఏమైంది బిడ్డా..’ అంటూ దగ్గరికి తీసుకుందామె. దుఃఖం ఆగలేదు. ఏడ్చేసింది పసిపిల్లలా. కాలేజీలో అమ్మాయిలంతా తన తెల్లమచ్చల గురించి  ఎంత చులకనగా  మాట్లాడారో వెక్కిళ్ల మధ్యే చెప్పింది. ఇంతలో ఫోన్‌ మోగింది. ‘కాలేజీ నుంచి అమ్మాయి వచ్చిందా? సాయంత్రం తనని చూసుకోవడానికి వస్తున్నారు’ అవతలవైపు నుంచి  తండ్రి చెప్తున్నాడు. వాళ్లు వచ్చారు.. వెళ్లారు. 

పెండ్లి చూపులు..

‘అమ్మాయికి.. ఆ మచ్చలేమిటండీ..’ అడగనే అడిగారు అబ్బాయి తరఫు వాళ్లు.

‘.... ఏదో చిన్న సమస్య. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నది. పెండ్లి కల్లా తగ్గిపోతుంది..’  సర్దిచెపాడు తండ్రి.

‘బొల్లిలా ఉందే! ముందుగా చెప్పలేదే.. రేప్పొద్దున పిల్లలకు కూడా వస్తే ఎలా? అయినా, తగ్గుతుందని గ్యారెంటీ ఏమిటి..?’ మొహం మీదే అడిగారు.

ఇక అంతే.. కథ పెండ్లిచూపుల దగ్గరే ఆగిపోయింది.  పీజీ అయ్యేంతవరకు ఇంకో సంబంధం తీసుకురావద్దని కరాఖండిగా చెప్పేసింది వనజ. 

తను నైన్త్‌లో ఉన్నప్పుడు కావచ్చు.. ఒక నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లింది అమ్మ. అతనే, దాన్ని బొల్లి అంటారని చెప్పాడు.  పసర్లు, గోళీలు ఇచ్చాడు. కానీ ఏమాత్రం మార్పు లేదు. అమ్మానాన్నా పెద్దగా చదువుకోలేదు. అందుకే ఈ సమస్యకు వైద్యం ఏమిటన్నది వాళ్లకు అవగాహన లేదు. పైగా తను ఉండేది సిటీ కాదు. పెద్ద పల్లె లాంటి పట్టణం.  నగరంలో అయితే పెద్దపెద్ద డాక్టర్లు ఉంటారు. ఎక్కడో ఒకచోట పరిష్కారం దొరికేది. ఎవరేం చెప్పినా అది వాడేది అమ్మ. ఏ చిట్కాలు చెవినపడినా పాటించేది. నిమ్మకాయ వైద్యం చేసింది. పసుపు లేపనాలు పూసింది. అయినా లాభం లేదు. ఇంటర్‌కి వచ్చాక టీవీలో ప్రకటనలు చూసి చాలా రకాల క్రీములు, లోషన్లు తెప్పించింది. అవి కేవలం పబ్లిసిటీ స్టంట్‌లేనని అర్థమైంది. 

ఆరోజు వనజకు మంచిరోజు. పక్కింటి రామారావు కోడలు దివ్యమైన మాట చెప్పింది. బొల్లిని తగ్గించే చికిత్సలున్నాయని, దానికి సంబంధించిన డాక్టర్‌ తనకు తెలుసంటూ నా అడ్రస్‌ ఇచ్చింది. వెంటనే అపాయింట్‌మెంట్‌ తీసుకుంది వనజ. స్కిన్‌ గ్రాఫ్ట్‌ సర్జరీ ద్వారా వనజ తెల్లమచ్చలకు చికిత్స చేశాం. ఇప్పుడు వనజ ముఖంలో వెతికినా తెల్లమచ్చ కనిపించదు. ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నది. అదెలా చేశామంటే..

తెల్లమచ్చలు ఎందుకు?


విటిలిగో ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. మన శరీరంలోని సొంత కణాలే (యాంటీబాడీలు), నలుపు రంగు(మెలనిన్‌)ను ఉత్పత్తి చేసే మెలనోసైట్లపై దాడిచేసి నాశనం చేస్తాయి. మెలనోసైట్లపై ఈ దాడి జరిగిన చోట, కణాలు మెలనిన్‌ను ఉత్పత్తి చేయలేవు. ఫలితంగా ఆ భాగంగా తెల్లని మచ్చలా ఏర్పడుతుంది. ఈ తెల్లమచ్చలు తల నుంచి పాదం వరకు ఎక్కడైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అవకాశాలెక్కువ. ఇది అంటువ్యాధి కాదు. కొందరికి రబ్బర్‌, సిందూరం లాంటివి పడక అలర్జీ వచ్చి, తరువాత విటిలిగో రావచ్చు. విటిలిగో సమస్య ఉన్నవాళ్లకు దెబ్బ తగిలినా తెల్లమచ్చలు ఏర్పడతాయి. అయితే తెల్లమచ్చలు కనిపించగానే, విటిలిగోనే అన్న భయం అక్కర్లేదు. పోషకాహార లోపం, పొడి చర్మం ఉన్నా తెల్లమచ్చలు రావచ్చు. వుడ్‌ల్యాంప్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అవి బొల్లిమచ్చలా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవచ్చు. 

కొన్నిరకాల లోషన్లు వాడి వనజ సమస్యను కొంత కంట్రోల్‌లోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత అసలైన వైద్యం మొదలుపెట్టాం. తొడ భాగం నుంచి నలుపు రంగు ఉత్పత్తి చేసే మెలనోసైట్‌ కణాలను తీసుకొచ్చి తెల్లమచ్చలున్న భాగంలో అమర్చడం ద్వారా వనజ సమస్య తొలగిపోయింది. ఈ చికిత్సను స్కిన్‌ గ్రాఫ్ట్‌ సర్జరీ అంటారు. ఇందుకోసం ముందుగా ఆమె పెదవులు, వాటి చుట్టుపక్కల, ముక్కు మీద తెల్లమచ్చలున్న భాగంలో చర్మం పైపొరను తీసేస్తారు. ఆ తరువాత తొడ నుంచి చర్మకణాలను సేకరిస్తారు. ఈ చర్మం నుంచి కొన్ని లిక్విడ్స్‌ సహాయంతో మెలనోసైట్స్‌ని వేరుచేస్తారు. మెలనోసైట్‌ కణాలను పేస్టులా చేసి తెల్లమచ్చలపై ప్యాచ్‌ లాగా వేస్తారు. తరువాత కొల్లాజన్‌ డ్రెస్సింగ్‌ చేస్తారు. వారం తర్వాత డ్రెస్సింగ్‌ తీసేస్తారు. ఈలోగా మెలనోసైట్స్‌ చర్మం లోపలికి వెళ్లిపోయి నలుపు రంగు (మెలనిన్‌)ను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. క్రమంగా తెల్లమచ్చ ఏర్పడిన భాగమంతా సాధారణ చర్మరంగుకి వచ్చేస్తుంది. అక్కడ ఆపరేషన్‌ చేసిన ఆనవాలు కూడా ఉండదు. ఈ సర్జరీ ద్వారానే వనజ ముఖం మచ్చలేని చందమామలా మారింది.  

ఫొటోథెరపీ


చికిత్సలో కొందరికి ఫొటో థెరపీ అవసరం అవుతుంది. శరీరమంతటా పెద్దపెద్దగా తెల్లమచ్చలు ఉన్నప్పుడు అల్ట్రావయొలెట్‌ కిరణాలతో ఫొటోథెరపీ ఇస్తారు. దాంతో చర్మం నల్లగా అవుతుంది. తర్వాత ఇంకా తెల్లమచ్చలు ఎక్కడైనా మిగిలిపోతే, స్కిన్‌ గ్రాఫ్ట్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. సర్జరీ తర్వాత ఇమ్యునో మాడ్యులేటర్లనే మందులు వాడాల్సి ఉంటుంది. విటిలిగో మళ్లీ వస్తే ఇంకోసారి చికిత్స తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొంతవరకు సమస్య నివారణకు తోడ్పడుతాయి. 

దిగులు వద్దు

తెల్లమచ్చలు ఒకసారి వస్తే జీవితాంతం భరించాల్సిందే అన్న భయం వద్దు. ఇప్పుడు ఆధునికమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్కిన్‌ గ్రాఫ్ట్‌ సర్జరీ, ఫొటోథెరపీ చికిత్సల పట్ల అవగాహన పెంచుకుంటే, తెల్లమచ్చలు ఒక సమస్య కానేకాదు. ఆపరేషన్‌ ఆనవాలు కూడా లేకుండా సహజమైన చర్మంతో మెరిసిపోవచ్చు. ఆత్మన్యూనతను గెలవవచ్చు.


డాక్టర్‌ స్వప్నప్రియ

కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌

కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo