సోమవారం 06 జూలై 2020
Health - Jun 30, 2020 , 01:52:18

చావును గెలిచిన ధీర!

చావును గెలిచిన ధీర!

చేతిలో డబ్బు లేదు.. ఆసరాగా భర్త లేడు.. కడుపులో బిడ్డ బతికి ఉందో లేదో తెలియదు.. అక్కకు భారంగా మారానన్న బాధ.. ఇలాంటి అనేకానేక భావోద్వేగాలతో వచ్చిందామె. చావుతో తెగించి పోరాడింది. చికిత్స చేసిన డాక్టర్‌ కూడా గర్వంగా ఫీలయ్యేలా బతికి బయటపడింది. ఆమె కథ ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ కావ్య అనుభవంలో...

2019.. జూన్‌ నెల...

గడియారం ముల్లు చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది ఐసీయూ. బెడ్‌ మీద ఉన్న ఆ మహిళ వైపు జాలిగా చూశాను. డాక్టర్‌గా నా దృష్టిలో ప్రతిరోగీ సమానమే. కానీ, ఎందుకో ఆమె గురించి ఇంకాస్త ఎక్కువ ఆలోచిస్తున్నాను. కారణం.. ఆమె ఉన్న పరిస్థితి కావచ్చు. తనను బతికించడానికి డాక్టర్‌గా నా డ్యూటీని నిబద్ధతతో చేస్తూనే ఉన్నాను. ఐసీయూకి వచ్చి దాదాపు రెండు గంటలైంది. నాతోపాటు అనెస్తటిస్టులు, మిగిలిన వైద్య బృందం  ఆమెను మానిటర్‌ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆమె బీపీ లెవల్స్‌ పడిపోతున్నాయి. అప్పటివరకూ జరిగిన రక్తస్రావం వల్ల కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదంలోకి వెళ్లిపోయాయి. శరీరంలోని వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. అత్యవసర చికిత్సలు ఇస్తూ హార్ట్‌ బీట్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ వచ్చాం. 

అప్పుడు నేను నిలోఫర్‌లో ఉన్నాను. రోగికి 34 ఏండ్లు ఉంటాయి. నిండు గర్భంతో ఉంది. గర్భవతి అయిన మూడోనెలకే భర్త చనిపోయాడు. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు అయిపోయినట్టుగా నిర్లిప్తంగా ఉందామె. బతుకేమైపోతుందో అనే దిగులు కనిపించింది. ‘నేను చచ్చిపోయినా ఏంగాదు గానీ.. అటూ ఇటు గాకుండా ఇంకోళ్ల మీద ఆదారపడేటట్టు మాత్రం ఉండొద్దు మేడమ్‌..’ అంటున్న ఆమె ముఖంలో ఆందోళన, డిప్రెషన్‌ స్పష్టంగా కనిపించాయి. గర్భిణి కాబట్టి ముందు వ్జైనా ఎగ్జామినేషన్‌ చేశాను. రెండు నిమిషాల్లో ప్రసవం అవుతుందన్న పరిస్థితిలో ఉందామె. అయితే ఆమె ఆరోగ్యంగా లేదని చూడగానే అర్థమైంది. తెల్లగా పాలిపోయిన ముఖం హిమోగ్లోబిన్‌ చాలా తక్కువగా ఉందన్న సంకేతం ఇస్తున్నది. వెంటనే రక్తపరీక్షకు పంపించాను. ఆ రిజల్ట్స్‌ చూసి షాకయ్యాను.  హిమోగ్లోబిన్‌ కేవలం 1 గ్రా. శాతమే ఉంది. ఏమిటా అని తదుపరి పరీక్షలు చేస్తే ఆమె గర్భం నార్మల్‌గా లేదని అర్థమైంది. ఆమెకు  మాయ విడిపోయి తీవ్రమైన రక్తస్రావం అవుతున్నది. శరీరంలో రక్తస్రావం అయినప్పుడు రక్తంలోని ప్లేట్‌లెట్‌ కణాలు రక్తాన్ని గడ్డ కట్టించి, రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రక్రియ కోసమే ఆమె ప్లేట్‌లెట్‌ కణాలన్నీ ఖర్చయిపోయాయి. ప్లేట్‌లెట్లు 15 వేల కన్నా తక్కువ ఉన్నాయి. సాధారణంగా 2.5 లక్షలు ఉండాలి. 20వేల కన్నా తక్కువ ఉంటే అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆమెకు వెంటనే రక్తం ఎక్కించాం. కోవులేర్‌ యుటెరస్‌ విత్‌ డీఐసీ (డిస్సెమిలేటెడ్‌ ఇంట్రా వాస్కులర్‌ కోయాగ్యులేషన్‌) వల్ల ఆమె గర్భసంచి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. బిడ్డ, మాయ రెండూ బయటకు వచ్చిన తరువాత రక్తస్రావం కాకుండా కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఎన్ని రకాల పద్ధతులు ట్రై చేసినా రక్తస్రావం ఆగలేదు. ఐదు నిమిషాల్లో హిస్టరెక్టమీ ప్లాన్‌ చేశాం. గర్భసంచి తీసేసిన తరువాత డ్రెయిన్‌ పెట్టి, ఐసీయూకి షిఫ్ట్‌ చేశాం. 

ఆమె గ్రూపు రక్తం హాస్పిటల్‌లో లేకపోయేసరికి తలసేమియా బ్లడ్‌ బ్యాంకు నుంచి తెప్పించాం. మొత్తం 25 సార్లు రక్తం ఎక్కించాం. పరిస్థితి కుదుటపడింది. అయితే ఆమెకు కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం ఉండటంతో ఉస్మానియాకు పంపించాం.  అక్కడ వారానికి రెండుసార్లు డయాలసిస్‌ తీసుకుంటున్నది. మొత్తానికి వారంలోపల మృత్యువు దాకా వెళ్లి, బతికి బయటపడింది. 

నెల రోజుల తర్వాత చెకప్‌ కోసం వచ్చింది. ఆమె కండ్లలో వెలుగు.  అక్క మీద ఆధారపడకుండా నాలుగిండ్లలో పని చేసుకుని అయినా బతకగలనన్న ఆత్మవిశ్వాసం తొంగిచూసింది. మునుపటి దిగులు, ఆందోళనా లేవు. డాక్టర్‌గా నేను, నా కొలీగ్స్‌ సక్సెస్‌ అయ్యామని అనిపించింది.  

డాక్టర్‌ కావ్య

కన్సల్టెంట్‌ గైనకాలజిస్టు

కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo