మంగళవారం 14 జూలై 2020
Health - Jun 30, 2020 , 01:52:15

ఆ మందులు వాడితే సమస్యలు.. ఏం చేయాలి?

ఆ మందులు వాడితే సమస్యలు.. ఏం చేయాలి?

నా వయసు ఇరవైమూడు సంవత్సరాలు. నేనొక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ని. నాకు మూడు వారాల క్రితం ఎడమవైపు ఛాతిలో నొప్పి వచ్చింది. అదే సమయంలో 101 జ్వరం కూడా ఉంది. డాక్టర్‌ ఎక్స్‌రే తీసి ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌ అని నిర్ధారించారు. టీబీ అయి ఉండొచ్చని ఆరు నెలలు మందులు ఇచ్చారు. వాటిని వాడటం మొదలు పెట్టిన తరువాత వాంతులు, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. నా ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉంది. మీ సలహా ఇవ్వగలరు. 

- మురళి, వరంగల్‌

రెండు ఊపిరితిత్తుల చుట్టూ ఒక పొర ఉంటుంది. దాన్ని ఫ్లూరా అంటారు. ఆ పొరలో అనేక కారణాల వల్ల నీరు గానీ, చీము గానీ, రక్తం గానీ చేరవచ్చు. మన దేశంలో టీబీ సాధారణంగా ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు ఆ మందులు సూచించినట్టు ఉన్నారు. అయితే మీరు తెలిపిన వివరాల్లో గతంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారా, లేదా అనే విషయాన్ని వివరించలేదు. కానీ సూచించిన మందుల వల్ల మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మీరు వెంటనే ఆ మందులు ఆపేసి లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ చేయించుకోండి. అసలు ఊపిరితిత్తుల్లో నీరు చేరటానికి కారణం తెలుసుకొని, దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ నీరు చీముగా మారి గడ్డకట్టే అవకాశం కూడా ఉంది. అల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తీసి టెస్ట్‌లకు పంపించాలి. ఒకవేళ చీము కూడా చేరినట్టయితే ఊపిరితిత్తుల్లోకి చిన్న ట్యూబ్‌ని పంపించి తద్వారా దాన్ని పూర్తిగా తీసేయవచ్చు. మీరు మరింత ఆలస్యం చేస్తే అది ఆపరేషన్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

డాక్టర్‌ రఘునాథ్‌ రెడ్డి

పల్మనాలజిస్ట్‌, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo