గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jun 23, 2020 , 09:36:12

కీలు సగం మారిస్తే చాలు

కీలు సగం మారిస్తే చాలు

దాదాపుగా శరీర బరువునంతా  మోస్తాయి. మనల్ని నడిపించుకుంటూ తీసుకెళ్తాయి. అడుగు ముందుకు పడటంలోనూ కీలకం. కానీ వాటి ఆరోగ్యాన్ని మాత్రం  పట్టించుకోం. చివరికి వాటి స్థానంలో కృత్రిమమైనవి అమర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవేమిటో అర్థమైంది కదా.. మోకాలి కీళ్లు! నిన్న మొన్నటి వరకూ వయసు రీత్యా అరిగిపోయే మోకాలి జాయింట్లకు మొత్తం కీలును మార్చడమే పరిష్కారం. అయితే ఇప్పుడు, అరిగిపోయినంత మేర రీప్లేస్‌ చేయవచ్చు. అదే, యునీకాండిలియర్‌ రీప్లేస్‌మెంట్‌. దీన్నే పాక్షిక కీలుమార్పిడిగా వ్యవహరిస్తున్నారు. 

మోకాలిలో రెండు ఎముకలు ఉంటాయి. తొడ భాగంలో ఉండే ఫీమర్‌కూ, పిక్క భాగంలో ఉండే టిబియాకూ మధ్య ఉండే జాయింటే మోకాలి కీలు. ఈ రెండు ఎముకల మధ్యలో కార్టిలేజ్‌ అనే మృదువైన నిర్మాణం ఉంటుంది. ఇది షాక్‌ అబ్‌జార్బర్‌లా పనిచేస్తుంది. కీలులోని కార్టిలేజ్‌ వయసుతో పాటు నెమ్మదిగా అరగడం మొదలవుతుంది.  సాధారణంగా 50 ఏండ్ల తర్వాత ఈ అరిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొందరికి 60 ఏండ్ల తర్వాత కూడా అరగొచ్చు.  ముఖ్యంగా మహిళల్లో 45 ఏండ్లకే అరుగుదల మొదలు కావొచ్చు. 

కార్టిలేజ్‌ అరిగితే ...

కార్టిలేజ్‌ అరిగినప్పుడు రెండు ఎముకల మధ్య నిడివి తగ్గిపోతుంది. దీంతో ఒకదానినొకటి రుద్దుకుని నొప్పి వస్తుంది. ఇదే ఆస్టియో ఆర్థరైటిస్‌. ఇది నాలుగు దశల్లో వస్తుంది. మొదటి దశలో ఎముకల మధ్య నిడివి కొంచెమే తగ్గుతుంది. క్రమంగా దూరం ఇంకా తగ్గుతూ పోతుంది. నాలుగోదశకు వచ్చేసరికి రెండు ఎముకల మధ్య కార్టిలేజ్‌ పూర్తిగా అరిగిపోతుంది. మూడో దశ వరకు ఆపరేషన్‌ అవసరం లేదు. కార్టిలేజ్‌ పూర్తిగా అరిగిపోదు కాబట్టి, ఫిజియోథెరపీతో పాటు కొన్ని రకాల మందుల ద్వారా చికిత్స అందించవచ్చు. 

ఫిజియోథెరపీ వ్యాయామాల వల్ల కీలు చుట్టూ ఉన్న కండరాలు బలోపేతమవుతాయి. దాంతో కీలుమీద ఒత్తిడి ఎక్కువగా ఉండదు. ఫలితంగా కార్టిలేజ్‌ దెబ్బతినే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అయితే అప్పటివరకు అరిగిపోయిన కార్టిలేజ్‌ మాత్రం ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజుల వల్ల మళ్లీ రాదు. కేవలం అరుగుదల మాత్రం ఆలస్యం అవుతుంది. ఆర్థరైటిస్‌ తొలిదశల్లో ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకుంటే చివరిదశను వాయిదావేయవచ్చు.  


యునీ కాండిలియర్‌ రీప్లేస్‌మెంట్‌ 

కొన్నిసార్లు మోకాలి జాయింట్‌  మొత్తాన్నీ తీసేయాల్సిన అవసరం ఉండదు. అంటే కొందరిలో కార్టిలేజ్‌ ఒకవైపు మాత్రమే మొత్తం అరిగిపోతుంది. మరోవైపు అరగదు. అంటే సగం కార్టిలేజ్‌ బాగానే ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్స్‌రే తీస్తే ఒకవైపు రెండు ఎముకల మధ్య దూరం ఉంటుంది, మరోవైపు  ఎముకలు రెండూ కలుసుకుని ఉంటాయి. పాక్షికంగా మాత్రమే కార్టిలేజ్‌ అరిగిపోయిందన్నమాట. అందువల్ల కీలును కూడా పాక్షికంగానే మారుస్తారు. కార్టిలేజ్‌ ఎక్కడివరకు అరిగిపోయిందో, అక్కడ మాత్రమే మెటల్‌, ప్లాస్టిక్‌లతో జాయింట్‌ను రీప్లేస్‌ చేస్తారు. మిగిలిన సగంలో కీలు సహజమైందే ఉంటుంది. దీన్నే పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ లేదా యునీ కాండిలియర్‌ రీప్లేస్‌మెంట్‌ అంటారు. ఇది యూకేలో పదిహేనేండ్ల క్రితం ప్రారంభమైంది. కానీ పదేండ్ల నుంచీ పాపులర్‌ అయింది. మన దేశంలో గత రెండేండ్ల నుంచీ ఈ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. 

రోబోతో మరింత కచ్చితంగా...

మోకాలి కీలు మార్పిడి సర్జరీలోకి కూడా రోబో ప్రవేశించింది. 4జి రోబో టెక్నాలజీతో వంద శాతం కచ్చితత్వంతో సర్జరీ చేయవచ్చు. రోబోటిక్‌ సర్జరీ అంటే.. రోబో వచ్చి ఆపరేషన్‌ చేయదు. రోబో సహాయంతో సర్జన్‌ ఆపరేట్‌ చేస్తాడు. రోబో ద్వారా టోటల్‌, పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్లు.. రెండూ చేయొచ్చు. 

సర్జరీ తర్వాత...

అంతకుముందు నొప్పివల్ల నడవలేరు కాబట్టి మోకాలి చుట్టూ ఉన్న కండరాలు బలహీనంగా ఉంటాయి. కొత్త జాయింట్‌ వేసినప్పటికీ ఇవి అలాగే ఉంటాయి. కాబట్టి వీటికి బలాన్నివ్వాలంటే రోజూ గంట పాటు ఫిజియోథెరపిస్టు సాయంతో ఎక్సర్‌సైజ్‌ చేయాలి. వీటివల్ల కండరాలు బలోపేతమై నొప్పి త్వరగా తగ్గిపోతుంది. తొందరగా కోలుకుంటారు. కొత్తకీలు జీవిత కాలం కూడా పెరుగుతుంది. వీటిని నెల రోజుల తర్వాత సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు. ఆపరేషన్‌ తరవాత ప్లాస్టర్‌ రెండు వారాల వరకు తడవకూడదు. లేదంటే ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. సాధారణంగా కీలుమార్పిడి తర్వాత అన్ని పనులూ చేసుకోవచ్చు. కానీ కింద కూర్చోకూడదు. కూర్చుంటే కొత్త కీలు కూడా తొందరగా అరిగిపోతుంది. దాని జీవితకాలమూ తగ్గిపోతుంది. 

సందేహాలు సమాధానాలు

 • పార్షియల్‌ సర్జరీ తర్వాత టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ అవసరం అవుతుందేమో అన్న భయం ఉంటుంది. అయితే సగం జాయింట్‌ను మార్చిన తరువాత కొత్తదానిమీదే ఒత్తిడి ఎక్కువ పడుతుంది. కాబట్టి, మిగిలిన సగం అరిగే అవకాశం తక్కువ. 15 - 20 ఏండ్ల తర్వాత 2 శాతం మందిలో అరుదుగా మిగిలిన జాయింట్‌ కూడా అరిగిపోవచ్చు. కానీ తగిన జాగ్రత్తలు పాటిస్తే కాపాడుకోవచ్చు. 
 • కీళ్లనొప్పికి వాకింగ్‌ మందు. కీళ్లనొప్పులున్నప్పుడు జాయింట్‌కి వాకింగ్‌ ద్వారా పోషకాలు లభిస్తాయి. కీలులో ఉండే సైనోవియల్‌ ద్రవం, హైలురునిక్‌ యాసిడ్‌ వల్ల కీలు సులువుగా కదలగలుగుతుంది. వాకింగ్‌ వల్ల చుట్టుపక్కల కండరాలు బలంగా తయారై కీలుపై ఒత్తిడి తగ్గిస్తాయి. 
 • ఆపరేషన్‌ తరువాత పెరుగు, పప్పు లాంటివి తింటే చీము వస్తుందంటారు. కానీ ఇది అపోహే. నిజానికి ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువ తీసుకోవాలి. 
 • కీలు మార్పిడికి వయసు తేడా ఏమీ ఉండదు. 98 ఏండ్ల వయసులో కూడా సర్జరీ చేయవచ్చు. అయితే చిన్నపిల్లలకు జువెనైల్‌ ర్యుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉంటే కీలుమార్పిడి దానికి పరిష్కారం కాదు. 30 ఏండ్లు వచ్చేవరకు మందులు వాడి, ఆ తరువాత చేయవచ్చు. 
 • మెనోపాజ్‌కి కార్టిలేజ్‌ అరగడానికి సంబంధం లేదు. ఈస్ట్రోజన్‌ లేకపోవడం వల్ల ఎముకలు బలహీనమై ఆస్టియోపోరొసిస్‌ మాత్రమే వస్తుంది. కానీ ఆస్టియో ఆర్థరైటిస్‌కి మెనోపాజ్‌ కారణం కాదు. 
 • కార్టిలేజ్‌ పునరుత్పత్తికి స్టెమ్‌సెల్‌ థెరపీ పరిశోధన దశలోనే ఉంది. కార్టిలేజ్‌ రీజనరేషన్‌ ఇంకా విజయవంతం కాలేదు. 

ఆపరేషన్‌ ఎప్పుడు?

 • ఆస్టియో ఆర్థరైటిస్‌ నాలుగో దశకు చేరినప్పుడు, అంటే.. కార్టిలేజ్‌ పూర్తిగా అరిగిపోయినప్పుడు ఆపరేషన్‌ అవసరం అవుతుంది. ఇలాంటప్పుడు ఎక్స్‌రే తీస్తే రెండు ఎముకల మధ్య ఏమాత్రం నిడివి లేకుండా రెండూ ఒకదానికొకటి ఆనుకుని కనిపిస్తాయి. అరిగిపోయిన వాహనం టైరును తీసేసి కొత్త టైరు వేసినట్టుగానే, ఇలాంటప్పుడు కొత్త జాయింట్‌ వేయాల్సి వస్తుంది. అరిగిపోయిన మోకాలి కీలు స్థానంలో కృత్రిమమైన కొత్త జాయింట్‌ను అమర్చడాన్నే మోకాలి కీలు మార్పిడి (నీ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ) అంటారు. పై ఎముక 
 • (ఫీమర్‌)లో అరిగిన భాగం, కింది ఎముక (టిబియా)లో అరిగిన భాగాలను తీసేసి వాటి స్థానంలో లోహపు కీలును అమరుస్తారు. మధ్యలో కార్టిలేజ్‌ స్థానంలో ప్లాస్టిక్‌ ఉంటుంది. ఇలా కీలు మొత్తాన్నీ మార్చేస్తే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ అంటారు. 

ఇవీ...ప్రయోజనాలు

 • సగం కీలు మాత్రమే మారుస్తారు కాబట్టి, ఎముక సహజమైందే ఉంటుంది.
 • కోత చిన్నది కాబట్టి, గాయం త్వరగా మానుతుంది. 
 • టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ తరువాత కోలుకోవడానికి కనీసం ఒకటిన్నర నెలలు పడుతుంది. పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ అయితే నెల రోజుల్లో  నొప్పి తగ్గిపోతుంది. 
 • పార్షియల్‌లో పూర్తిగా కాళ్లు మడుచుకోవచ్చు. టోటల్‌ అయితే.. 90 డిగ్రీల వరకే కాళ్లు వంచవచ్చు. 
 • టోటల్‌ నీ సర్జరీ తర్వాత వాకర్‌ లేకుండా నడవాలంటే 4 నుంచి 6 వారాలు పడుతుంది. పార్షియల్‌ తర్వాత  2 వారాల్లోనే వాకర్‌ లేకుండా నడుస్తారు. 


డాక్టర్‌ ఆదర్శ్‌ అన్నపరెడ్డి

జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌

పార్షియల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ 

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo