శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 23, 2020 , 10:05:21

దేవుండ్లం కాదు!

దేవుండ్లం కాదు!

డాక్టర్‌ పి.ఎస్‌. మూర్తి..  మొదటి తరం పిల్లల వైద్యుడు. మొదట్లో దేవుడు, ఆచారాలు  ఒట్టి నమ్మకాలని  బలంగా నమ్మేవారాయన. కానీ తాను చదివిన వైద్యమే దేవుడిని అనుభవంలోకి తెచ్చింది.  కెరీర్‌ తొలి రోజుల్లో జరిగిన అద్భుతాలు పాత అభిప్రాయాలను  పూర్తిగా మార్చివేశాయి. అవన్నీ ఆయన మాటల్లోనే...

పాపాయిని ఐసీయూకి తీసుకొచ్చి అయిదు నిమిషాలైపోయింది.. గుండె కొట్టుకోవడం లేదు... శ్వాస ఆడటం లేదు.. బిడ్డలో ఉలుకూ పలుకూ లేదు. భారమైన హృదయంతో ఆ చంటిబిడ్డ చనిపోయినట్టు ధ్రువీకరించాం. మృతి చెందిన బిడ్డను శుభ్రం చేసి తల్లిదండ్రులకు అప్పగించాం. ప్రసూతి వాసన కూడా పోని ఆ తల్లి రోదనలు, వైద్యుడిగా నేను సిగ్గుపడేలా చేశాయి. ఆ బిడ్డ తండ్రి ఆటో మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. తల్లి చేతుల్లో ఉన్న బిడ్డ ఒక్కసారిగా కదిలింది. ఏడుపు మొదలుపెట్టింది. ఇది ఏ సినిమాలోని సన్నివేశమో కాదు. నా కళ్లముందు జరిగిన అద్భుతం. ఇది ఒక్కటే కాదు. ఇలాంటి అద్భుతాలు ఎన్నోసార్లు జరిగాయి. అప్పట్లో మూడు నిమిషాలపాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా, ఐదు నిమిషాల పాటు శ్వాస ఆగిపోయినా నవజాత శిశువు మరణించిందని ధ్రువీకరించేవారు. మృతి చెందిన ఆ బిడ్డను శుభ్రం చేసి తల్లిదండ్రులకు గాని, మార్చురీకి గాని అప్పగించేవారు. తల్లిదండ్రులు ఏ ఆటోనో మాట్లాడుకుని వచ్చేసరికో, ఇతర పనులు ముగించుకుని వచ్చేసరికో 15-20 నిమిషాలలోగా చనిపోయాడనుకున్న బిడ్డలో శ్వాస ఆడటం ప్రారంభమయ్యేది. ఇది భగవత్సంకల్పం కాక మరేంటి?.. అప్పటి నుంచి 15 నిమిషాలైనా వేచి చూడకుండా శిశువు మృతి చెందినట్టు ధ్రువీకరించకూడదని నిర్ణయించుకున్నాం. 

అర్ధరాత్రి.. ప్రశాంతంగా పడుకున్నాను. ఇంతలో ఫోన్‌ రింగయింది.  ఇంతరాత్రిపూట ఎవరా? అని ఫోన్‌ ఎత్తాను. డ్యూటీ డాక్టర్‌ నుంచి. అతను చెప్పింది విని స్థాణువునైపోయాను. ఆరోజు ఒక బాబుకు చికిత్స పూర్తయిపోయింది. ఒకరోజు వార్డులో ఉంచి రేపు డిశ్చార్జి చేస్తామని చెప్పి ఇంటికి వచ్చేశాను. కానీ, ఆ పసివాడు చనిపోయాడంటూ డ్యూటీ డాక్టర్‌ నుంచి ఫోన్‌.  బాబు చనిపోవడం వెనుక కారణం ఏమిటా అని ఆరా తీస్తే, పాలు తాగుతూ ఉన్నప్పుడు శ్వాస ఆగిపోయిందని తెలిసింది. సాధారణంగా పోత పాలు తాగించేటప్పుడు ఇలాంటి ప్రమాదం ఏర్పడుతుంది. పాలు సరైన భంగిమలో పట్టాలి. లేకుంటే శ్వాసమార్గానికి ఆటంకం కలిగిస్తాయి. ఆ పాలు గ్రసని నుంచి అన్నవాహికలోకి వెళ్లి జీర్ణమవుతాయి. కొన్నిసార్లు గ్రసనిలోకి వెళ్లకుండా లారింక్స్‌లోకి వెళ్లడంతో.. శ్వాసమార్గాల్లోకి చేరుతాయి. దాంతో గొంతు బ్లాక్‌ అయిపోయి, శ్వాస ఆగిపోతుంది. తల్లిపాలు తాగేటప్పుడు ఇలాంటివి జరగవు. అందుకే తల్లిపాలని మాత్రం ఏ సమయంలో అయినా, ఏ పొజిషన్‌లో అయినా ఇవ్వొచ్చు. పోతపాలతోనే సమస్య. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు వివరించి చెప్పాను. కానీ ఆరోగ్యవంతుడై క్షేమంగా ఇంటికి వెళ్తాడనుకున్న బాబు ఇలా విగతజీవిగా మారేసరికి డాక్టర్‌ననే అహంకారం నా నుంచి తొలగిపోయింది.

  • డాక్టర్‌ పి.ఎస్‌. మూర్తి,పిల్లల వైద్య నిపుణులు, హైదరాబాద్‌


logo