గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jun 22, 2020 , 01:49:55

ఆరోగ్యంగా ఉన్నా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ఎందుకు అవసరమంటే?

ఆరోగ్యంగా ఉన్నా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ఎందుకు అవసరమంటే?

క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయడం అంత సులువు. క్యాన్సర్‌ను గుర్తించడానికి ముందస్తుగా కనిపించే లక్షణాలు, స్క్రీనింగ్‌ పరీక్షలు ఉపయోగపడుతాయి. లక్షణాలు బయటపడకముందే స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తే వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఒక్కోసారి హెల్దీగా ఉన్నవారికి కూడా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ అవసరం. ఎందుకంటే కొందరిలో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా లోపల క్యాన్సర్‌ ఉండొచ్చు. అందుకే అందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు అవసరం. గడ్డలు, అసాధారణ రక్తస్రావం, చాలాకాలం పాటు అన్నం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ ముందస్తు లక్షణాల్లో కొన్ని. రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వారం, నోరు, పెద్దపేగు, చర్మ క్యాన్సర్ల వంటి వాటిల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. 

స్క్రీనింగ్‌

అన్ని విధాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా దాగి ఉన్న క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే సాధారణమైన, సులభమైన పరీక్షనే స్క్రీనింగ్‌ అంటారు. ముందు జాగ్రత్తతో ఈ పరీక్షలను చేయించుకోవడం వల్ల ఎంతో లాభమే తప్ప నష్టం ఉండదు. 

క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎవరికి?

పొగతాగే అలవాటున్నవాళ్లు, గుట్కా, పాన్‌మసాలా, జర్దా మొదలైనవి నమిలే అలవాటున్నవాళ్లు, మద్యానికి బానిసలైనవాళ్లు, సిర్రోసిస్‌ లాంటి కాలేయ వ్యాధులున్నవాళ్లు, వ్యాయామం చేయనివాళ్లు, ఊబకాయం ఉన్నవాళ్లు, ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవాళ్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకునేవాళ్లు, ఆహారంలో మసాలాలు ఎక్కువ తినేవాళ్లు. 

మహిళలకు స్క్రీనింగ్‌ పరీక్షలు

రొమ్ము క్యాన్సర్‌ : నలభై ఏళ్లు నిండిన మహిళలు ప్రతి ఏడాది డిజిటల్‌ మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది. 

20 నుంచి 30 ఏళ్లు నిండిన స్త్రీలు ప్రతి మూడేళ్లకు ఒకసారి వైద్యులను కలిసి రొమ్ము పరీక్షలు చేయించుకోవాలి. 

20 ఏళ్లు నిండిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా ఇంటివద్దనే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. రొమ్ముల్లో కణుతులు, గడ్డలు ఏమైనా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. 

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ : లైంగికంగా కలవడం మొదలుపెట్టిన మూడేళ్ల తర్వాత నుంచి ప్రతి మహిళా గర్భాశయ ముఖ ద్వారానికి స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలి. సాధారణ పీఏపీ పరీక్ష పద్ధతిలో ఏడాదికోసారి, అత్యాధునిక లిక్విడ్‌ బేస్డ్‌ పీఏపీ పద్ధతిలో అయితే రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకోవాలి. 30 ఏళ్లు పైబడిన ప్రతి మహిళా ప్రతి మూడేళ్లకోసారి పీఏపీతో పాటు హెచ్‌పీవీ డిఎన్‌ఎ పరీక్ష చేయించుకుంటే మంచిది. కానీ హెచ్‌ఐవి ఉన్నవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, కీమోథెరపీ తీసుకునేవారు, మత్తుపదార్థాలకు బానిసలైనవారు.. ఈ కారణాలతో తగినంత రోగనిరోధక శక్తి కోల్పోయినవారంతా ప్రతి ఏడాది పైన చెప్పిన పరీక్ష చేయించుకోవాలి. పదేళ్లు నిండిన ఆడపిల్లలకు 46 ఏళ్ల లోపు మహిళలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఇప్పించడం వల్ల 90 శాతం వరకు సర్వైకల్‌ క్యాన్సర్‌ని నివారించవచ్చు. 

వీళ్లకు పరీక్షలు అవసరం లేదు..

70 ఏళ్లు.. ఆ పైబడిన మహిళలతో పాటు గత పదేళ్లుగా పీఏపీ పరీక్షలో నార్మల్‌ ఫలితాలు వచ్చినవారు స్క్రీనింగ్‌ పరీక్షలు ఆపేయవచ్చు. హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయంతో పాటు గర్భాశయ ముఖద్వారాన్ని కూడా తొలగించినవారిలో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయించాల్సిన అవసరం లేదు. అయితే కేవలం గర్భాశయాన్ని మాత్రమే తొలగించి, ముఖద్వారాన్ని తొలగించని సందర్భాల్లో మాత్రం స్క్రీనింగ్‌ పరీక్షలను కొనసాగించాలి. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ 

పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఒకటి. పురుషులకు తప్పకుండా ప్రొస్టేట్‌ క్యాన్స ర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. 50 ఏళ్లు నిండిన పురుషులు ప్రతి ఏడాదీ ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ (పీఎస్‌ఏ) రక్తపరీక్ష, డిజిటల్‌ రెక్టల్‌ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా (నాన్న, సోదరుడు, కొడుకు) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టయితే కుటుంబంలోని మిగతా పురుషులు 40 ఏళ్ల వయసు నుంచే ప్రొస్టేట్‌ స్క్రీనింగ్‌ చేయించుకుంటూ ఉండాలి. 

డాక్టర్‌ మోహనవంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌: 9848011421

కర్నూల్‌: 08518-273001, గుంటూర్‌: 0863-2223300


logo