ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jun 16, 2020 , 00:18:29

అన్నీ సురక్షితం కాదు

అన్నీ సురక్షితం కాదు

చర్మ వైద్యంలో నిష్ణాతులు ఆయన. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆ ప్రతిష్ఠాత్మక వైద్య విద్యాసంస్థ అభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర  వైద్యవిద్యాశాఖ  తొలి డైరెక్టర్‌గా  గౌరవాన్నీ అందుకున్నారు. వృత్తిని ప్రాణంగా  భావించే డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌ డైరీలోని కొన్ని పేజీలు..

ఆ రోజు సాయంత్రం బిజీగా ఉన్నాను. ఓపీ చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు వచ్చిందామె.. భర్త చాటున ముఖం దాచుకుంటూ భయం భయంగా కన్సల్టేషన్‌ గదిలోకి. ఏదో పెద్ద సమస్యే అని అర్థమైంది. కూర్చోమని చెప్పాను. ‘ఏమైందమ్మా?’ అడిగాను మృదువుగా. ఆమె ముఖం గుమ్మడికాయలా వాచిపోయింది. ‘నేనేమీ చేయలేదు డాక్టర్‌.. ఎందుకిలా అయిందో నాకు తెలియదు..’ ఒకవైపు భయం, మరోవైపు బాధ. 

‘ఇలా ఎందుకు వాచింది..? ఏమైనా టాబ్లెట్స్‌ వేసుకున్నారా..?’ రెట్టించాను. ఎన్నిసార్లడిగినా తానేమీ చేయలేదనే చెప్పింది. అప్పుడు ఆమె భర్త కల్పించుకున్నాడు. ‘అప్పుడేదో పెట్టావ్‌ కదా.. అదేంటో చెప్పు..’ అన్నాడు. ‘దానివల్ల ఏమీ కాదు. అది నాచురల్‌ది. అపాయం ఉండదు కాబట్టే పెట్టాను..’ అందామె. మొత్తానికి అసలు విషయం బయటపెట్టింది. విని షాకయ్యాను. ఆమెకు ముఖం మీద నల్లమచ్చలు ఉన్నాయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్‌లో చెప్పారని, మచ్చలు పోవడం కోసం ఆవుపేడ పెట్టిందట. దానివల్ల వచ్చిన రియాక్షన్‌ ఇది. ఆమె చదువుకోని మనిషేమీ కాదు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ చేసింది. చాలా కోప్పడ్డాను. ‘సహజసిద్ధమైన మూలికలతో తయారైనవి. రసాయనాలు లేవు. ఏ దుష్ప్రభావాలూ లేకుండా మృదువైన చర్మం మీ సొంతం’ తదితర ప్రకటనల్ని గుప్పిస్తుంటారు. జనం కూడా గుడ్డిగా  వాడేస్తుంటారు. ఇది కరెక్ట్‌ కాదు. ఎవరికి దేనితో దుష్ప్రభావం కలుగుతుందో చెప్పలేం. సొంత  చికిత్సలకు ప్రయత్నించకూడదు. 

***

ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకుని ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య  వచ్చారు. దగ్గర్లోనే తన పెండ్లి.  పండ్లు అయితే నాచురల్‌ కదా అని, ఫ్రూట్‌ ఫేషియల్‌ చేయించుకుంది. తెల్లవారేసరికి ముఖం మొత్తం మారిపోయింది. ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నా, నార్మల్‌ కావడానికి సమయం పడుతుంది. అందుకే ఒక మూడు నెలల పాటు పెండ్లి వాయిదా వేద్దామని అనుకున్నారట. ఇదే విషయం అబ్బాయి తరపు వాళ్లకు చెబితే, ఏదో దాస్తున్నారన్న అనుమానం వచ్చి, పెండ్లే క్యాన్సిల్‌ అన్నారు. దాంతో అమ్మాయి తండ్రి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆ కథంతా విన్నాక, బాధగా అనిపించింది. అబ్బాయి తండ్రిని పిలిపించి మాట్లాడాను. మూడు నెలల్లో అమ్మాయికి బాగు చేస్తాను. అంతవరకూ పెండ్లి వాయిదా వేయమని నచ్చజెప్పాను. ‘బాగవుతుందని గ్యారెంటీ ఏమిటి?’ అన్నాడతను పరుషంగా.

నాకు కొంచెం కోపం వచ్చింది. ‘మన జీవితంలో దేనికైనా గ్యారెంటీ ఉందా? నా లైఫ్‌కి గ్యారెంటీ ఉందా? ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏదైనా అంతే. మనం ప్రయత్నం చేస్తాం. అమ్మాయికి బాగయ్యే అవకాశం 90 శాతం ఉంది. ఇది తగ్గడానికి మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. అందుకే ఒక మూడు నెలల పాటు పెండ్లి వాయిదా వేసుకుంటే మంచిది’ అని చెప్పాను. ఆ అమ్మాయి కుటుంబం అదృష్టం బావుంది కాబట్టి, చివరికి పెళ్లి అయింది. పరువు నిలబడింది.  విశ్వసనీయతలేని సౌందర్య సాధనాల్ని వాడటం, అర్హతలేని బ్యుటీషియన్ల దగ్గరికి వెళ్లడం.. ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే. అందం కోసం ఆరాటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, అందం కంటే ఆరోగ్యం ముఖ్యం, ప్రాణం ఇంకా ముఖ్యం.  దీన్ని మరువకూడదు.logo