మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jun 16, 2020 , 00:18:28

పండ్లు తింటే బరువు పెరుగుతారా?

పండ్లు తింటే బరువు పెరుగుతారా?

కొన్ని రకాల పండ్లు, కూరగాయల వల్ల బరువు పెరుగుతారన్నది అబద్ధం. మామిడి, అరటి, కీరా దోస, ఆకుకూరల వల్ల బరువు పెరుగుతారనే అపోహ కొంతమందిలో ఉంది. ఎందుకంటే? 

మామిడి, అరటి పండ్ల వల్ల బరువు పెరుగుతారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఈ పండ్లు పోషకాలకు పవర్‌ హౌజ్‌ లాంటివి. బరువుకు కారణం కానేకావు. 200 నుంచి 250 గ్రాముల మామిడి పండు ద్వారా.. 150 నుంచి 175 కిలోకేలరీలు వస్తాయి. ఇది చిన్న కేకు ముక్క కంటే తక్కువ. కేకు ముక్క ద్వారా 350 కేలరీలు, ఒక ప్లేట్‌ పానీపూరీ ద్వారా 400 కేలరీలు వస్తాయి. పానీపూరీ తేలిక పదార్థం కదా అనుకుంటారు. కానీ ఒక చిన్న పూరీ గ్రహించే నూనె ఎంతన్నది గమనిస్తే.. ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదంటున్నారు నిపుణులు. అలాంటి ఆహారాలతో పోలిస్తే ఈ రెండు పండ్ల్ల్లూ మంచి పోషకాహారమని అంటున్నారు. 

మామిడి, అరటి.. రెండింట్లోనూ  పీచు పదార్థం ఎక్కువ. మామిడిలో విటమిన్‌-ఎ, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి కూడా అధికమే. మామిడి పండ్లలో చక్కెర మోతాదు ఎక్కువ కాబటి,్ట డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తినకూడదని అంటారు. కానీ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటే చిన్న సైజు మామిడి ముక్కలు తినొచ్చు. తొక్కతో పాటు తింటే ఇంకా మంచిది. ఫైబర్‌ ఎక్కువగా దొరుకుతుంది. అరటి పండు కూడా తేలికైన ఆహారమే. దీనిలో కూడా పోషకాలు పుష్కలం. విటమిన్‌ బి6, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బరువు పెరుగుతామేమో అనే అపోహతో వీటిలో ఉండే పోషకాలకు దూరం కాకూడదు. అయితే ఏ పదార్థమైనా మితిమీరి తీసుకుంటే చివరికి కొవ్వుగా నిల్వ అవుతుంది. కాబట్టి ఈ పండ్ల్లే కాదు .. ఏదైనా మితంగానే తీసుకోవాలి. 

కీరా దోసకాయలు, ఆకుకూరలు తింటే కూడా బరువు పెరుగుతామని కొంతమంది భయపడతారు. నిజానికి వీటిలో నీటి శాతం, పీచు పదార్థాలు రెండూ అధికమే. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కడుపు తొందరగా నిండినట్టు ఉంటుంది. ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోకుండా నివారించవచ్చు. అందుకే, బరువు పెంచేందుకు కాదు.. తగ్గించుకోడానికి తోడ్పడతాయి. కాబట్టి, శాస్త్రీయమైన విషయాలనే మనం నమ్మాలి. logo