మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jun 14, 2020 , 00:08:46

వీర్యంలో రక్తం ఎందుకు?

వీర్యంలో రక్తం ఎందుకు?

నా భర్తకు 42 సంవత్సరాలు. వీర్యం ఎర్రగా వస్తున్నది. అంటే, రక్తం పోతున్నదా? ఎందుకిలా అవుతున్నది? చికిత్స ఏమిటి?

- ఎస్‌.బి., వరంగల్‌

వీర్యంలో రక్తం పోవడాన్ని హెమటోస్పెర్మియా అంటారు. 40 ఏళ్ల లోపు వారికి చాలాసార్లు చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. 40 ఏళ్లు దాటినవారికి మాత్రం కచ్చితంగా చికిత్స అవసరం. చాలాసార్లు వీర్యంలో, మూత్రవిసర్జనలో రక్తం కనిపించడం ఓ ప్రమాద సంకేతం. కుటుంబంలో క్యాన్సర్‌, రక్తస్రావ చరిత్ర ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. దీనికి కారణాలు అనేకం. ప్రొస్టేట్‌ గ్రంథిలో ట్యూమర్లు, వృషణాలలో, మూత్రాశయం, మూత్రనాళంలో క్యాన్సర్‌ గడ్డలు, హెచ్‌ఐవీ, లివర్‌ వ్యాధులు, ల్యుకేమియా లాంటి జబ్బులు ఉంటే కూడా వీర్యంలో రక్తం పోతుంది. మూత్రం పూర్తిగా విసర్జించలేకపోవడం, మూత్రాశయం ఎప్పుడూ నిండినట్లుగా ఉండటం, నొప్పితో కూడిన వీర్యస్ఖలనం, లైంగికావయవాల్లో నొప్పి, వాపు; క్లమిడియా, హెర్పిస్‌, ససైటోమెగాలో వైరస్‌, గొనోరియా లాంటి సుఖవ్యాధులు ఉన్నపుడు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు యూరాలజిస్ట్‌ని కలవాలి. రెక్టల్‌, స్క్రోటల్‌ పరీక్షలు, రక్తపరీక్షలు, సెమన్‌ కల్చర్‌, అనాలిసిస్‌, మూత్రం, రక్తంలో క్యాన్సర్‌ కణాలను తెలిపే పరీక్షలు, యూరిన్‌ అనాలిసిస్‌, ఎక్స్‌రే, యుఎస్‌జి, కిడ్నీ, బ్లాడర్‌, ప్రొస్టేట్‌, వృషణాల సిటి స్కాన్‌, ప్రొస్టేట్‌ బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. కారణం తెలిసిన తరువాత అవసరాన్ని బట్టి మందులు సరిపోతాయా, సర్జరీ చేయాలా అన్నది  నిర్ణయిస్తారు. అప్పటిదాకా లైంగిక కలయికకు దూరంగా ఉండండి. 


logo