ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Jun 12, 2020 , 10:22:36

త్రిఫల చూర్ణాన్ని సొంతంగా వాడొచ్చా?

త్రిఫల చూర్ణాన్ని సొంతంగా వాడొచ్చా?

త్రిఫల చూర్ణం గురించి  విన్నాను.  త్రిఫల అంటే ఏమిటి? దీన్ని ఎందుకు వాడతారు? జీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుందంటున్నారు. నిజమేనా? - సుధీర్‌, హైదరాబాద్‌

త్రిఫల అద్భుతమైన ఔషధం. ఆయుర్వేదంలో దీన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. త్రి-ఫల.. అంటే మూడు రకాల ద్రవ్యాలతో తయారైందని అర్థం. మూడు ఫలాలను సమభాగాలుగా తీసుకుని చేసే చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు.  ఇది త్రిదోషాలను హరిస్తుంది. వాత, పిత్త, కఫాలతో ముడిపడిన రోగాలను పోగొడుతుంది. ఇది నిత్య రసాయనంగా కూడా చెప్పబడింది. రసాయనం అంటే వ్యాధినిరోధక శక్తిని పెంచేది. ఆ ప్రయత్నంలో దీన్ని రోజూ వాడుకోవచ్చన్నమాట. కరక్కాయకు ఇంకోపేరు అభయ. అంటే అన్ని వ్యాధుల నుంచీ విముక్తికి అభయాన్నిచ్చేది.  ఉసిరికాయలో విటమిన్‌-సి అధికం. ఇమ్యూనిటీని, జీర్ణశక్తిని పెంచే గుణాలన్నీ ఉసిరికాయలో ఉన్నాయి. కరక్కాయ, తానికాయ కషాయ రస ప్రధానమైనవి. ఉసిరి ఆమ్లరస ప్రధానమైంది. జీర్ణవ్యవస్థలోని అన్ని రకాల సమస్యలపై దీని ప్రభావం ఉంటుంది. సకల వ్యాధులనూ నిర్మూలించగలదు. నోట్లో పొక్కులు (అల్సర్లు), అజీర్తి, మలబద్ధ్దకం, అసిడిటీలకు త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్‌ సమస్యలకు ఇది విరుగుడు. త్రిఫల జీర్ణశక్తిని అభివృద్ధి చేయడమే కాకుండా వాతాన్ని కిందికి వెళ్లేటట్టు చేస్తుంది. అందువల్ల పేగుల కదలికలు బాగుంటాయి. నేత్ర సంబంధ సమస్యలకు కూడా త్రిఫల మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే, ఏ సమస్యలో, ఎంత మోతాదులో, ఏ రకంగా వాడాలనే విషయంలో డాక్టర్‌ సూచనలనే పాటించాలి. అలాకాకుండా సొంతంగా, ఇష్టం వచ్చిన మోతాదులో వాడితే దుష్ఫలితాలుంటాయి. దాంతో, ఆయుర్వేదం వల్లనే సైడ్‌ ఎఫెక్టులు వస్తున్నాయని పొరబడుతుంటారు. అందుకే సొంతంగా వాడకపోవడమే మంచిది.  

డాక్టర్‌ సారంగపాణి

సాయి భరద్వాజ అడ్వాన్స్‌డ్‌ ఆయుర్వేద హాస్పిటల్‌

మోతీనగర్‌, హైదరాబాద్‌


logo