శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jun 10, 2020 , 02:04:01

కాళ్ల వాపులకు కారణమేమిటి?

 కాళ్ల వాపులకు కారణమేమిటి?

నా వయసు నలభై. గతంలో కాళ్లలో వాపులు వచ్చేవి. కానీ తగ్గాయి. మళ్లీ ఇప్పుడు వస్తున్నాయి. కష్టంగా ఉంది. ఉదయం  లేచేసరికి ముఖం కూడా ఉబ్బుతున్నది. మళ్లీ కాసేపటికి తగ్గిపోతుంది. కానీ కాళ్ల వాపు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. ఎందుకిలా అవుతున్నది?                            -మాధవి, హైదరాబాద్‌

సాధారణంగా కిడ్నీ సమస్య ఉంటే కాళ్లవాపు వస్తుంది. ఉదయం లేవగానే ముఖం ఉబ్బిపోతుంది. కాళ్ల వాపులకు ఇతర కారణాలూ ఉంటాయి. కాలేయంలో ఇబ్బందులున్నా రక్తంలో ప్రొటీన్లు తక్కువైపోయి వాపు రావొచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పడిపోయి, తీవ్రమైన రక్తహీనత ఏర్పడినప్పుడు సైతం కాళ్ల వాపులు వస్తాయి. గుండె జబ్బుల వల్లా ఇలాంటి సమస్య రావొచ్చు. కాళ్లలో ఉండే రక్తనాళాలలో (సిరలు) సమస్యలున్నప్పుడు.. అంటే వీనస్‌ ఇన్‌సఫీషియన్సీ లేదా వేరికోస్‌ వీన్స్‌ ఉన్నా  కాళ్లు ఉబ్బిపోతాయి. థైరాయిడ్‌ సమస్యలూ కాళ్లవాపులకు కారణం అవుతాయి. కొన్ని రకాల టాబ్లెట్లు, అంటే.. స్టిరాయిడ్లు, పెయిన్‌ కిల్లర్లు, బీపీ మందులు, యాంటీ సైకాటిక్‌ మందుల (మానసిక రుగ్మతలకు వాడే టాబ్లెట్లు) వల్ల కూడా కాళ్లవాపులు వస్తాయి. పోషకాహార లోపం ఉన్నా వాపులు ఇబ్బంది పెడతాయి. ఇది సాధారణంగా పిల్లల్లో కనిపిస్తుంది. మీ విషయంలో రక్తహీనత ప్రధాన కారణం కావొచ్చు. కిడ్నీ సమస్య ఉన్నా ఉండవచ్చు. కాళ్లతో పాటు ముఖం కూడా ఉబ్బుతుంది కాబట్టి, మూత్రంలో ప్రొటీన్లు పోవడం వల్ల ఇలా జరగవచ్చు. విటమిన్‌-బి12 లోపాన్నీ కాదనలేం. రక్తహీనత ఉందేమో పరీక్ష చేయించుకోండి.  దగ్గరలోని జనరల్‌ ఫిజీషియన్‌ని కలిస్తే సమస్యను నిర్ధారించి తగిన స్పెషలిస్టును సూచిస్తారు. 

డాక్టర్‌ ,ఎం.వి. రావు, సీనియర్‌ 

జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo