శనివారం 11 జూలై 2020
Health - Jun 04, 2020 , 17:45:57

ఇలా చేస్తే రోజంతా... హ్యాపీ గా ఉండొచ్చు...

ఇలా చేస్తే రోజంతా... హ్యాపీ గా ఉండొచ్చు...

 ఉదయం నిద్ర లేవగానే కొందరు హడావిడిగా పనుల్లో దిగిపోతుంటారు. ఇది సరైన అలవాటు కాదు. నిద్రలేవగానే కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరంలో కండరాలు పట్టేసినట్టుంటాయి. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా శరీరాన్ని మెల్లగా అటు ఇటు కదపాలి. అలాగే నిద్ర లేవగానే కుడివైపు నుంచి మంచం దిగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని భాగాలన్నింటికీ ఎనర్జీ సమంగా అందుతుంది. గట్టిగా ఊపిరి తీసుకుని వదలాలి. కొంచెం గోరువెచ్చని నీటిని తాగాలి. జీర్ణక్రియ బాగా అవడం కోసం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ ఇవి అంట శ్రేయస్కారం కాదు‌. అందుకే వీటికి బదులు నిమ్మకాయరసం, మంచినీళ్లు తాగాలి. తర్వాత గ్రీన్‌ టీ తాగాలి. నిద్రలేచిన వెంటనే కొందరు ఫోను, మెయిల్స్‌ చెక్‌ చేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు.నిద్రలేచిన వెంటనే ఎంతో ఫ్రెష్‌గా ఉంటాం. ఆ ఎనర్జీని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తే మంచిది. అందుకే ఆఫీసుకెళ్లిన తర్వాతే మెయిల్స్‌ను చెక్‌ చేసుకోవడం ఉత్తమం. పొద్దున్నే మెయిల్స్‌ని చెక్‌ చేసుకున్నారనుకోండి, దాంట్లో ఏదైనా నచ్చని విషయం ఉంటే డిస్టర్బ్‌ అవుతారు. దీంతో  ఉదయం నుంచి మొదలైన నెగిటివ్ ఫీలింగ్ రాత్రి పడుకునేంత వరకు ఉంటుంది. కాబట్టి  నిద్రలేచిన వెంటనే 20 నిమిషాల పాటు వ్యాయామం, 20 నిమిషాలు పుస్తక పఠనం, మరో 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మంచిది.

కొందరు పిల్లలు, పెద్దవాళ్లు కూడా పొద్దున బేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఆఫీసు, స్కూళ్లకు వెళ్లిపోతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అంతేకాదు బ్రేక్‌ఫాస్టును తినకపోవడానికి ఊబకాయం, మధుమేహం, రోగనిరోధకశక్తికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని కూడా పలు స్టడీల్లో వెల్లడైంది. బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోవడం వల్ల శరీరంపై అదనపు శ్రమ పడుతుంది. కాబట్టి ఉదయం తప్పనిసరిగా ఎంతో కొంత బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. పైగా ఉదయం పూట శరీరంలో బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలు కూడా చాలాతక్కువగా ఉంటాయి. డిన్నర్‌కు, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య చాలా గంటలు తేడా ఉండడం ఇందుకు కారణం. నిద్రలేచిన అరగంటకి తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి. నిద్రలేచిన వెంటనే చక్కెర వేసిన టీ తాగడానికి బదులు నానబెట్టిన బాదంపప్పులు, హౌల్‌వీట్‌ బ్రెడ్‌, రోటీలు లేదా పండ్లు తినడం మంచిది.


logo