శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - May 24, 2020 , 23:18:08

మూత్రంలో ఇబ్బందా? ప్రొస్టేట్‌ పరీక్ష అవసరం!

మూత్రంలో ఇబ్బందా? ప్రొస్టేట్‌ పరీక్ష అవసరం!

ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ పురుషుల్లో మాత్రమే కనిపించే అతి సాధారణ క్యాన్సర్‌. ఈ గ్రంథి వాల్‌నట్‌ ఆకారంలో ఉంటుంది. వీర్యంలో ఉండే ద్రవపదార్థాన్ని ఇది తయారుచేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవం తోడ్పడుతుంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మొదటి దశలో ఇది ప్రొస్టేట్‌ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ పరిస్థితిలో చికిత్స పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. అయితే కొన్ని రకాల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లు వేగంగా వ్యాపిస్తాయి. క్యాన్సర్‌ గ్రంథికి మాత్రమే పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. 

లక్షణాలు: ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ మొదటి దశలో ఎలాంటి లక్షణాలూ బయటపడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తి కడుపులో ఇబ్బందిగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కారణాలు: ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కి కచ్చితమైన కారణాలు తెలియదు. వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉండటం, స్థూలకాయం వంటివి క్యాన్సర్‌కు కారకాలు. ఈ క్యాన్సర్‌ ఇతర భాగాలకు వ్యాపిస్తే అంగస్తంభన లాంటి సమస్యలు రావొచ్చు. యాభై ఏళ్లు నిండిన పురుషులు క్రమం తప్పకుండా ప్రొస్టేట్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలని అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి. 

పరీక్షలు: డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామ్‌ (డీఆర్‌ఈ), ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజెన్‌ (పీఎస్‌ఏ) పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షల్లో రిపోర్ట్‌ అబ్‌నార్మల్‌గా వస్తే అల్ట్రాసౌండ్‌, బయాప్సీ చేయించుకోవాలి. బయాప్సీలో పాజిటివ్‌ వస్తే గ్రేడింగ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇందుకోసం క్యాన్సర్‌ కణాలను, ఆరోగ్యంగా ఉన్న ప్రొస్టేట్‌ కణాలతో పోల్చి చూస్తారు. అవి ఎంత ఎక్కువ భిన్నంగా, ఎక్కువగా ఉంటే వ్యాధి అంత తీవ్రంగా ఉందని అర్థం. వ్యాధి తీవ్రత కొలమానాన్ని గ్లీసన్‌ స్కోర్‌ అంటారు. ఈ స్కోరు 2 నుంచి 10 వరకు ఉంటుంది. 2 ఉంటే తీవ్రత తక్కువగా ఉన్నట్లు, అదే 10 ఉంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. క్యాన్సర్‌ ప్రొస్టేట్‌ గ్రంథిని దాటి ఇతర అవయవాలకు వ్యాపించిందనే అనుమానం వస్తే ఎముకల స్కానింగ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. 

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ దశలు

స్టేజ్‌ 1 : మొదటి దశలో ఉందంటే క్యాన్సర్‌ ప్రాథమిక దశలో, మైక్రోస్కోప్‌తో చూడగలిగే పరిమాణంలోనే ఉందని అర్థం. 

స్టేజ్‌ 2 : ఈ దశలో క్యాన్సర్‌ సులభంగా కనిపిస్తుంది. ప్రొస్టేట్‌ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. 

స్టేజ్‌ 3 : క్యాన్సర్‌ ప్రొస్టేట్‌ని దాటి వీర్యవాహికలు లేదా సమీప కణజాలానికి పాకి ఉండొచ్చు. 

స్టేజ్‌ 4 : క్యాన్సర్‌ లింఫ్‌ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది. 

చికిత్స: ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు క్యాన్సర్‌ ఎంత వేగంగా వృద్ధి చెందుతోంది, ఇతర అవయవాలకు పాకుతోంది.., రోగి ఆరోగ్య స్థితి, చికిత్స దుష్ప్రభావాలు.. ఇలా అనేక అంశాల ఆధారంగా చికిత్స ప్రక్రియను నిర్ణయిస్తారు. క్యాన్సర్‌ మొదటి దశలో ఉన్నవారికి వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రోగులను అప్రమత్తతతో వేచి ఉండమని సూచిస్తారు. అంటే క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, పురీషనాళ పరీక్షలు, అవసరమైతే బయాప్సీ వంటివి చేయించుకుంటే శరీరంలో కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం. అప్రమత్తతతో వేచి చూడటమనేది క్యాన్సర్‌ నెమ్మదిగా వృద్ధి చెందుతున్న వారికి, క్యాన్సర్‌ లక్షణాలు బయటపడనివారికి మాత్రమే. క్యాన్సర్‌ వేగంగా వృద్ధి చెందుతుంటే ఆపరేషన్‌, రేడియోథెరపీ వంటి చికిత్స పద్ధతులను అనుసరిస్తారు. 

రేడియేషన్‌ థెరపీ: ఈ చికిత్సలో అధిక శక్తి గల రేడియోధార్మిక కిరణాలను ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను తుదముట్టిస్తారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లో రేడియేషన్‌ను రెండు రకాలుగా ఇస్తారు. శరీరం బయటి నుంచి రేడియోధార్మికతను ఇవ్వడం, శరీరం లోపల రేడియోధార్మికతను ఉంచడం. 

హార్మోన్‌ థెరపీ: హార్మోన్‌ థెరపీలో శరీరంలోని టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని నిలిపివేస్తారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లో క్యాన్సర్‌ కణాలు టెస్టోస్టిరాన్‌ మీద ఆధారపడి వృద్ధి చెందుతుంటాయి. టెస్టోస్టిరాన్‌ సరఫరాను నిలిపివేయడం వల్ల క్యాన్సర్‌ కణాల వృద్ధి మందగించడం గానీ లేదా చనిపోవడం గానీ జరుగుతుంది. హార్మోన్‌ థెరపీని వివిధ రకాలుగా ఇవ్వొచ్చు. 

మందుల ద్వారా టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని నిలిపేయడం : వృషణాలు టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని రకాల మందుల ద్వారా అవి టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేయకుండా నిరోధించవచ్చు. 

టెస్టోస్టిరాన్‌ను క్యాన్సర్‌ కణాలకు అందకుండా చేయడం : యాంటీ ఆండ్రోజన్‌ మందుల ద్వారా టెస్టోస్టిరాన్‌ను క్యాన్సర్‌ కణాలకు అందకుండా చేయవచ్చు. 

వృషణాలను తొలగించడం : రెండు వృషణాలను తొలగించడం ద్వారా శరీరంలో టెస్టోస్టిరాన్‌ పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా హార్మోన్‌ థెరపీ లాంటిదే. అయితే ఈ పద్ధతిలో టెస్టోస్టిరాన్‌ పాళ్లను వేగంగా తగ్గించవచ్చు. అయితే దీన్ని క్యాన్సర్‌ అడ్వాన్స్‌ దశలో ఉన్నవారికి మాత్రమే చేస్తారు. 

క్యాన్సర్‌ ప్రాథమిక దశలో ఉన్నవారికి హార్మోన్‌ థెరపీ సరిపోతుంది. వృషణాలను తొలగించాల్సిన అవసరం లేదు. హార్మోన్‌ థెరపీ వల్ల క్యాన్సర్‌ కణుతులు కుంచించుకుపోతాయి. ఆ తర్వాత రేడియేషన్‌ చికిత్స చేస్తే ఫలితాలు మెరుగ్గా వస్తాయి. 

శస్త్రచికిత్స: సర్జరీ ద్వారా ప్రొస్టేట్‌ గ్రంథిని, దాని చుట్టుపక్కల కణజాలాన్ని లింఫ్‌ గ్రంథులలో కొంత భాగాన్ని తొలగిస్తారు. అయితే దీనివల్ల అంగస్తంభన, మూత్రవిసర్జన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

కీమోథెరపీ: ఈ ప్రక్రియలో మందుల ద్వారా క్యాన్స ర్‌ కణాలను చంపడానికి ప్రయత్నిస్తారు. కీమోథెరపీలో మందులను ఇంజెక్షన్ల రూపంలో గానీ లేదా మాత్రల రూపంలో గానీ ఇస్తారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాగా ముదిరి శరీరంలోని ఇతర భాగాలకు కూడా పాకినట్లయితే కీమోథెరపీని ఇస్తారు. 

నివారణ: నిత్యం వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. 

  • డాక్టర్‌ మోహన వంశీ
  • చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌
  • హైదరాబాద్‌ : 9848011421
  • కర్నూల్‌ : 08518-273001
  • గుంటూరు : 0863-2223300


logo