గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - May 18, 2020 , 22:29:14

చచ్చుబడిన అవయవాలకు చైతన్యం వస్తుందా?

చచ్చుబడిన అవయవాలకు  చైతన్యం వస్తుందా?

నా చిన్నతనంలో మా అమ్మ పక్షవాతానికి గురైంది. చాలా ఇబ్బందులు పడి, కొన్నాళ్ల కిందట మరణించింది.  అప్పటి నుంచీ నాకు పక్షవాతం అంటే భయం.  ఎవరికి పక్షవాతం వచ్చినా అవయవాలు చచ్చుబడిపోయి, నరకం అనుభవించి చనిపోవడమేనా? దీని నుంచి మళ్లీ కోలుకునే అవకాశాలు లేవా? - కలిదిండి విశాలాక్షి, మిర్యాలగూడ

పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. పక్షవాతానికి ఒకప్పుడు ట్రీట్‌మెంట్‌ లేదు. కానీ గత 15 - 20 ఏండ్లుగా చక్కని చికిత్స అందుబాటులోకి వచ్చింది. పక్షవాత లక్షణాలు కనిపించిన మొదటి నాలుగున్నర గంటలలోగా హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకోవడం మొదలుపెడితే అవకరాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రాణాపాయం తప్పుతుంది. హాస్పిటల్‌కి వెళ్లగానే మొదట సీటీ స్కాన్‌ చేస్తారు. రక్తనాళం చిట్లి రక్తస్రావం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా లేక బ్లాక్‌ వల్ల వచ్చిందా అనేది  దీనిద్వారా తెలుస్తుంది. రక్తస్రావం వల్ల కాకుండా బ్లాక్‌ కారణంగా వచ్చిన ‘ఇస్కిమిక్‌ స్ట్రోక్‌' అయితే వెంటనే క్లాట్‌ కరగడానికి టిష్యూ ప్లాస్మోజెన్‌ యాక్టివేటర్‌ (టీపీఏ) లేదా టెనెక్టిప్లేస్‌ ఇంజెక్షన్‌ ఇస్తారు. దీన్ని ‘థ్రాంబోలైటిక్‌ థెరపీ’ అంటారు. దీనివల్ల అప్పటివరకు చచ్చుబడిన భాగాలు కూడా మెరుగుపడుతాయి. ఇంజెక్షన్‌ ఇచ్చినా తగ్గకపోతే మెకానికల్‌ థ్రాంబెక్టమీ చేస్తారు. అంటే కెథటర్‌ని పంపి, ఎండోవాస్కులర్‌ థెరపీ ద్వారా క్లాట్‌ తీసేస్తారు. ఇది ఆరు గంటల్లోపు చేయాలి. పక్షవాతం నుంచి కోలుకోవడంలో తోడ్పడే మరో ముఖ్యమైన చికిత్స ఫిజియోథెరపీ. 

డాక్టర్‌ 

జైదీప్‌ రాయ్‌ చౌధురి

సీనియర్‌ న్యూరో ,ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo