ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - May 12, 2020 , 23:49:40

నాకు కిడ్నీ సమస్య వస్తుందా?

నాకు కిడ్నీ సమస్య వస్తుందా?

నా వయసు 33 సంవత్సరాలు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. కాని ఒకసారి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ దగ్గరికి వెళ్తే బీపీ 170/120 అని చెప్పారు. బీపీ కోసం మందులు ఇచ్చారు. ఒక్కరోజు కూడా మానొద్దని చెప్పారు. ఈ మందులు వాడకుంటే, భవిష్యత్తులో కిడ్నీ సమస్యలేమైనా వచ్చే ప్రమాదం ఉందా?

- రాజశేఖర్‌,  వరంగల్‌

ఈ వయసులో, ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. నలభై సంవత్సరాల లోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నదంటే కిడ్నీ సమస్య ఉందేమో చూడాలి. మీరు యూరిన్‌ పరీక్ష, అల్ట్రాసౌండ్‌, క్రియాటినిన్‌ పరీక్షలు చేయించుకోండి. బీపీ ఎందుకు వచ్చిందో ముందుగా తెలుసుకోవాలి. కిడ్నీలో సమస్యలేమైనా ఉంటే వెంటనే చికిత్స అవసరం. ఏ లక్షణాలూ కనిపించకపోయినా బీపీకి తప్పనిసరిగా మందులు వాడాలి. లేకుంటే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మందులు వాడటమే కాకుండా, మీ డైట్‌లో కూడా మార్పులు చేసుకోవాలి. ఆహారంలో ఉప్పు చాలా తగ్గించాలి. పెరుగన్నంలోకైతే ఉప్పు అసలే వాడకూడదు. ఆవకాయకూ ఇతర పచ్చళ్లకు దూరంగా ఉండటం మంచిది. మరో ముఖ్యమైన విషయం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఒక గంటసేపు వాకింగ్‌ అయినా చేయాలి. ఇప్పుడు కరోనా వల్ల బయటికి వెళ్లలేరు కాబట్టి, ఇంటి ముందో బాల్కనీలోనో నడవాలి. ఇంట్లో చేసుకోగలిగే వ్యాయామాలు చేయాలి. యోగా కూడా మంచిదే. బరువు పెరగకుండా చూసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. బీపీ నియంత్రణలో ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.

  • డాక్టర్‌ విక్రాంత్‌ రెడ్డి
  • కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌
  • కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo