ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - May 11, 2020 , 23:00:00

మీరు..నోరు!

మీరు..నోరు!

హాయిగా నవ్వడానికి అందమైన పలువరుస కావాలి. తిన్నది  జీర్ణం కావడానికి బాగా  నమలగలిగే దంతాలు కావాలి.స్పష్టంగా, అందంగా మాట్లాడటానికి ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి...కొన్నిసార్లు కొన్ని ప్రమాదాల నుంచి రక్షించేందుకు కూడా బలమైన దంతాలు కావాలి...ఎన్నో రకాలుగా, దంతాలు మన ఆరోగ్యానికి వాకిళ్లు. అదే సమయంలో రోగాలకు రహదారులు కూడా. నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే, మనమూ ఆరోగ్యంగా ఉంటాం! 

ఇవీ లక్షణాలు..

 • రక్తస్రావం 
 • వాపు  
 • సందులు ఏర్పడటం
 • దంతాలు వదులై కదలడం
 • గట్టిగా ఉన్న పళ్లు బలహీనం కావడం

దంతాలున్నది తినడానికే కాదు. ఇంకా చాలా పనులు చేస్తాయి. నోరు అంటే దంతాలు ప్లస్‌ నాలుక, అంగిలి, స్వరపేటిక.. ఇలా నోటి కుహరంలోని భాగాలన్నీ వస్తాయి. ఇవన్నీ సమన్వయంతో పనిచేసినప్పుడే... ఆరోగ్యంగా ఉన్నప్పుడే నోరు... నోటితో పాటు దంతాలూ ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.  చిన్నప్పుడు మనకు ఇరవై పాలపళ్లు ఉంటాయి. ముప్పైరెండు శాశ్వత దంతాలు ఉంటాయి. 

ఆహారం ముందుగా జీర్ణం అయ్యేది నోట్లోనే. లాలాజలం ఇందుకు ఉపయోగపడుతుంది. బాగా నమిలినప్పుడు లాలాజలం ఏర్పడి, ఆహారం పలుచబడుతుంది. తరువాత లాలాజలంలోని థయలిన్‌, అమైలేజ్‌ 

ఎంజైమ్‌లు ఆహారాన్ని జీర్ణం చేయడం ప్రారంభిస్తాయి. మనకు ఆకలి వేయగానే లాలాజలం ఊరేది ఇందుకే. రుచిమొగ్గలు నాలుక పైనే కాదు.. పెదవులు, అంగిలిలో కూడా ఉంటాయి. రుచి తెలియడం వల్లే.. మనం తినగలిగిన, తినాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకోగలుగుతాం. ఇలా ఆహారాన్ని జీర్ణం చేయడానికి, స్పష్టంగా మాట్లాడటానికి, అందంగా నవ్వడానికి, అవసరమైతే ఆత్మరక్షణ చేసుకోవడానికి దంతాలు కావాలి. 

పాలదంతాలకూ పిప్పి..!: శిశువుకు 6 నెలల వయసు నుంచి దంతాలు రావడం ఆరంభం అవుతుంది. రెండేండ్లు వచ్చేసరికి మొత్తం 20 పాల దంతాలు వచ్చేస్తాయి. అయితే పాలదంతాలను శుభ్రం చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. ఇది అపోహ. ఒక పన్ను రావడం మొదలవగానే శుభ్రం చేయడం ప్రారంభించాలి. 

ఆ ఒక్క దంతాన్ని కూడా టూత్‌ బ్రష్‌తో శుభ్రం చేయవచ్చు. ఇలా చేయకపోతే పాల దంతాలకు కూడా పిప్పి రావొచ్చు. పాలు గాని, ఇతర ఆహార పదార్థం గాని పన్నుపైన ఎక్కువ సేపు ఉంటే లాక్టోబాసిల్లస్‌ అనే బాక్టీరియా పెరుగుతుంది. ఇది లాక్లిక్‌ యాసిడ్‌ అనే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల దంతాలకు రంధ్రం పడుతుంది. పాలు తాగే పసిపాపలు కూడా పన్ను పుచ్చిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీన్ని నర్సింగ్‌ బాటిల్‌ క్యారీస్‌గా వ్యవహరిస్తారు. పాలపళ్లకు పిప్పి వస్తే, ఊడిపోయేవే కదా అని వైద్యం చేయించరు. కాని పాలదంతాలకు పిప్పి వస్తే, శాశ్వత దంతాలకు కూడా వచ్చే ఆస్కారం ఎక్కువ. పిప్పి వల్ల అటువైపు నమలడం మానేస్తారు. దానివల్ల ఆ దంతం బలంగా ఎదగదు. తద్వారా శాశ్వత దంతాలూ ప్రభావితం కావొచ్చు. పిప్పి పళ్ళకు ఫ్లోరైడ్‌ అప్లికేషన్‌ ట్రీట్‌మెంట్‌, ఎఆర్‌టి - ఎట్రామాటిక్‌ రిస్టోరేటివ్‌ టెక్నిక్‌ లాంటి చికిత్సలు సత్ఫలితాలనిస్తాయి.  

చిగుళ్లు జాగ్రత్త!: పిప్పి ఒకట్రెండు దంతాలకు వస్తే, చిగుళ్ల వ్యాధి దంతాలన్నింటి పైనా ప్రభావం చూపిస్తుంది. చిగుళ్ల వ్యాధినే పయోరియా లేదా పెరిడాంటల్‌ డిసీజ్‌ అంటారు. 98 శాతం మందిలో దంతాలు ఊడిపోవడానికి కారణం ఇదే. దంతాలపై పాచి గట్టిపడి కాలిక్యులస్‌ ఏర్పడుతుంది. ఇది చిగుళ్లను దెబ్బతీసి అవి కిందకి జారిపోయేలా చేస్తుంది. సాధారణంగా చిగుళ్ల వ్యాధి ఏ వయసులోనైనా రావొచ్చు. అయితే శాశ్వత దంతాలనే ఎక్కువగా బాధిస్తుంది. పాలపళ్లకు చిగుళ్ల వ్యాధి వస్తే రూట్స్‌ దాక వెళ్లదు. ఇన్‌ఫెక్షన్‌ అక్కడి దాకా వ్యాపించక ముందే అవి ఊడిపోయి, శాశ్వత దంతాలు వస్తాయి. కొన్నిసార్లు శాశ్వత దంతాలు వస్తున్నప్పుడు కూడా చిగుళ్ల వ్యాధి మొదలవ్వొచ్చు. ఇలాంటప్పుడు అవి కూడా ప్రభావితం అవుతాయి. మనం తీసుకున్న ఆహారం ఇరుక్కుపోయి, కుళ్లిపోవడం వల్ల చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. పంటి వేరు చుట్టూ ఉండే ఎముక అరిగిపోయి, వేర్లతో సహా చిగుళ్లు దెబ్బతింటాయి. దీనివల్ల దంతాలు వదులై, ఊడిపోతాయి. 


దంతక్షయం  పిప్పి పళ్లు 

మనిషి జీవితంలో ఏదో ఒకసారి పిప్పిపన్ను రాకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. 95 శాతం మంది పిప్పిపన్నుతో బాధపడతారు. దంతాలపైన ఉండే పింగాణి చాలా గట్టిది. తొందరగా దెబ్బతినదు. కాని మన అలవాట్లతో పింగాణికి కూడా క్షయం కలిగిస్తున్నాం. పాలుతాగే వయసులో, పాల దంతాలకు కూడా పిప్పి రావొచ్చు. సాధారణంగా పిల్లలు చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీముల్లాంటివి ఇష్టంగా తింటారు. ఇలాంటి పదార్థాలు దంతాలకు అతుక్కుపోతాయి. కాబట్టి వీటివల్ల దంతక్షయం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.  చెవి నొప్పి, గొంతునొప్పి, రక్తస్రావం లాంటివి ఉన్నాయంటే ముందు పిప్పి ఉందేమో చూడాలి. నొప్పి ఉందని నమలడం మానేస్తే జీర్ణశక్తి తగ్గుతుంది. అజీర్తి వస్తుంది. ఫలానాది తినడం వల్ల నొప్పి ఎక్కువైందని, తినడం మానేస్తారు. అంటే, పోషకాలు తీసుకోలేరు. 

తెలుసుకోవాల్సినవి...

 • దంతాలు జీవితాంతం ఉంటాయి. వయసురీత్యా ఊడిపోవడం ఉండదు. నిజానికి వృద్ధుల్లో సైతం దంతాలు ఊడటానికి ఏ చిగుళ్ల వ్యాధో కారణం అవుతుందే గాని, వాటికవి వయసు పెరగడం వల్ల ఊడిపోవు. 
 • మహిళల్లో ఆస్టియోపోరొసిస్‌ వల్ల దంతాల మధ్య సందులేర్పడి, చిగుళ్లు బలహీనం అవుతాయి. 
 • విటమిన్‌ డి లోపం వల్ల కూడా దంతాలు, 
 • చిగుళ్లు అనారోగ్యం పాలవుతాయి. 
 • ఎముకకు సంబంధించిన ఏ వ్యాధి అయినా దంతాలనూ దెబ్బతీయొచ్చు. 
 • బ్లడ్‌ క్యాన్సర్లు, ఎముక క్యాన్సర్‌ సంకేతాలు నోటిలో కన్పిస్తాయి. 
 • కదిలే దంతాలను కూడా గట్టిపరిచే 
 • చికిత్సలు ఉన్నాయి. వేరు చుట్టూ ఉండే ఎముకను లేజర్‌, సర్జరీ, బోన్‌ గ్రాఫ్టింగ్‌  (కృత్రిమ ఎముక పొడిని అమర్చడం) ద్వారా సరిచేస్తారు. ఎముకలు గట్టిపడేలా చేస్తారు. విటమిన్‌ డి, కాల్షియం సప్లిమెంట్ల ద్వారా దంతాలు, చిగుళ్లను బలోపేతం చేస్తారు. 

దంతాలు  ఇలా క్షేమం..!

 • దంత ఆరోగ్యంలో కీలకమైంది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండుసార్లు దంతధావనం చేసుకోవాలి. 
 • దంతాలకు ఆహారం అతుక్కోకుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుకిలించాలి. 
 • బాగా నమిలి తినడం ఓరకంగా ఒత్తిడినీ తగ్గిస్తుంది. దంత సమస్యలుంటే గట్టిగా నమలలేం. అంటే, ఒత్తిడిని దూరం చేసుకునే ఓ మంచి అవకాశాన్ని కోల్పోతాం.
 • చూయింగ్‌ గమ్‌ మంచిదే. దంతాలకు వ్యాయామం నమలడం వల్లే. చక్కెర లేని చూయింగ్‌ గమ్‌లు అయితే మరీ మంచిది. 
 • తాజా పండ్లు ఎక్కువగా తినాలి. కాల్షియం అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి.
 • మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడతాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. గర్భిణులకు కాల్షియం సప్లిమెంట్లు అందుకే ఇస్తారు. కాని టెట్రాసైక్లిన్స్‌ లాంటి యాంటిబయాటిక్స్‌, టైఫాయిడ్‌, మలేరియా లాంటి జ్వరాల మందుల వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడుతుంది. వాటివల్ల తరువాత ఏర్పడే దంతాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి గర్భిణులుగా ఉన్నప్పుడు యాంటిబయాటిక్స్‌ లాంటి మందులతో జాగ్రత్త.
 • 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్‌తో శుభ్రం (స్కేలింగ్‌) చేయించుకోవాలి. దీని వల్ల దుర్వాసన రాదు. దంతక్షయాన్నీ నివారించవచ్చు. 
 • పొగతాగడం, ఆల్కహాల్‌, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు. 

పిల్లలకు చెరుకు లాంటి  నమిలే పదార్థాలను పెట్టడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి.

-డాక్టర్‌ చంద్రకాంత్‌

-దంతవైద్య నిపుణులు

-మహావీర్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌


logo