ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - May 08, 2020 , 17:33:28

మహమ్మారులే కాదు దివ్యౌషధాలనూ అందిస్తాయి

మహమ్మారులే కాదు దివ్యౌషధాలనూ అందిస్తాయి

హైదరాబాద్: అడవి జంతువులు అంటే ఇప్పుడు మనుషులకు అనారోగ్యం అంటగట్టేవిగా చూస్తున్నారు. అవి మనుషుల ప్రాణాలు నిలబెట్టే రక్షక వ్యవస్థలని తమలో కలిగి ఉన్నాయనే భావన కొంత వెనుకతట్టు పట్టింది. దీనినే కాలమహిమ అంటారు. చెట్టుబెరడును మందుగా వాడేందుకు చాలాకాలం ముందే ఆదిమానవుడు జంతువులలోని వైద్య లక్షణాలను తెలుసుకున్నాడు. సాంప్రదాయిక చైనా వైద్యంలో ఖడ్గమృగాలు, ఎలుగుబంట్లు, పులులు, చేపలు, పీతల వంటి 36 రకాల జంతువుల శరీరభాగాలను వినియోగిస్తారు. అందులో చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయనేది వేరే సంగతి. అంతెందుకు, మన ఆయుర్వేదంలో పాము విషాన్ని కీళ్లవాతం చికిత్సకు వినియోగిస్తారు. ఇక దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పెద్దసాలీడు కొండీలను క్యాన్సర్ గడ్డలు మొదలుకుని పంటినొప్పులు, ఆస్థమా దాకా రకరకాల ఆరోగ్య సమస్యల చికిత్సలో ఔషధాలుగా వినియోగిస్తారు. అయితే వీటిలో చాలా మందులకు శాస్త్రీయపరమైన సమర్థన లేదు. పైగా ఔషధాల పేరిట యథేచ్ఛగా జంతువులను వేటాడడంతో అనేక జాతులు అంతరించిపోయాయి. పశ్చిమ ప్రాంతపు నల్ల ఖడ్గమృగం, ఉత్తరాది తెల్ల ఖడ్గమృగం వంటివి అందులో ఉన్నాయి. 

ఇటీవలి కాలం వరకు పాంగోలిన్‌లను వాటి పొలుసుల కోసం చైనా వన్యమృగ సంరక్షణ కేంద్రాల్లో పెంచేవారు. కొన్నిరకాల పాంగోలిన్‌లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కోవిడ్-19 పాంగోలిన్‌ల ద్వారానే మనుషులకు వ్యాపించిందని భావిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇలాగే అడవి జంతువులను వేటాడుతూ పోతే భవిష్యత్తులో మరింత తరచుగా, మరింత భయంకరమైన మహమ్మారులు సంభవించడం ఖాయమని ఈ వారం ప్రముఖ సాస్త్రవేత్తలు కొందరు హెచ్చరించారు కూడా.అయితే మూఢంగా కాకుండా వన్యప్రాణులను బాధ్యతాయుతంగా వినియోగించుకునే మార్గాలు వెదకాలేమో. బహుశ వాటి శరీర కణాల్లోని రసాయనిక కలయికను అధ్యయనం చేయడం సరిపోతుంది. ఆదునిక సాంకేతికత పుణ్యమా అని జంతువుల శరీరభాగాలు నేరుగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వాటి డీఎన్ఏ నిర్మాణంలో ఏయే మూలకాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలు. వందేళ్ల పైచిలుకు కాలం నుంచి ప్రపంచంలో చెట్ల నుంచి కొన్ని ప్రత్యేక పదార్థాలను వేరుచేసి మందులను తయారు చేస్తున్నారు. కానీ జంతువుల నుంచి అలా పదార్థాలను గుర్తించి వేరుచేయడం అంత సులభంగా లేదు. కానీ క్రమంగా పరిస్థితి మారుతున్నది. భవిష్యత్తులో జంతువుల నుంచే రోగాలు అధికంగా సంక్రమించినప్పటికీ మందులు కూడా అంతకంతకూ ఆ జంతువుల నుంచే వచ్చే అవకాశం మాత్రం ఉంది. 


మనం చాలాకాలంగా ఆకుమందుల గురించి కొండంత తెలుసుకున్నాం. కానీ జంతువుల నుంచి సేకరించే మందుల గురించి తెలిసింది మాత్రం గోరంతే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. పాముల విషం నుంచి తీసిన పెప్టైడ్స్‌తో మల్టిపుల్ స్క్లెరోసిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, మయోటోనిక్ డిస్ట్రఫీ వంటి రోగాలకు మందులను తయారుచేసే పరిశోధన జరుగుతున్నది. పెప్టైడ్స్ పాములతోపాటుగా పరిణామ క్రమం వల్ల నత్తలు, సాలీళ్లు తదితర జీవుల్లోనూ లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించే మోతాదులు తెలిస్తే రోగాల ఆటకట్టించే మంత్రదండం దొరికినట్టే. ఖచ్చితమైన ప్రభావంతో వాటిని ఉపయోగించవచ్చు. నేడు కణజాల అధ్యయనంలో జెనోమిక్స్, ప్రోటియోమిక్స్, ట్రాన్స్‌క్రిప్టానమిక్స్ వంటి విశిష్ట సాధనాలు అభివృద్ధి చెందుతున్నాయి. వీటిని ఉపయోగిస్తే మందుల కోసం పాములు, తేళ్ల విషాన్ని పిండాల్సిన అవసరం కూడా లేదు. కణాలను విశ్లేషించి వాటి అంతర్నిర్మాణాన్ని పరిశీలించి రసాయనికంగా విశ్లేషిస్తే సరిపోతుంది. అదే పదార్థాన్ని మరో చోటునుంచి మరింత సులభంగా పొందే దారి దొరుకుతుంది. ఈ సరికే జంతువుల నుంచి సేకరించిన పదార్థాలతో పలురకాల ఆదునిక ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. గీలా మాన్స్ టర్ లాలాజలం నుంచి తయారుచేసిన టైప్-2 డయాబెటిస్ ఔషధం ఎనెగ్జాటైడ్, నత్త విషం నుంచి తయారు చేసిన జికోనిటైడ్ అనే నొప్పి మందు, దక్షిణ అమెరికా రక్తపింజర విషంతో తయారు చేసిన రక్తవ్యాధుల మందు రెప్టిలేజ్ ఆ కోవకు చెందినవే. 


1981లో మొట్టమొదటిసారిగా అమెరికా ఔషధ నియంత్రపణ సంస్థ జంతువుల నుంచి సేకరించిన రక్తపోటు ఔషధం క్యాప్టోప్రిల్‌ను ఆమోదించింది. పైన తెలిపినవి అన్నీ కూడా దాదాపుగా జంతువుల విషం నుంచి తయారు చేసినవే. ఈ విషాలు కోట్ల సంవత్సరాల పరిణామక్రమంలో విశిష్ట లక్షణాలను సంతరించుకున్నాయి. నిర్దేశిత లక్ష్యాలను తాకే బాణాల్లా అవి పనిచేస్తాయి. స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో రక్తం గడ్డ కడుతుంది. దాన్ని కరిగించేందుకు ఒకేఒక మందు టీపీఏ అనేది ఉంది. కానీ స్ట్రోక్ వల్ల మెదడుకు నష్టం వాటిల్లకుండా చూసే మందు ఇంతవరకు లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని పొట్టనపెట్టుకున్న ఆరోగ్య సమస్య ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఫనెల్-వెబ్ సాలీడు విషంలో నుంచి తీసిన హెచ్ఐ1ఏ అనే రసాయనం ఈ విషయంలో ఉపకరించవచ్చని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఆ సాలీడు విషంలో నిజానికి 3,000 రకాల మాలిక్యూల్స్ ఉన్నాయట. అన్నిటి లక్షణాలు తెలుసుకుంటే అదొక ఔషధ ఆయుధాగారమే అవుతుందని శాస్త్రవేత్తలు అంటారు. క్యాన్సర్ కణితులకు ్తుక్కునే టోజులెరిస్టేడ్ అనే ఔషదాన్ని తేలుకొండి విషం నుంచి అభివృద్ధి చేశారు. ఇది ఆరోగ్యకరమైన కణాలను ఏమాత్రం తాకకుండా  నేరుగా వెళ్లి కణనితిని మాత్రమే అతుక్కుంటుంది. అందుకే దీనిని ట్యూమర్ పెయింట్ అని కూడా అంటారు. ఇది శస్త్రచికిత్సల సమయంలో కణితులను గుర్తించేందుకు సర్జన్లకు ఉపకరిస్తుంది. పాములు, తేళ్లే కాకుండా చిన్నా చితకా కీటకాల్లో కొద్దిమోతాదులో ఉండే విషాల గురించి తెలుసుకుంటే ఎన్నో కొత్తరకాల ఔషదాలను తయారు చేసుకోవచ్చునని అంటున్నారు. జంతు ప్రపంచం మనకు మహమ్మారులనే కాదు రోగాలను తుదముట్టించే దివ్యౌధాలనూ అందిస్తున్నది. తెలుసుకోవడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం.


logo