బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - May 04, 2020 , 22:43:16

ఉబ్బసం వ్యాధి... అపోహలే అసలు సమస్య

ఉబ్బసం వ్యాధి... అపోహలే అసలు సమస్య

ప్రపంచవ్యాప్తంగా 18 శాతం మందికి ఉబ్బసం (ఆస్తమా) ఉన్నట్టు అంచనా. అయితే ఉబ్బసం వ్యాధి వస్తే తగ్గదనే భయం ఒకరిదైతే.. పిల్లలు పెద్దవాళ్లయితే అదే తగ్గుతుందిలే అన్న నిర్లక్ష్యం మరొకరిది. ఇలాంటి అపోహలు అనేకం ఉన్నాయి. నేడు ‘వరల్డ్‌ ఆస్తమా డే’. ఈ సందర్భంగా, అపోహల్ని తొలగించుకొని  అవగాహన పెంచుకుందాం. 

అంటువ్యాధా?

ఇది ఇన్‌ఫెక్షన్‌ కాదు. రోగనిరోధక వ్యవస్థలోని గందరగోళ పరిస్థితి వల్ల వచ్చే అలర్జీ. అయితే దీనికి జన్యుపరమైన కారణాలున్నాయి. సాధారణంగా 95 శాతం సందర్భాల్లో ‘ఫ్యామిలీ హిస్టరీ’ ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరికే ఆస్తమా ఉంటే, పిల్లలకు వచ్చే ఆస్కారం 25 శాతం. ఇద్దరికీ ఉంటే మాత్రం 50 శాతం మేర ప్రమాదం పొంచి ఉన్నట్టే. 

ప్రత్యామ్నాయ వైద్యంలో... 

హోమియో, ఆయుర్వేదం లాంటి ప్రత్యామ్నాయ వైద్యాల ద్వారా ఆస్తమా నుంచి పరిపూర్ణ విముక్తి లభించదు. అల్లోపతి విధానంలో కూడా శాశ్వతంగా ఆస్తమాను పోగొట్టలేం. కాని నియంత్రించవచ్చు. ఆస్తమాకు ఇచ్చే ఇంగ్లీషు మందులు సాధారణ జీవనశైలిని ప్రసాదించగలుగుతాయి. దీని విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఊపిరితిత్తుల్లో మార్పులు జరుగుతాయి. పదేపదే ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల తొలిదశలోనే నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది. 

వయసు పెరిగితే  తగ్గుతుందా?

చిన్నపిల్లలు పెద్దయిన కొద్దీ అలర్జీలు తగ్గుతాయి. అలాగే ఆస్తమా కూడా తగ్గుతుందనుకుని చాలామంది అశ్రద్ధ చేస్తారు. కాని మందులు వాడకుంటే ఆస్తమా ఉన్న పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. పెద్దయినంత మాత్రాన పోతుందనుకుంటే పొరపాటే. వాళ్ల ఊపిరితిత్తి  పరిమాణం పెరుగుతుంది కాబటి,్ట రియాక్షన్‌ తక్కువ కనబడుతుందంతే. 

ఆస్తమా వర్సెస్‌ వ్యాయామం 

ఆస్తమా ఉన్నవాళ్లు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నిజానికి వ్యాయామం వల్ల ఆస్తమా అటాక్స్‌ తగ్గుతాయి. దానివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కేలరీలు వినియోగమై బరువు తగ్గుతారు. బరువు తగ్గేకొద్దీ ఆస్తమా రిస్కు తగ్గుతుంది. రక్తప్రసరణ పెరగడం వల్ల మంచి ఆక్సిజన్‌ అంది అవయవాలన్నీ శక్తిమంతమవుతాయి. అలర్జీలనే కాదు, ఇన్‌ఫెక్షన్లను కూడా తట్టుకోగలుగుతారు.

యోగాతో  తగ్గుతుందా?

ఆస్తమాకు యోగా, ప్రాణాయామం మంచి వ్యాయామాలు. వృద్ధులు, బాగా ఊబకాయం ఉన్నవాళ్లు, తొలిదశలో ఆస్తమా ఉన్నవాళ్లతోబ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు, ప్రాణాయామం చేయిస్తాం. శ్వాసను లోతుగా తీసుకుని దాన్ని పట్టి ఉంచడం, తరువాత నెమ్మదిగా వదలడం, వేగంగా శ్వాస తీసుకోవడం, కపాల భాతి లాంటివి ఆస్తమా అటాక్స్‌ను తగ్గిస్తాయి. అయితే యోగాతో ఆస్తమా పూర్తిగా నయం కాదు కాని, అటాక్స్‌ తగ్గుతాయి. వచ్చినా తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. 

ఆయాసం ఉంటే ఉన్నట్టేనా?

ఆయాసం ఉంటే ఆస్తమా ఉందనుకోవడం సరికాదు. శ్వాసవ్యాధులన్నింటిలోనూ ఆయాసం, దగ్గు ఉంటాయి. ఆయాసం వచ్చిందని మెడికల్‌ షాప్‌కి వెళ్లి మందులు కొనుక్కుని వాడటం, స్టిరాయిడ్‌ టాబ్లెట్లు, ఇన్‌హేలర్లు వాడటం.. సొంత వైద్యం కిందికే వస్తాయి.

వస్తే ఇక తగ్గదా?

ఒకప్పుడు ఆస్తమా అంటే ప్రాణాంతకమే. కాని ఇప్పుడు ఆస్తమాకు మంచి ఇన్‌హేలర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. శాశ్వతంగా, ముఖ్యంగా నాన్‌ అలర్జిక్‌ ఆస్తమా నుంచి విముక్తి పొందడానికి సరికొత్త చికిత్సలు వచ్చాయి. బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ, మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఇంజెక్షన్లు తీవ్రమైన ఆస్తమా బారి నుంచి పూర్తిగా బయటపడేస్తున్నాయి. 

చేపమందుతో పోతుందా?


ఆస్తమాకీ చేపమందుకీ సంబంధం లేదు. నిజానికి, కొంతమంది పేషెంట్లలో ఇలాంటి మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. సజీవంగా ఉన్న చేప నోట్లో మందు పెట్టి గొంతులోకి పంపిస్తారు. అది పొట్టలోకి వెళ్లి, తరువాతి రోజు జీర్ణమై బయటికి వెళ్లిపోతే సమస్య లేదు. కాని ముసలివాళ్లు, చిన్నపిల్లల్లో ఆ చేప ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు అత్యవసరంగా చికిత్స చేసి, ఊపిరితిత్తుల నుంచి చేపను బయటికి తీయాల్సి ఉంటుంది. అంతేగాక చేపమందుకు ఎటువంటి శాస్త్రీయతా లేదు. దానితో ఆస్తమా పోతుందనుకోవడం అపోహ.

డాక్టర్‌ వై. గోపీకృష్ణ

సీనియర్‌ పల్మనాలజిస్ట్‌

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌


logo