శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Apr 30, 2020 , 22:30:00

నిశ్శబ్ద శత్రువు... న్యూరో ఎండోక్రైన్‌!

నిశ్శబ్ద శత్రువు... న్యూరో ఎండోక్రైన్‌!

విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌... న్యూరోఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. దీంతో  ఈ నిశ్శబ్ద వ్యాధి గురించి చాలామంది ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. రుగ్మత లక్షణాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నిజానికి, ఇది జీవనశైలి రుగ్మత కాదు. ఆరోగ్యవంతుల్నీ కబళిస్తుంది.

పెరుగుదల నుంచి జీర్ణక్రియ దాకా... మన శరీరంలోని రకరకాల జీవక్రియలు సక్రమంగా జరుగడానికి తోడ్పడేవి హార్మోన్లు. వీటిని ఎండోక్రైన్‌ (అంతస్స్రావీ) గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి. థైరాయిడ్‌, అండాశయాలు, అడ్రినల్‌ గ్రంథులు... ఇలాంటివే. వీటిలోని కణాలను ఎండోక్రైన్‌ కణాలు అంటారు. ఇవి విడుదల చేసే హార్మోన్లు శరీరంలో వివిధ జీవక్రియలను నిర్వర్తిస్తాయి. మానసిక, శారీరక పెరుగుదల, ప్రత్యుత్పత్తి, భావోద్వేగాలు.. ఇలా రకరకాల చర్యలపై వీటి ప్రభావం ఉంటుంది. ఎండోక్రైన్‌ కణాల పనితీరును నిర్దేశించేవే నాడీ కణాలు. ఎండోక్రైన్‌ కణాలు, నాడీకణాలు... ఈ రెండింటి లక్షణాలను కలిగివున్న కణాలను న్యూరోఎండోక్రైన్‌ కణాలని అంటారు. తల్లి కడుపులో మనం ఎదిగేటప్పుడే... శరీరంలో ఇవి అనేక చోట్ల చెల్లాచెదురుగా ఉంటాయి. ముఖ్యంగా పేగులు, ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉంటాయి. కాలేయం, పాంక్రియాస్‌ లాంటి ఇతర భాగాల్లోనూ కనిపిస్తాయి కానీ, ఆ సంఖ్య తక్కువే. వీటిలో ఏర్పడే ట్యూమర్లే... న్యూరోఎండోక్రైన్‌ ట్యూమర్లు. ఏ శరీర భాగంలో అయినా ఇవి ఏర్పడవచ్చు. 

 కారణాలేంటి?

న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణాలు ఏమిటో ఇంతవరకూ తెలియలేదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో కూడా, అకస్మాత్తుగా ఈ క్యాన్సర్‌ నిర్ధారణ కావొచ్చు. అయితే కొన్ని అరుదైన జన్యు సిండ్రోమ్స్‌ ఉన్నప్పుడు ఈ క్యాన్సర్లు రావొచ్చు. సాధారణంగా జన్యువుల్లో మార్పులు క్యాన్సర్‌కు  కారణం అవుతాయి. ఇలా జన్యువుల్లో మార్పులు ఏర్పడటానికి కారణం ఏంటన్నది న్యూరోఎండోక్రైన్‌ క్యాన్సర్‌ విషయంలో ఇప్పటివరకు తెలియదు. న్యూరో ఎండోక్రైన్‌ కణాలు చాలావరకు నాన్‌ ఫంక్షనల్‌గా ఉంటాయి. అంటే ఏ పనీ చేయవు. కాని సైజు పెరగడం వల్ల చుట్టుపక్కల కణజాలాలపై ఒత్తిడి ఏర్పడి సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇలా సైజు పెరిగిపోయి, చాలాచోట్లకి పాకుతుంది. న్యూరోఎండోక్రైన్‌ కణాలు నాన్‌ ఫంక్షనల్‌ కాబట్టి ప్రత్యేకమైన లక్షణాలతో ఉండవు. నిశ్శబ్దంగా విస్తరిస్తూ ఉంటాయి. వ్యాధి ముదిరిన తరువాతే జీర్ణవ్యవస్థకు సంబంధించిన లక్షణాలు - వాంతులు, విరేచనాలు, బీపీలో మార్పుల వంటివి కనిపించొచ్చు. 

చికిత్స ఉందా?

క్యాన్సర్‌ ట్యూమర్లను గ్రేడ్లుగా విభజిస్తారు. తొలిదశలో ఉండి, కేవలం న్యూరోఎండోక్రైన్‌ కణాల వరకు మాత్రమే కణితి పరిమితమై ఉంటే సర్జరీ చేస్తారు. అలా కాకుండా వేరే చోటకి కణితి పాకితే కీమోథెరపీ ఇస్తారు. హై గ్రేడ్‌ ఉన్నదంటే కణితి వేరే చోటికి పాకిందన్నమాట. దీన్ని న్యూరోఎండోక్రైన్‌ కార్సినోమా అంటారు. ఇది ప్రాణాంతకం. ఇలాంటప్పుడు సర్జరీ చేయలేం. అందువల్ల కీమోథెరపీ ఇస్తారు. 

-డాక్టర్‌ అరుణ్‌ లింగుట్ల

-కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌

-అమెరికన్‌ ఆంకాలజి ఇనిస్టిట్యూట్‌,హైదరాబాద్‌


logo