గురువారం 01 అక్టోబర్ 2020
Health - Apr 13, 2020 , 23:36:30

జామలో ఆరోగ్య ప్రయోజనాలు

 జామలో ఆరోగ్య ప్రయోజనాలు జామకాయలో ఎన్నో పోషకాలతో పాటు బోలెడంత పీచు అందించే పండ్లలో జామది ప్రత్యేక స్థానం. ఆరోగ్యానికి మేలు చేసే యాంటిఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్లు, పాలిఫినాల్స్‌, కెరటి నాయిడ్స్‌ వంటి ఎన్నో పోషకాలనందించే జామలో రవ్వంత కూడా హానికారక కొలెస్ట్రాల్ ఉండదు. నారింజలో కంటే జామలో 5 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే.. పోషకాల రీత్యా ఎన్నో విశేషాలున్న జామ పండును నిర్లక్ష్యం చేయకుండా  తరచూ తీసుకుంటే ఎంతో మేలుకలుగుతుంది.
వేసవిలో దాహార్తిని తీర్చేందుకు జామ ఉపయోగపడుతుంది. వేసవిలో వృత్తిపరంగా బయట తిరిగే వారు, దూరప్రయాణాలు చేసేవారు గుప్పెడు జామ ముక్కలను 3 గంటలపాటు నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే దాహార్తి తీరుతుంది.
దోర జామపండును సానరాయి మీద అరగదీసి ఆ లేపనాన్ని నుదుటి మీద రాస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా మైగ్రెయిన్‌ బాధితులు సూర్యోదయానికి ముందే ఇలా చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
జామ పండు తింటే గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి పలు జీర్ణకోశ సమస్యలు, జలుబు దూరమవుతాయి. భోజనం తర్వాత ఒక జామ ముక్క తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మధుమేహూలుసైతం నిరభ్యంతరంగా తినదగిన ఫలం. జామ చెట్టు బెరడు డికాక్షన్‌ తాగితే పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి.
శారీరక బలహీనత ఉన్నవారు పండిన జామలోని గింజలు తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకొంటే తగినంత విటమిన్ సి, క్యాల్షియం లభించి శారీరక దృఢత్వం చేకూరుతుంది. ఎదిగేవయసు పిల్లలు, గర్భిణుల ఆరోగ్యానికీ ఇది ఎంతగానో దోహదం చేసుంది. అలాగే.. క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హైపటైటీస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలున్న వారికి సైతం పండిన జామ గుజ్జు ఔషధంగా పనిచేస్తుంది.
తరచూ జామకాయ తినేవారిలో చిగుళ్లు, దంతాలు బలోపేతమవుతాయి. జామలోని విటమిన్ సి వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. రోజూ 2,3 లేత జామ ఆకులు నమిలితే నోటిదుర్వాసన తగ్గటమే గాక దంతాలు శుభ్రపడతాయి.
తరచూ జామకాయ తినేవారికి మలబద్ధక సమస్య రాదు. ఈ సమస్య బాధితులు పండిన జామ పండ్ల ముక్కల మీద మిరియాల పొడి చల్లి, 4 చుక్కలు నిమ్మరసం పిండి తింటే ఎంతటి మలబద్దకమైనా వదిలిపోవాల్సిందే. దీనితో బాటు అతిసార, జిగట విరేచనాలు, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, గర్భిణుల్లో వాంతులకు జామ మంచి ఔషధంగా పనిచేస్తుంది.
logo