సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Apr 13, 2020 , 22:48:05

మా ఊరికి పోతా

మా ఊరికి పోతా

‘చూడండి సిస్టర్‌... నాకు జలుబులేదు, జ్వరంలేదు, తుమ్ములూ రావట్లేదు. పన్నెండు రోజుల నుంచీ ఇక్కడే ఉంచారు. మా ఇంటినీ, ఊరినీ చూడాలని ఉంది.  నాకోసం మావాళ్లెంత కంగారు పడుతున్నారో తల్చుకుంటే కన్నీళ్లొస్తున్నాయి. మీరేమో ఇలా నన్ను బతికుండగానే చంపేస్తున్నారు’... చంద్ర ఆవేదనగా చెప్పాడు. 

సిస్టర్‌ అతని వంక చూసింది. ఆ చూపులు నిశ్చలంగా, నిర్మలంగా ఉన్నాయి. అంతులేని సహనాన్ని నింపుకున్న అమృతభాండాల్లా ఉన్నాయి. 

చిరునవ్వు నవ్వుతూ.. ‘చూడండి సార్‌... మీలాంటి వారిని ముందు జాగ్రత్తగా మాత్రమే ఇక్కడ ఉంచాం. మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్నవారిలాగా ఉన్నారు. కానీ మీ అమాయకత్వానికి నవ్వు వస్తోంది. ఎక్కడో చైనాలో పుట్టి అన్ని దేశాలకూ వ్యాపిస్తున్న ఈ మహమ్మారిని విస్తరింపజేస్తున్నది మనుషులే ! అందుకే ఇతర దేశాలనుంచి ఎవరు వచ్చినా క్వారంటైన్‌లో  ఉంచుతున్నాం. నాకు ఈ మధ్యే డెలివరీ అయింది. పసిబిడ్డని నా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి ఇలా సేవ చేస్తున్నాను. చాలామంది డాక్టర్లు, నర్సులు అన్నపానాల్నీ మానేసి రోజుల తరబడి హాస్పిటల్స్‌లో పనిచేస్తున్నారు. ఇదంతా, మీ కోసమే కదా... అర్థం చేసుకోండి!’  జవాబిచ్చింది సిస్టర్‌. చంద్రం ఏమీ మాట్లాడలేదు. 

కరోనా లక్షణాలు లేకపోయినా విదేశాల నుండి వచ్చిన కారణంగానే ఇలా ‘బంధించడం’ అతడికి అవమానంగా అనిపించింది. “పద్నాలుగు రోజులు గడిచాక, తను ‘నెగిటివ్‌' అని నిర్దారణ జరిగితే... తప్పనిసరిగా తన ఊరికి వెళ్తాడు. అప్పుడు ఊళ్లోని వాళ్లంతా తననెలా చూస్తారు? తనకు ఆ వ్యాధి సోకబట్టే అంతకాలం ట్రీట్మెంటు ఇచ్చి పంపించారని అనుకోరూ? నలుగురిలో ఏ తుమ్మో వస్తే తననొక అంటురోగిలా భావించరూ?” .. తీరాన్ని తాకాలని విఫలయత్నం చేసి మధ్యలోనే విరిగిపోతున్న అలల్లా ఆలోచనలు ఎగసిపడుతున్నాయి. సేపయ్యాక మళ్ళీ ‘సిస్టర్‌.. ప్లీజ్‌... నన్ను వదిలేయండి. మా ఊరు వెళ్ళి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాను. మూడేళ్ల కిందట ఇటలీకి వెళ్ళి సంపాదించిన సొమ్ముతో  ఊరిని ఎంతో అభివృద్ధి చేయాలని కలలుగన్నాను. కానీ ఆలోచనలు కార్యరూపం దాల్చకుండానే ఇలా జీవచ్ఛవంలా’... బాధపడుతూ చెప్పాడు.

సిస్టర్‌ అతని వైపు అభావంగా చూసింది. ఆ చూపుల్లో అదే నిర్మలత్వం.  కాసేపటి తర్వాత,  “ఊరికి ఏదో చేయాలన్న మీ తపన, ఆశయం చాలా గొప్పవి. దాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ ఇప్పుడున్న  పరిస్థితుల్లో మీరు వెళ్లకపోవడమే మంచిది. ఊరికి వెళ్లిన తర్వాత, ‘పాజిటివ్‌' వచ్చిందంటే, ప్రాణానికి ప్రాణంగా భావించే పల్లెని మీరే చేజేతులా వల్లకాడుగా మార్చినవారవుతారు. ఇక్కడే ఉండి ఊరికి ఉపకారం చేస్తారో, అక్కడికెళ్లి అపకారం చేస్తారో మీరే ఆలోచించుకోండి” అంటూ బయటికెళ్ళిపోయింది. చంద్రం మాట్లాడలేదు. కాదు కాదు మాట్లాడలేడు!

- డా॥ జడా సుబ్బారావు


logo