ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Apr 12, 2020 , 22:43:05

కంటిద్వారా కరోనా..?

కంటిద్వారా కరోనా..?

కంటిమీద, ముక్కుమీద, నోటిమీద చేతులు పెట్టుకున్నప్పుడు... వాటిద్వారా కొవిడ్‌-19 శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు, ఇది కంటి నుంచి శ్వాస వ్యవస్థలోకి ఎలా ప్రవేశిస్తుందన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇందుకు కారణం కళ్లు, ముక్కు, నోరు... అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉండటమే. కంటిలో ఉండే మ్యూకోసా (శ్లేష్మపొర) ద్వారానే వైరస్‌ లోపలికి ప్రవేశిస్తుంది. ఇది కేంథస్‌ దగ్గరున్న పింక్‌ కణజాలం నుంచి మొదలవుతుంది. కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తిని ముట్టుకుని ఆ చేతులతో కళ్లను ముట్టుకున్నా, నలిపినా... చేతులకు ఉన్న వైరస్‌ మ్యూకోసాలోకి చేరుతుంది. ఇక్కడి నుంచి కంటిలోని నీటిద్వారా లాక్రిమల్‌ నాళం నుంచి, నేసల్‌ నాళం ద్వారా గొంతులోకి చేరుతుంది. మ్యూకోసా దగ్గరుండే పింక్‌ టిష్యూ అటు నోట్లోని పెదవులతోపాటు ఇటు ముక్కులోపల కూడా ఉంటుంది. కన్ను, ముక్కు, నోరు.. ఈ మూడు చోట్లా పింక్‌ టిష్యూతోపాటు మ్యూకోసా ఉంటుంది. అందుకే, ఈ మూడు మార్గాల ద్వారా కొవిడ్‌ గొంతులోకి చేరేందుకు ఆస్కారం ఉంటుంది. 

కాంటాక్ట్‌ లెన్సులు వాడొచ్చా?

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో కాంటాక్ట్‌ లెన్సులు వాడటం మంచిది కాదు. ఎందుకంటే లెన్సులు పెట్టుకున్నప్పుడు, తీసినప్పుడు చేతులు కంటికి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కళ్లద్దాలు పెట్టుకోవడం మంచిది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో... దృష్టిలోపం చాలా ఎక్కువగా ఉన్నవారు, కార్నియాకి సంబంధించిన కెరటోకోనస్‌ అనే సమస్య ఉన్నవాళ్లు మాత్రమే కాంటాక్ట్‌ లెన్స్‌ వాడాల్సి వస్తుంది. అయితే చేతులు  శుభ్రంగా కడుక్కొని, తగిన జాగ్రత్తలు తీసుకొన్నాకే వాటిని పెట్టుకోవాలి. తేడా వస్తే ప్రమాదమే.

చుక్కల మందులు వేసుకోవచ్చా?

గ్లకోమా (నీటి కాసులు) జబ్బు ఉన్నా, కంటిలో నీటి శాతం తక్కువగా ఉండి డ్రై ఐ సమస్య ఉన్నా, శుక్లాల ఆపరేషన్‌ చేయించుకున్నా, కార్నియాకి సంబంధించిన చుక్కల మందు వాడుతున్నా, కంటి జెల్‌ వాడుతున్నా... కంటిని ముట్టుకోకుండా కొంత దూరం పైనుండి చుక్కల మందు వాడవచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే..

జలుబు, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, జ్వరంతో పాటు కళ్లు ఎర్రగా అయినా... కంటి నుంచి స్రావాలు కారినా, కళ్లకు దురదలు వచ్చినా... కన్ను, నోరు పొడిబారిపోయినా... కంటిలో రక్తం చిమ్మినా (కంజెక్టివల్‌ హెమరేజ్‌)... తప్పనిసరిగా డాక్టర్‌ని కలిసి కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలి. 

  • సారికి వెంకట్రావు
  • చీఫ్‌ ఆప్టోమెట్రిస్ట్‌, కాంటాక్ట్‌ లెన్స్‌ స్పెషలిస్ట్‌
  • మాక్సివిజన్‌ ఐ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo