బుధవారం 03 జూన్ 2020
Health - Apr 08, 2020 , 21:46:17

ఆయుర్వేద మార్గం..

ఆయుర్వేద మార్గం..

స్వాస్థస్య స్వాస్థ రక్షణం... అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు. ఆతురస్య వికార ప్రశమనం.. అంటే రోగికి వచ్చిన రోగాన్ని తగ్గించే చికిత్స చేయడం... ఇవి ఆయుర్వేదం పాటించే రెండు విధానాలు. పరిపూర్ణ ఆరోగ్యవంతులు కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి ఆయుర్వేదం అనేక మార్గాలు చూపుతున్నది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు దినచర్య, రుతుచర్యలను సక్రమంగా పాటిస్తూ... ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే, 4.30కి అంతా లేవాలి. యోగా, ప్రాణాయామ చేయాలి. వ్యాధినిరోధక శక్తి బలంగా ఉండటానికి ఇక్కడే బీజం పడుతుంది. అల్పాహారానికి ముందు గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర, ధనియాలు, అల్లం వేసి మరిగించి తాగాలి. దీంతో జీర్ణవ్యవస్థ బావుంటుంది. తద్వారా రోగనిరోధకత బలోపేతం అవుతుంది. ఈ రుతువులో కఫం ప్రకోపిస్తుంది.

శిశిరంతో మొదలై ఇప్పుడు ఎక్కువ అవుతుంది. దాంతో సహజంగానే ముక్కుదిబ్బడ లాంటివి వస్తాయి. ఛాతీకి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. రుతుచర్యలో భాగంగా గోరు వెచ్చని నీరు తీసుకోవాలి. వీటి గుణాల వల్ల కఫ ప్రకోపం తగ్గుతుంది. మజ్జిగ ఎండల నుంచి ఉపశమనానికే కాదు, రోగనిరోధకత పెరగడానికీ పనిచేస్తుంది. దీనిలో ఉండే వెన్న వల్ల ఎక్కువ ప్రొటీన్‌ అందుతుంది. దీనిలో సహజమైన లాక్టోబాసిల్లస్‌ ఉంటుంది. మనుషుల పాలిట అమృతం ఇది. ఆమ్ల జ్యూస్‌ పేరుతో ఉసిరి రసం మార్కెట్లో దొరుకుతున్నది. 2 చెంచాల ఈ రసాన్ని 4 చెంచాల వేడినీటితో కలిపి పరగడుపున తాగితే రోగనిరోధకత వృద్ధి చెందుతుంది. 

ఔషధాలూ ఉన్నాయ్‌!

రోగనిరోధకతను పెంచే చిన్నచిన్న ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. గుడూచి (తిప్పతీగ) ఇందుకు బాగా పనిచేస్తుంది. గుడూచి సత్వ పేరుతో దొరికే పొడికి పసుపు కలిపి ఒక అరస్పూన్‌ రోజూ పాలలో కలుపుకొని పొద్దున్నే తాగాలి. అన్ని వయసుల వాళ్లూ తాగొచ్చు. కరోనా వ్యాధి ఆయుర్వేదంలో చెప్పిన ‘భూత అభిష్యంది జ్వరం’ - విభాగంలోకి వస్తుంది. అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చేదని అర్థం. ఈ జ్వరాలకు ఇచ్చే చికిత్స కరోనాకు కూడా పనిచేసే అవకాశం ఉంది. అల్లోపతిలో కలిసి ఆయుర్వేద చికిత్సలు కూడా ఇస్తే మంచి ఫలితాలుంటాయి. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఆయుర్వేదిక్‌ రీసెర్చ్‌ (సిసిఆర్‌ఎఎస్‌) వాళ్లు ఇలాంటి విషమ జ్వరాలకు ఆయుష్‌-64 మందు బాగా పనిచేస్తుందని అధ్యయనాలతో రుజువు చేశారు. అయితే ఇది కరోనా మీద నిర్దుష్టంగా పనిచేస్తుందనడానికి క్లినికల్‌ ట్రయల్స్‌ లేవు.  సైడ్‌ ఎఫెక్టులుండవు కాబట్టి ఈ ఔషధాన్ని ప్రయత్నించవచ్చు. ఆయుర్వేద చికిత్స 3 రకాలు. శారీరకంగా ఔషధాలు తీసుకోవడం, మనోైస్థెర్యంతో వ్యాధిని జయించడం, ఆధ్యాత్మక చింతన ద్వారా సాంత్వన పొందడం. కరోనాను ఎదుర్కోవడంలో ఇవన్నీ ఇప్పుడు కీలకమైనవే. 

  • డాక్టర్‌ సారంగపాణి
  • సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ 
  • మెడిసిన్‌ సభ్యులు,మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌ 
  • సాయి భరద్వాజ అడ్వాన్స్‌డ్‌ 
  • ఆయుర్వేద హాస్పిటల్‌ , హైదరాబాద్‌


logo