శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 06, 2020 , 22:13:53

మా బాబుకు కరోనా ఉందా?

మా బాబుకు కరోనా ఉందా?

మా బాబుకు 6 సంవత్సరాలు. గత 14 రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. వేరే ఇతర లక్షణాలేవీ లేవు. దగ్గు ఉంది కాబట్టి బాబుకు కరోనా ఉండే అవకాశం లేదు కదా. మాకు చాలా భయంగా ఉంది. 

- నీరజ, జగిత్యాల

కరోనా వ్యాధి సాధారణంగా పెద్ద వయసువాళ్ల పైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టుగా ఇప్పటివరకు చూశాం. పిల్లలకు ఇప్పటివరకు అయితే అంత రిస్కు ఏమీ చూపలేదు. ఇక మీ బాబు విషయానికి వస్తే ముందు మీరు ఆందోళన పడకండి. మీ బాబుకు కరోనా సోకే అవకాశం ఉండకపోవచ్చు. చాలావరకు పిల్లల్లో సాధారణ జలుబు వచ్చిన తరువాత దాని పై నుంచి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంటుంది. దానివల్ల దగ్గు ఎక్కువగా రావొచ్చు. అలా మీ బాబుకు సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ ఉండే అవకాశమే ఎక్కువ. కాబట్టి ముందు మీరు వెంటనే మీ బాబును పిల్లల డాక్టర్‌కు చూపించండి. యాంటిబయాటిక్‌తో మీ బాబు సమస్య తగ్గేందుకు ఆస్కారం ఉంది. అయితే కొన్నిసార్లు దగ్గును తేలిగ్గా తీసుకోలేం. అయితే మీ కుటుంబంలో ఎవరైనా ప్రయాణాలు చేసి రావడం గానీ, ప్రయాణం చేసినవాళ్ళు మీ ఇంటికి రావడం గానీ జరిగిందా? బాబు ఆడుకోవడానికంటూ వెళ్లి బయటి వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడా..? ఇలాంటి అంశాలను ఒకసారి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మీరొకసారి పీడియాట్రీషియన్‌ను కలిస్తే మీ సమస్య పరిష్కారమవుతుంది. 

డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo