సోమవారం 25 మే 2020
Health - Apr 05, 2020 , 23:42:15

కరోనా గురించి ఎప్పుడు భయపడాలి?

కరోనా గురించి ఎప్పుడు భయపడాలి?

  • గొంతునొప్పి ఉంటే  కరోనా టెస్టు చేయించాలా?
  • మూడు రోజుల నుంచి జలుబు ఉంది. పరీక్ష అవసరమా?
  • గొంతులో కొంచెం మంటగా ఉంది. నాకు కరోనా వస్తుందా?
  • గొంతునొప్పి. కొంచెం ఆయాసంగా కూడా ఉంది. కొవిడ్‌ పరీక్ష చేయించాలా?
  • దగ్గు, జలుబు. గొంతు ఇన్‌ఫెక్షన్‌ అప్పుడప్పుడూ వస్తూనే ఉంటుంది. కరోనా ఉన్నట్టా?

పాఠకుల నుంచి వచ్చిన అన్ని ప్రశ్నలకీ ఒకే సమాధానం

మీ ప్రశ్నల్లో ఎన్ని రోజుల నుంచి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయో చెప్పలేదు. కరోనా ఇన్‌ఫెక్షన్‌లో ప్రధానమైన లక్షణం జ్వరం. దీంతో పాటు దగ్గు. ఈ రెండూ బాధిస్తుంటే టెస్టు అవసరం పడొచ్చు. అయితే కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు ముందుగా గొంతునొప్పి మొదలవుతుంది. ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి. నీరసం, నిస్సత్తువ ఉంటాయి. వీటితో పాటు దగ్గు ఉన్నట్టయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ముదిరిన తరువాతే ఆయాసం వస్తుంది. కేవలం జలుబు మాత్రమే ఉంటే ఆందోళన అవసరం లేదు. కరోనా ఆందోళనతో సాధారణ జలుబుకు కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో లక్షణాలు కనిపిస్తేనే అనుమానించాలి. అప్పుడప్పుడు  జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌ వస్తున్నాయంటే మీకు వేరే సమస్య ఉండొచ్చు. మొన్నటి వరకు బాగానే ఉండి, ఇప్పుడు లక్షణాలు కనిపిస్తున్నాయంటేనే అనుమానించాలి. పైగా 14 రోజుల క్రితం మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసి ఉన్నా, ప్రయాణం చేసి వచ్చిన వాళ్లను కలిసినా, బయటి వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినా, శ్వాసకోశ సమస్యలున్నవాళ్లను పరామర్శించి వచ్చినా... ఆ తరువాత మీకు ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను కలవాలి. 104కి అయినా కాల్‌ చేయొచ్చు. లేదా మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించండి. గాంధీ, ఫీవర్‌ హాస్పిటల్‌, కోఠి హాస్పిటల్‌, ఛాతీ వైద్యశాలల్లో వెళ్లి కలవొచ్చు. లేదా దాదాపు అన్ని కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కూడా కరోనా ఇన్‌ఫెక్షన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అక్కడైనా సంప్రదించొచ్చు. 

మీరు ముందుగా భయం వదలండి. ఒత్తిడి పెంచుకోవద్దు. అలాగని నిర్లక్ష్యం తగదు. సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన అవసరం లేదు. 


డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌

హైదరాబాద్‌logo