మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Apr 02, 2020 , 23:06:49

జలుబు ఉంది.. కరోనా టెస్టు చేయించాలా?

జలుబు ఉంది.. కరోనా టెస్టు చేయించాలా?

నాకు 42 ఏండ్లు. రెండు రోజులుగా జలుబు . తలనొప్పి కూడా ఉంది. ఈమధ్య కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేసింది లేదు. కానీ కూరగాయల కోసమో, మందుల కోసమో అడపా దడపా బయటకు వెళ్తున్నాను. జలుబు ఉంది కాబట్టి , ఇప్పుడు నేను కొవిడ్‌- 19 పరీక్ష చేయించుకోవాలా?

- నీలిమ, కామారెడ్డి

కొవిడ్‌ -19కి ఒక్కోదేశంలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో కరోనా ముఖ్యంగా జ్వరంతో మొదలవుతుంది. గొంతునొప్పి ఉంటుంది. ఆ తరువాత నిస్సత్తువ, నీరసం, ఒళ్లునొప్పులు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు.. దగ్గుతో పాటు రెండు మూడు రోజుల్లో తీవ్రమైన ఆయాసంతో బాధపడుతారు. ఆక్సిజన్‌ శాతం తక్కువైపోయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతారు. ఇవి మన భారతీయుల్లో కొవిడ్‌ -19 లక్షణాలు. ఇలా కాకుండా కేవలం జలుబు మాత్రమే ఉండి, మిగతా లక్షణాలు, అంటే... దగ్గు, ఒళ్లునొప్పులు, నీరసం, ఆయాసం లాంటివేవీ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మనవాళ్లకు అలర్జిక్‌ రైనైటిస్‌, సైనస్‌ లాంటి సమస్యలు సర్వసాధారణం. అందువల్ల అలర్జీ వల్ల కూడా జలుబు లక్షణాలు కనిపించవచ్చు. మీరు కొవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్లను కలిసి వున్నా, గత 14 రోజుల క్రితం వేరే దేశం నుంచి వచ్చినా, లేదా అక్కడి నుంచి వచ్చినవాళ్లను కలిసినా, అంతకుముందు ఏ అలర్జీలు లేకుండా ఇప్పుడు కొత్తగా దగ్గు, జ్వరం, గొంతునొప్పి మొదలైనా అనుమానించాలి. 

అయితే సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సింప్టమ్‌ ఇన్‌ఫెక్షన్‌ వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు. అందువల్ల ముందుగా న్యుమోనియా, క్షయ, స్వైన్‌ఫ్లూ టెస్టులు చేసి, అవి లేకుంటే అప్పుడు కొవిడ్‌ ఉందేమోనని ఆ టెస్టు చేస్తారు. మనదేశంలో కొవిడ్‌ -19 ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవాళ్లలో 90 శాతానికి పైగా జ్వరంతోనే మొదలవుతుంది. 85 శాతం మందిలో దగ్గుతో మొదలవుతుంది. అమెరికా లాంటి దేశాల్లో ఈ లక్షణాలేవీ రాకముందే వాసన, రుచి తగ్గడం కూడా కరోనా హెచ్చరికలుగా భావిస్తున్నారు. మీ విషయంలో జలుబు మాత్రమే ఉంది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లాంటివేవీ లేవు. విదేశీ ప్రయాణం చేసిందీ లేదు. కాబట్టి మీకు అలర్జీ వల్ల గానీ, రైనోవైరస్‌ వల్ల గానీ జలుబు వచ్చి ఉంటుంది. కాబట్టి, భయపడాల్సిన పనిలేదు.  ఇంటర్నెట్‌లోని సెల్ఫ్‌ అసెస్‌మెంట్స్‌  ద్వారా కొవిడ్‌ లక్షణాలు మీకు ఉన్నాయా  అన్నది పరీక్షించుకోవచ్చు. 

డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo