శుక్రవారం 05 జూన్ 2020
Health - Mar 30, 2020 , 22:42:25

కూరగాయలతో కరోనా వస్తుందా?

కూరగాయలతో కరోనా వస్తుందా?

పండ్లు, కూరగాయల ద్వారా కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ వస్తుందా? బయటి నుంచి కొనుక్కొచ్చిన వీటిని ఎలా శుభ్రం చేయాలి? పాల ప్యాకెట్లు, క్యారీ బ్యాగులను తెచ్చినప్పుడు ఏం చేయాలి?

- వనిత, హైదరాబాద్‌

పండ్లు, కూరగాయలను అమ్మేవాళ్లు ఎవరైనా చేతులు శుభ్రంగా కడుక్కున్న తరువాతే వాటిని ముట్టుకోవాలనీ, ఇంకా వీలైతే డిస్పోజబుల్‌ గ్లౌవ్స్‌ వేసుకుని అమ్మాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా సరే మనం ఇంటికి తెచ్చుకున్న తరువాత కూడా జాగ్రత్తపడటం మంచిది. నిజానికి మనం కూరలు ఉడికించినప్పుడు ఆ ఉష్ణోగ్రతకి వైరస్‌ చనిపోతుంది. కాని ఉప్పునీటిలో వేసి కడుక్కోవడం గానీ, పొటాషియం అయోడైడ్‌ ద్రావణంతో శుభ్రం చేయడం గానీ మంచిది. దీనికన్నా కూడా వేడినీళ్లలో కడగడం మేలు. అయితే కూరగాయలను ముక్కలుగా కోయకముందే శుభ్రంగా కడగాలి. ముక్కలు కోసి కడగొద్దు. పైగా పండ్లను అలాగే తింటాం కాబట్టి వీటిని ఇలా శుభ్రం చేయడం అవసరం. 


అయితే అరటి, సంత్రా, దానిమ్మ లాంటి పండ్లను పైన తొక్క తీసి లోపలున్నది తింటాం కాబట్టి వైరస్‌ అంటుకునే ప్రమాదం ఉండదు. ద్రాక్ష లాంటి వాటిని మాత్రం ఉప్పునీటిలో వేసి శుభ్రపరచడం ద్వారా ఒక కరోనా నివారణకే కాదు, ఇతర సూక్ష్మజీవుల ఇన్‌ఫెక్షన్‌ను కూడా దూరం చేయగలం. పాలప్యాకెట్‌ ప్లాస్టిక్‌ కాబట్టి వీటిని సబ్బు నీటితో కడిగితే మంచిదే. ఇకపోతే బయట కూరగాయల్లాంటివి కొనడానికి తీసుకెళ్లే సంచి జనపనార (జూట్‌)తో చేసిందైతే మేలు. దీన్ని ఇంటి లోపలికి తీసుకురాకుండా బయట ఎండలో రోజంతా ఆరేయాలి. ప్లాస్టిక్‌ బ్యాగులు తీసుకెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే మళ్లీ మళ్లీ వాడకపోతే బెటర్‌. లేకపోతే సోడియం హైపోక్లోరైడ్‌ (30గ్రా. బ్లీచింగ్‌ పౌడర్‌, 10 లీ. నీరు) ద్రావణంతో శుభ్రంచేయాలి. పేపర్‌ కవర్లయితే కాల్చేయాలి. లోపలికి రాగానే ముందు చేతులు కడుక్కునేవరకు ఏదీ ముట్టుకోకూడదు. ఏ వస్తువును ముట్టుకున్నా చేతులు శుభ్రం చేసుకోకుండా తినొద్దు, తాగొద్దు, ముఖంపై చేతులు పెట్టొద్దు. 

డాక్టర్‌ ఎం.వి. రావు

సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌

యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo